ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్నా.. మేఘన్‌ని ప్రిన్సెస్ అనలేరు

  • 1 డిసెంబర్ 2017
మేఘన్ మార్కల్ Image copyright Getty Images

బ్రిటన్ యువరాజు హ్యారీకీ, అమెరికన్ నటి మేఘన్ మార్కెల్‌కీ వచ్చే ఏడాది మేలో పెళ్లి జరగనుంది. సాధారణంగా యువరాజు భార్య యువరాణి అవుతుంది. కానీ ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్నాక కూడా మేఘన్‌ని ప్రిన్సెస్ మేఘన్ అని పిలవరు. అలా పిలవడం రాయల్ ప్రొటోకాల్‌కి విరుద్ధం.

బ్రిటిష్ రాయల్ ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం మేఘన్‌కి రాయల్ బ్లడ్ లేదు. అంటే ఆమె రాజ వంశంలో పుట్టలేదు. అందుకే ప్రిన్స్‌‌కి భార్య అయినా ఆమెను ప్రిన్సెస్ అని పిలవడం కుదరదని రాయల్ ప్రొటోకాల్ చెబుతోంది.

ప్రిన్స్ హ్యారీ సోదురుడు ప్రిన్స్ విలియమ్‌ భార్య క్యాథరీన్ మిడిల్‌టన్‌కి కూడా గతంలో ఇదే నిబంధన వర్తించింది. విలియమ్‌ని పెళ్లి చేసుకున్నా కూడా ఆమెనెవరూ ప్రిన్సెస్ క్యాథరీన్ అని అధికారికంగా సంబోధించరు. ఆమె రాయల్ కుటుంబానికి చెందిన యువతి కాకపోవడమే దానికి కారణం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేట్ మిడిల్‌టన్‌ని కూడా ప్రిన్సెస్ అని పిలవరు

ప్రిన్స్ హ్యారీ తల్లి డయానా‌ని కూడా ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ అనే పిలిచేవారు తప్ప నేరుగా ‘ప్రిన్సెస్ డయానా’ అని పిలవలేదు. డయానా కూడా బయటి కుటుంబానికి చెందిన వారే.

బ్రిటిష్ రాయల్ ప్రొటోకాల్ ప్రకారం నేరుగా రాజ వంశంలో జన్మించిన వారికే ప్రిన్సెస్ అని పిలిపించుకునే హక్కు ఉంటుంది.

అంటే ప్రస్తుత బ్రిటన్ రాణి ఎలిజబెత్ కుమార్తె ఆణే, రాణి మనవరాళ్లు బియట్రిస్, యుజినీ.. వీళ్లందరికీ పుట్టుకతోనే పేరు పక్కన ‘ప్రిన్సెస్’ని చేర్చుకునే హక్కు ఉంటుంది. అధికారిక పత్రాల్లోనూ వారి పేరు పక్కన ‘ప్రిన్సెస్’ అని కనిపిస్తుంది.

చిత్రం శీర్షిక డయానాని ఎప్పుడూ అధికారికంగా ప్రిన్సెస్ అని పిలవలేదు

యువరాజుల్ని పెళ్లి చేసుకున్నాక కూడా వాళ్లని యువరాణులుగా పేర్కొనకపోవడం సమంజసం కాదనే చర్చ చాలా కాలంగా సాగుతోంది.

దానికి రాయల్ ఫ్యామిలీనే ఓ పరిష్కారాన్ని కనుగొంది. నేరుగా ‘ప్రిన్సెస్’ అని కాకుండా దాని పక్క ఏదో ఒక ప్రాంతానికి చెందిన పేరుని చేరుస్తోంది.

అంటే... ప్రిన్స్ విలియమ్ భార్య క్యాథరిన్ మిడిల్‌టన్‌ని ‘ప్రిన్సెస్ విలియమ్ ఆఫ్ వేల్స్’ అని పిలుస్తారు. దాన్ని బట్టి చూస్తే హ్యారీని పెళ్లి చేసుకున్నాక మేఘన్‌ని కూడా ‘ప్రిన్సెస్ హెన్రీ ఆఫ్ వేల్స్’ అనే పిలిచే అవకాశం ఉంది.

Image copyright EPA
చిత్రం శీర్షిక పెళ్లి తరవాత మేఘన్‌ని ప్రిన్సెస్ హెన్రీ ఆఫ్ వేల్స్ అని పిలిచే అవకాశం ఉంది

బ్రిటిష్ రాజ కుటుంబంలోకి గతంలో అడుగుపెట్టిన ఆడవాళ్లకు సైతం డచెస్ ఆఫ్ యోర్క్, కౌంటెస్ ఆఫ్ వెసెక్స్ లాంటి హోదాలు కల్పించారు తప్ప ఎవరికీ నేరుగా యువరాణిగా పట్టం కట్టలేదు. అంటే... ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్నా, మేఘన్ ప్రిన్సెస్ కాలేరన్న మాట.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionతండ్రి ఐరిష్, తల్లి ఆఫ్రికన్ - అమెరికన్, కాబోయే భర్త బ్రిటిష్ రాకుమారుడు !

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు