రూపాయితో కొనగలిగే 9 వస్తువులు..

  • 30 నవంబర్ 2017
రూపాయి

రూపాయి నోటుకు వందేళ్లు. అవును రూపాయి నోటు పుట్టి నేటికి సరిగ్గా వంద సంవత్సరాలు పూర్తైంది.

అప్పట్లో రూపాయి ఉంటే కుటుంబమంతా ఓ రోజంతా హాయిగా బతికేసేది. కానీ ఇప్పుడు దీనికి పెద్దగా విలువ లేదు. ఎవరైనా రూపాయి చిల్లర లేదు అన్నా పెద్దగా పట్టించుకోం. వదిలేసి వెళ్లిపోతాం.

అసలు రూపాయికి మార్కెట్లో విలువ ఎంత, రూపాయితో ఏమైనా కొనగలమా, అన్ని రకాల వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో రూపాయికి ఏం వస్తుంది?

ఈ ప్రశ్నకు బీబీసీ న్యూస్ తెలుగు ఫాలోవర్లు ఫేస్‌బుక్, ట్విటర్ పేజీల్లో ఇచ్చిన ఫన్నీ సమాధానాలు చూడండి.

చాక్లెట్: పల్లెటూళ్లలోనే కాదు, నగరాల్లో కూడా ఇప్పటికీ చిన్న చిన్న పాన్ షాపులకు వెళ్తే రూపాయికి దొరికే చాక్లెట్లు ఎన్నో. వీటి అమ్మకం కూడా జోరుగానే ఉంటుంది.

మౌత్ ఫ్రెష్‌నర్: ఇక దీని సంగతి చెప్పనవసరం లేదు. నోరు బాగోలేదని మాత్రమే కాదు, కాలక్షేపం కాకపోయినా, ఏం తోచకపోయినా కూడా చాలామంది పాస్ పాస్, లేదా ఏదైనా వక్కపొడి తినడం మనం చూస్తూనే ఉంటాం కదా. దీని ధర కూడా ఒక్క రూపాయే.

జలుబు వచ్చినపుడు, గొంతులో ఇబ్బందిగా ఉన్నా, దగ్గు ఎక్కువగా ఉన్నా చాలామందికి విక్స్, హాల్స్, కాఫ్ డ్రాప్స్ వంటి బిళ్లలను చప్పరించడం అలవాటు. ఇవి కూడా ప్రస్తుతం రూపాయికే దొరుకుతున్నాయి.

Image copyright Getty Images

బబుల్ గమ్: సరదాగా బుగ్గలు నొప్పి పుట్టేలా నమిలే బబుల్ గమ్ కూడా రూపాయే.

Image copyright Getty Images

అగ్గిపెట్టె: లైటర్లు వచ్చినా సిగరెట్ ప్రియులకు, వంటగదిలో స్టౌ, దేవుడి ముందు దీపాలు వెలిగించడానికి ఇప్పటికీ చాలామందికి అగ్గిపెట్టెనే ఆధారమంటే నమ్మశక్యంగా లేదు కదా! ఇదీ రూపాయికే దొరుకుతుంది.

Image copyright Getty Images

ఫొటోస్టాట్: సర్టిఫికెట్లు లేదా అవసరమైన పేపర్లు ఫొటోస్టాట్ తీసుకుంటుంటాం. సాధారణంగా ఒక్కో పేపరుకు రూపాయి, ఎక్కువ పేపర్లు జిరాక్స్ తీస్తే కొంతమంది రూపాయి కన్నా తక్కువే తీసుకుంటారు.

Image copyright Getty Images

కాయిన్ బాక్స్: ఇప్పుడంటే సెల్ ఫోన్లు అందరిచేతుల్లోనూ దర్శనమిస్తున్నాయి. కానీ సుమారు 10-12 సంవత్సరాల క్రితం లాండ్ లైన్ ఫోన్లే అందరి అవసరాలు తీర్చేవి. అప్పుడు చాలా షాపుల్లో కాయిన్ ఫోన్ బాక్సులుండేవి. ఇప్పటికీ కొన్ని చోట్ల వాటిని మనం చూడవచ్చు. అవి ఇంకా రూపాయి నాణెంతోనే పనిచేస్తున్నాయి.

Image copyright Getty Images

కిలో బియ్యం: ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో రూపాయికి కిలో బియ్యం దొరుకుతాయి.

Image copyright Getty Images

తలనొప్పి బిళ్లలు: చిన్న తలనొప్పి వస్తే చాలామంది డాక్టరు దగ్గరకు వెళ్లకుండా దగ్గరలోని మెడికల్ షాప్ వద్దకు వెళ్లి టాబ్లెట్లు అడిగి తీసుకుంటారు. అవి కూడా రూపాయికి రెండు వస్తాయి.

మా ఇతర కథనాలు:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)