ప్రెస్ రివ్యూ: పోలవరంపై వేడెక్కిన ఏపీ రాజకీయం

  • 1 డిసెంబర్ 2017
Image copyright NARA CHANDRABABU NAIDU/FACEBOOK

పోలవరం విషయంలో వేడెక్కిన ఏపీ రాజకీయం

ఆంధ్రజ్యోతి: పోలవరం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ టెండర్ల ప్రక్రియ ఆపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌ లేఖ రాయడంపై అసెంబ్లీలో, సభ బయట చంద్రబాబు స్పందించారు. కేంద్రం లేఖ రాసిన నేపథ్యంలో టెండర్లను నిలిపివేస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించగా ''మొత్తం పరిస్థితిని వారికి వివరిస్తాం. అయినప్పటికీ ఆపివేయాల్సిందే అని చెబితే... అలాగే చేసి, ప్రాజెక్టును కేంద్రానికే అప్పగిస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాయం చేయాలని పదేపదే అడుగుతున్నాం. సాయం చేయలేమని వారు చెప్పారనుకోండి... ఏం చేస్తాం! నమస్కారం పెట్టి తప్పుకుంటాం!'' అని తేల్చిచెప్పారు.

అయితే, తాను ఆశావాదినని, చివరి నిమిషం వరకూ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటానని అన్నారు. ''ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తిచేస్తామంటే తక్షణమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు కట్టినా ప్రాజెక్టు పూర్తికావడమే నా జీవితాశయం. ఈ విషయంలో ఎలాంటి భేషజాలూ లేవు'' అని చంద్రబాబు సభా సాక్షిగా ప్రకటించారు.

''ఇప్పటివరకూ రూ.4 వేల కోట్లు రాష్ట్ర నిధులు ఖర్చుచేశాం. ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. లేదా కేంద్రమే నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని బాధ్యత తీసుకున్నా, రాష్ట్రమంతా ఒప్పుకొని కేంద్రానికి ఆ పనులు అప్పగించాలని చెప్పినా వెంటనే కేంద్రానికి ఇచ్చేస్తాం. కావాలంటే సుమోటోగా కూడా తీసుకోవచ్చు. ఎవరు చేసినా ప్రాజెక్టు పూర్తే ధ్యేయం. ఇందులో రెండో ఆలోచనే లేదు'' అని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.

Image copyright Getty Images

అమెరికాకు విదేశీ పర్యాటకుల తగ్గుముఖం

సాక్షి: వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ట్రావెల్‌ బ్యాన్‌ కారణంగా ఈ ఏడాది జూన్‌ వరకు అమెరికాకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాపార పనుల మీద వచ్చే వారి సంఖ్య దీని కన్నా మరింత పడిపోయిందని అమెరికా ట్రావెల్‌ అండ్‌ టూరిజం కార్యాలయం తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. అందులోని వివరాలు... గతేడాది తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే అమెరికాలో పర్యటించిన వారి సంఖ్య నాలుగు శాతం పడిపోయింది. మెక్సికో పర్యాటకుల సంఖ్యలో 9 శాతం, బ్రిటన్‌ పర్యాటకుల సంఖ్యలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది.

వ్యాపారాల నిమిత్తం వచ్చే వారి సంఖ్య 9 శాతం పడిపోయింది. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయాణ నిషేధ ఉత్తర్వుల ఫలితంగా మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 30 శాతం పడిపోయింది. ఆఫ్రికా పర్యాటకుల సంఖ్య 27 శాతం తగ్గింది. ఉత్తర అమెరికా, కరీబియన్, తూర్పు ఐరోపాల నుంచి తగ్గిన పర్యాటకుల శాతం రెండంకెలకు చేరడం గమనార్హం. భారత్, వెనెజులా, అర్జెంటీనా, బ్రెజిల్‌ తదితర దేశాల పర్యాటకుల్లో 10 శాతానికి పైగా తగ్గిపోయారు. విచిత్రంగా అమెరికాతో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియా నుంచి పర్యాటకులు 18 శాతం పెరిగారు.

Image copyright Getty Images

చరిత్ర సృష్టించిన చాను

ఈనాడు: రియోలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన 23 ఏళ్ల మీరాబాయి చాను భారత్‌ గర్వపడేలా చేసింది. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సుదీర్ఘ విరామం తర్వాత దేశానికి స్వర్ణం అందించింది. గురువారం 48 కిలోల విభాగంలో ఆమె మొత్తం 194 కిలోలతో విజేతగా నిలిచింది. స్నాచ్‌లో 85 కిలోల బరువెత్తిన ఆమె క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 109 కిలోలను మోసింది. ఈ క్రమంలో జాతీయ రికార్డునూ తిరగరాసింది.

మొదట స్నాచ్‌లో 83 కిలోలు ఎత్తిన ఆమె మూడో ప్రయత్నంలో 85 కిలోలను ఎత్తింది. పోటీలో ప్రథమార్ధం ముగిసేసరికి 20 మంది లిఫ్టర్లలో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఐతే క్లీన్‌ అండ్‌ జర్క్‌లో తిరుగులేని ప్రదర్శన చేసిన చాను అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సుక్‌చారోయిన్‌ తున్య (థాయ్‌లాండ్‌) మొత్తం 193 కిలోలతో రజతం కైవసం చేసుకోగా.. కొలంబియా లిఫ్టర్‌ సెగురా అనా ఇరిస్‌ (182 కిలోలు) కాంస్యం దక్కించుకుంది.

ఈ ఏడాది కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన (192 కిలోలు) చేసిన మీరాబాయి పతక ఫేవరెట్‌లలో ఒకరిగా బరిలో దిగింది. అంచనాలకు తగ్గట్టే ఆమె అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఐతే చైనా, టర్కీ లాంటి బలమైన జట్లపై నిషేధం పడటం చానుకు కలిసొచ్చిన అంశం. అదీగాక.. 48 కిలోల విభాగంలో రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత సోపిత తనసాన్‌ (థాయ్‌లాండ్‌) 53 కిలోలకు మారటం కూడా చానుకు మేలు చేసింది.

రియో ఒలింపిక్స్‌లో స్నాచ్‌లో 82 కిలోలు ఎత్తిన చాను.. క్లీన్‌ అండ్‌ జర్క్‌ను పూర్తి చేయడంలో విఫలమైంది. ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శనను ఆమె రియో ఒలింపిక్స్‌లో చేసివుంటే రజతం దక్కేది. గతంలో రెండుసార్లు ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో పోటీపడిన చాను పతకం గెలవడం ఇదే తొలిసారి. 2014లో 11వ స్థానంలో నిలిచిన ఆమె.. 2015లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.

కరణం మల్లీశ్వరి 1994, 1995లో వరుసగా రెండేళ్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత పసిడి నెగ్గిన భారత లిఫ్టర్‌ చానునే. మీరాబాయి ఆరాధ్య లిఫ్టర్‌ కుంజరాణి దేవి 1989-1999 మధ్య కాలంలో ఏడుసార్లు రజతం నెగ్గింది. పతక బహుమతి కార్యక్రమం సందర్భంగా మువ్వన్నెల జెండా ఎగరడం చూసి మీరాబాయి ఆనందంతో కన్నీటి పర్యంతమైంది.

Image copyright GeS/2017

మహిళా పారిశ్రామికవేత్తల కోసం 'వీ-హబ్'

నమస్తే తెలంగాణ: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో వీ-హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు.

మూడు రోజులపాటు నిర్వహించిన జీఈఎస్ సదస్సు విజయవంతంగా ముగిసిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీ-హబ్ తరహాలోనే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ (వీ-హబ్)కు రూ.15 కోట్ల కార్పస్ నిధిని కేటాయిస్తున్నట్టు తెలిపారు.

జీఈ సదస్సులో పాల్గొన్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిధుల సమస్య ఏర్పడుతున్నదనే విషయం అర్థమైందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వీ-హబ్‌కు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. దీనిద్వారా మహిళలు స్థాపించే సంస్థల్లో రూ.25 లక్షల నుంచి కోటి దాకా పెట్టుబడి పెడతామని వివరించారు.

Image copyright Getty Images

కబేళాలకు పశువుల విక్రయంపై నిషేధం ఉపసంహరణ

ప్రజాశక్తి: పశువులను కబేళాలకు విక్రయించడంపై నిషేధం విధించాలన్న వివాదాస్పదమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. పర్యావరణ, అటవీ శాఖ సీనియర్‌అధికారి ఈ విషయం మీడియాకు తెలిపారు.

జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడాన్ని నివారించే చట్ట నిబంధనలను సవరించడంపై మే 23న జారీ చేసిన నోటిఫికేషన్‌పై పర్యావరణ, అటవీ శాఖ రాష్ట్రాల నుండి అభిప్రాయాలను కోరింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తున్నట్లు ఈ వారం ప్రారంభంలో న్యాయ మంత్రిత్వ శాఖకు సమాచారం పంపామని ఆ అధికారి చెప్పారు.

కేంద్రం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌పట్ల తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రైతాంగం గట్టిగా వ్యతిరేకించింది. ఈ నిషేధాన్ని కేంద్రం ఎత్తివేయవచ్చని మొదటిసారిగా సెప్టెంబరులో పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌సూచనప్రాయంగా తెలిపారు.

కబేళాలను లేదా రైతులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దెబ్బతీయడానికో లేదా ప్రజల ఆహార అలవాట్లను ప్రభావితం చేయడానికో తాము ఈ చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల అభిప్రాయాన్ని పంపాల్సిందిగా మంత్రిత్వ శాఖ కోరింది. పశువులను కబేళాలకు విక్రయించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్రం ఉపసంహరించుకోవడం రైతాంగం సాధించిన రెండో విజయమని అఖిల భారత కిసాన్‌సభ (ఎఐకెఎస్‌) ఒక ప్రకటనలో పేర్కొంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionగోసంరక్షకుల దాడులు.. వ‌ృత్తిని వదిలేస్తున్న చర్మకారులు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)