ఈ మ్యారేజీ బ్యూరో హెచ్‌ఐవీ బాధితులకోసం!

  • 1 డిసెంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇక్కడ హెచ్‌ఐవీ బాధితులకే పెళ్లి సంబంధాలు చూస్తారు!

ఎక్కడైనా ఆస్తికి, ఐశ్వర్యానికి తగ్గట్టుగా వధూవరులను వెతికిపెట్టే మ్యారేజీ బ్యూరోలు చాలానే కనిపిస్తుంటాయి. కానీ, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉన్న మ్యారేజీ బ్యూరో మాత్రం కాస్త భిన్నం. ఇక్కడ హెచ్‌ఐవీ బాధితులకు మాత్రమే పెళ్లి సంబంధాలు వెతికిపెడతారు.

కొందరు తమకు హెచ్‌ఐవీ ఉన్నట్లు తెలిసినా.. భయంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా పెళ్లి సంబంధాల కోసం సాధారణ మ్యారేజీ బ్యూరోలకే వెళ్తుంటారు. ఆ వ్యాధి లేని వారిని వివాహం చేసుకుంటారు.

అలా వివాహాలు చేసుకున్న తర్వాత ఆ వ్యాధి భాగస్వామికి.. పిల్లలకూ సోకుతుంది. దీంతో కుటుంబమంతా బాధితులుగా మారిపోతున్నారు.

అయితే, హెచ్‌ఐవీ ఉన్న వారు, ఆ వ్యాధితో బాధపడుతున్న వారినే పెళ్లి చేసుకుంటే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పరస్పరం అండగా ఉంటారు.

అలాంటి పెళ్లిళ్లు జరిపించేందుకే 2005లో హెచ్‌ఐవీ మ్యారేజీ బ్యూరోను స్థాపించారు హనుమంత్ ప్రసాద్.

2008లో http://www.hivmarriages.org/ వెబ్‌సైట్‌ను మొదలుపెట్టారు.

ఇప్పటి వరకు దాదాపు 3,000 సంబంధాలు కుదిర్చినట్టు ప్రసాద్ వెల్లడించారు.

Image copyright hivmarriages.org

ఇక్కడ సంబంధాలు చూసిపెట్టడమే కాదు.. హెచ్‌ఐవీ బాధితులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించేందుకు కౌన్సెలింగ్ ఇస్తారు.

తమ ద్వారా పెళ్లి చేసుకున్న వారిలో 90 శాతం మంది సంతోషంగా ఉన్నారని ప్రసాద్ చెబుతున్నారు.

రోజూ 30 నుంచి 40 మంది సంప్రదిస్తారని, వారిలో 20 మంది కొత్తవారుంటారని ఆయన వెల్లడించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచీ తమ వద్దకు వస్తున్నారని తెలిపారు.

పెళ్లి సంబంధాల కోసం ఇక్కడికి వెళ్లేవారు ముందుగా వాడుతున్న మందుల వివరాలు, ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.

సంబంధాలు కుదిర్చినందుకు పురుషుల నుంచి 10 వేల రూపాయలు వసూలు చేస్తారు. మహిళలకు మాత్రం ఉచితంగా సేవలు అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

హెచ్‌ఐవీ బాధితుల కోసం ఈ సంస్థ వసతి గృహాన్ని కూడా నిర్వహిస్తోంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు