పదవి వచ్చినా వివక్ష పోలేదంటున్న గుజరాత్ దళిత సర్పంచ్‌లు
- ప్రియాంక దూబే
- బీబీసీ ప్రతినిధి

గుజరాత్ ముఖ్య నగరం అహ్మదాబాద్‌కు 140 కి.మీ.దూరంలో ఉంది పఠాన్ జిల్లా. 55వ నంబరు జాతీయ రహదారి మీదుగా వెళ్తూ.. కనుచూపు మేరంతా విస్తరించిన పత్తి, గోధుమ పంటలను చూస్తూ మేం ప్రయాణిస్తున్నాం. చివరికి మేం బొరట్వాడ గ్రామానికి చేరుకున్నాం.
బొరట్వాడ గ్రామ సర్పంచ్ మహేష్ భాయ్ మక్వానాను మేము కలవబోతున్నాం. ఈ గ్రామంలో ఎన్నికైన మొదటి దళిత సర్పంచ్ మహేష్ . రొహిత్వాస్ మోహల్లాలో మహేష్ నివసిస్తారు. బొరట్వాడ గ్రామ దళితుల ఇళ్లన్నీ ఇక్కడే ఉంటాయి.
మహేష్ ఇంటికి వచ్చేశాం. ఇంటి బయట ఓ ట్రాక్టర్, కొన్ని పశువులు ఉన్నాయి. మేం లోపలకు వెళ్లాం. ఉదయాన్నే చాలా బిజీగా కనిపిస్తున్నారు మహేష్. తన ఫోన్ వైపు, పేపర్ల వైపు మార్చి మార్చి చూస్తున్నారు. తన రోజువారీ కార్యక్రమాలను ఓసారి చూసుకుంటున్నారు.
1961లో గుజరాత్ పంచాయితీ చట్టం అమల్లోకి వచ్చాక 2016లో మొదటిసారి బొరట్వాడ గ్రామం ఎస్సీ రిజర్వ్డ్ గ్రామం అయ్యింది. బొరట్వాడ గ్రామ పంచాయితీకి మహేష్ మొదటి దళిత సర్పంచ్ అయ్యారు.
2017 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థిపై 12 ఓట్లతో గెలిచారు. కానీ పంచాయితీ కమిటీ ఇప్పటికే రెండు సార్లు మహేష్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
అయితే తాను దళితుడు అయినందుకే కమిటీ మెంబర్లు తనను ద్వేషిస్తున్నారని మహేష్ భావిస్తున్నారు.
''ఈ గ్రామంలోని 3,200 మంది ఓట్లు వేస్తే నేను సర్పంచ్‌గా గెలిచాను. కానీ పంచాయితీ కమిటీలోని కేవలం ఐదుగురు ఠాకూర్లు మాత్రమే నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. వాళ్లు నన్ను కుదురుగా పని చేయనివ్వడం లేదు. అభివృద్ధి పనులకు అడ్డు తగులుతున్నారు'' అని మహేష్ అన్నారు.
బొరట్వాడ పంచాయితీ కమిటీలో మహేష్‌తో పాటుగా 11 మంది సభ్యులున్నారు. ఇందులో 5 మంది ఠాకూర్లు, 3 చౌధరిలు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానమైతే వీగిపోయింది కానీ అది మహేష్‌ను ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేసింది.
గుజరాత్ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. దళితుల కోసం 'జిగ్నేష్ మేవాని' ప్రస్తావించిన 12 డిమాండ్లను నెరవేర్చే పార్టీకే ఈసారి ఓటేస్తామన్నారు.
''అలా చేయనట్టయితే మేం ఎవ్వరికీ ఓటు వెయ్యం. జిగ్నేష్ డిమాండ్లను ఏ పార్టీ తీరుస్తుందో ఆ పార్టీకే మా ఓటు. లేకపోతే అందరమూ 'నోటా' ను నొక్కేస్తాం. ఆ డిమాండ్లతో పాటు దళితుల కోసం ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా డిమాండ్ చేయమని జిగ్నేష్‌ను అడుగుతాను'' అని మహేష్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
దళితులకు ప్రత్యేక రాష్ట్రమా?
దళితులకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అడుగుతున్నారని నేను మహేష్‌ను అడిగాను. ఆయన గట్టిగా ఓ నిట్టూర్పు విడిచాడు. ఆయన కళ్లల్లో నీళ్లు..
''ఈ గ్రామంలో కేవలం 70 దళిత కుటుంబాలున్నాయి. మొత్తం 3,200 మంది నన్ను ఓట్లేసి గెలిపించారు. కానీ కేవలం 5మంది ఠాకూర్లు నన్ను నియంత్రిస్తున్నారు. వారు ప్రజలందరి ముందు బహిరంగంగా నన్నూ, నా కులాన్నీ దూషిస్తున్నారు. ఇంత కంటే బాధ మరోటి ఉంటుందా?''
ఆ తర్వాత మేం భరత్ ఠాకూర్, దిలీప్ ఠాకూర్లను కలవడానికి బయలుదేరాం. వీరిద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ బొరట్వాడ పంచాయితీ సభ్యులే. వీళ్ల తండ్రి మెహ్గజీ ఠాకూర్ బొరట్వాడ పంచాయితీ ఉప సర్పంచ్.
మహేష్ చెప్పిన విషయాలను భరత్ ఖండించారు. మహేష్ ఏకపక్షంగా పనులు చేసుకుపోతున్నాడని, ఇతర పంచాయితీ సభ్యులను అస్సలు పట్టించుకోవడంలేదని ఆయనన్నారు.
''మా గ్రామం ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు ఊళ్లోని దళితులతో శివాలయం వద్ద సమావేశమయ్యాం. ఎలక్షన్లు వద్దని, ఓ వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోమని చెప్పాం. కానీ అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. ఎన్నికలు జరగాల్సిందేనని వాదించారు. చివరకు మహేష్ సర్పంచ్‌గా గెలిచాడు. సర్పంచ్ అయినప్పటి నుండి మహేష్ తీరు మారింది. మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. మా కుటుంబ సభ్యులు కూడా చాలా ఏళ్లుగా పంచాయితీ కమిటీలో ఉన్నారు. కానీ ఆయనో నియంత లాగా పని చేస్తున్నాడు. మేం కూడా మహేష్ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేస్తాం.''
గుజరాత్ ఎన్నికల గురించి మాట్లాడుతూ -
''మా గ్రామంలో ఏ జిగ్నేష్ ప్రభావమూ లేదు. దళితులందరూ మేం ఎవరికి ఓటెయ్యమంటే వారికే ఓటేస్తారు. అయినా.. మేం పార్టీని బట్టి ఓటేయం. అభ్యర్థిని బట్టే ఓటేస్తాం.''
అహ్మదాబాద్‌కు తిరిగి వస్తూ మెహసానా జిల్లాలోని హెదువా హనుమంత్ గ్రామ సర్పంచ్‌ను కలవడానికి ఆగాము. ఆయన పేరు సంజయ్ పర్మార్. ఈయన ఇల్లు మెహసానా పట్టణ శివార్లలో ఉంది. పట్టణానికి సమీపంలో ఉండటంతో ఈ ఊళ్లో పట్టణ వాతావరణం కనిపిస్తుంది. సంజయ్ పట్టణ నేపథ్యం నుండి వచ్చినవాడు. హెదువా పంచాయితీలో మొదటి దళిత సర్పంచ్. 2015లో సర్పంచ్‌గా గెలిచాక కేవలం 15 నెలలు మాత్రమే సంజయ్ ఆ పదవిలో ఉన్నారు.
ఆయన ఇంటికి మేం వెళ్లగా ఆయన జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిసింది. అయినా తన అనుభవాలను మాతో పంచుకోవడానికి ఒప్పుకున్నారు.
ఆసుపత్రి బెడ్ మీద సంజయ్ పడుకుని ఉన్నారు. ఆయనకు సెలైన్ బాటిల్ పెట్టారు. తన అనుభవాలను ఇలా చెప్పసాగారు -
''గత 63 సంవత్సరాల్లో ఏ సర్పంచ్ కూడా ఇలాంటి ఇబ్బందులు పడలేదు. ఈ ఇబ్బందులన్నీ దళిత సర్పంచ్‌కు మాత్రమే ఎందుకు? పంచాయితీ బడ్జెట్ పాస్ చేయడానికి వీల్లేదు. ఏ అభివృద్ధి పనులూ చేయడానికి వీల్లేదు. అన్నిటికీ అడ్డుపడుతున్నారు'' అని ఆయనన్నారు.
సర్పంచ్‌గా ఉంటూ సంజయ్ చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. కుల వివక్షనూ ఎదుర్కొన్నారు. ఈ వివక్షకు సంబంధించి కొందరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి న్యాయపోరాటం చేస్తున్నారు.
20017లో జరిగిన ఎన్నికల్లో సంజయ్ మళ్లీ సర్పంచ్‌గా గెలిచారు. అయితే ఈసారి ఎస్సీ రిజర్వ్ సీటుపై కాదు. జనరల్ కోటాలో గెలిచారు. రెండోసారి తన విజయం గురించి మాట్లాడుతూ -
''హెదువా పంచాయితీలోని పట్టణ విద్యావంతుల ఓట్ల వల్లనే నా విజయం సాధ్యపడింది. గ్రామీణ ఓట్లనే నేను నమ్ముకునివుంటే గెలిచేవాడిని కాదు. మా నాన్న ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నదంతా పట్టణ వాతావరణంలోనే. రాజకీయాల్లోకి రాకముందు నేను దళితుడిని అన్న స్పృహ కూడా నాకు లేదు. పంచాయితీ కమిటీలోకి వచ్చాకే నేను ఈ వివక్షను అనుభవించాను'' అని సంజయ్ చెప్పుకొచ్చారు.
ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ ఎన్నికల గురించి తన అభిప్రాయం చెబుతూ -
''జిగ్నేష్ మాకు ఓ బలం. కానీ రాజకీయాల్లో జిగ్నేష్ ప్రభావం ఎట్లా ఉంటుందో చూడాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలని జిగ్నేష్‌ను కోరుతున్నా. దళితుల కోసమే ఓ ప్రత్యేక పార్టీ స్థాపిస్తే బావుంటుంది'' అని సంజయ్ అన్నారు.
మెహ్సానా జిల్లా అకాబ పంచాయితీ సర్పంచ్ మను భాయ్. సంజయ్, మహేష్‌ల కంటే మను భాయ్‌కు భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఇతను బీజేపీ తరఫున పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కూడా మను చెబుతున్నారు.
''గుజరాత్లో దళితుల పరిస్థితి దయనీయంగా ఉందన్న విషయాన్ని పూర్తిగా కాదనలేం. కానీ ఇందుకు బీజేపీ కారణం కాదు. ఇది ఓ సామాజిక సమస్యే కానీ దీనిని రాజకీయాలతో ముడిపెట్టలేం. దళితుల కోసం గుజరాత్ ప్రభుత్వం పని చేస్తోంది. మా నేతలు రమణ్‌లాల్ ఓరా, ఆత్మారామ్ పర్మార్ మాకోసం నిరంతరంగా పోరాడుతూనే ఉన్నారు. అందుకే ఈసారి కూడా మా ఓటు బీజేపీకే..''
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)