దిల్లీ వైద్యుల నిర్లక్ష్యం: బతికున్న పసికందు చనిపోయిందన్నారు

  • 2 డిసెంబర్ 2017
బేబీ

దిల్లీ బదర్‌పూర్‌లో ఉండే రోహిత్‌ భార్య వర్ష ఐదు నెలల గర్భవతి. నొప్పులు రావడంతో మాక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నెలలు పూర్తిగా నిండకుండానే ఆమెకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.

ముందు బాబు పుట్టాడు. 12 నిమిషాల తర్వాత పాప పుట్టింది. పాప చనిపోయిందని, బాబు బతికి ఉన్నాడని సిబ్బంది చెప్పారు. కానీ, బాబు పరిస్థితి విషమంగా ఉందని, బతికే ఆశలు లేవని డాక్టర్లు తెలిపారు. కాసేపటి తర్వాత బాబు కూడా చనిపోయాడని వైద్యులు చెప్పారు.

రెండు డెడ్‌బాడీలను వేర్వేరు పార్సిల్‌లలో చుట్టి రోహిత్‌కు అప్పగించారు. ఆయన భార్య వర్ష ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రిలోనే ఉంది. మృత శిశువులను ఇంటికి తీసుకొచ్చిన రోహిత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Image copyright Getty Images

పార్శిల్‌లో ఉన్న కవలల మృతదేహాలను శ్మశానానికి తీసుకెళ్లేందుకు రోహిత్ సోదరి తన చేతుల్లోకి తీసుకున్నారు. అంతలో ఒక పార్సిల్‌లో కదలిక వచ్చింది. బాబు కదులుతున్నట్లు అనిపించింది. అయితే, అంతా తన భ్రమ అని అనుకుంది.

పార్శిల్ మళ్లీ కదిలింది. ఈసారి పరీక్షించి చూసింది. తన కళ్లను తానే నమ్మలేదు. ఆ పార్సిల్‌లో ఉన్న శిశువు శ్వాస తీసుకుంటోంది. కాళ్లు ఆడిస్తోంది. చనిపోయిందని డాక్టర్లు చెప్పిన బిడ్డ బతికే ఉంది!

బాబు ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసి వెంటనే సమీపంలోని కార్పొరెట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించిన తర్వాత, శిశువు తల్లి ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు.

డాక్టర్ల నిర్లక్ష్యంపై నిలదీశారు. బతికుండానే బాబు చనిపోయాడని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై దిల్లీ సర్కార్‌ కూడా స్పందించింది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. 'ఇది క్షమించరాని నేరం' అని దిల్లీ ఆరోగ్య మంత్రి అన్నారు.

వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వెల్లువెత్తడంతో శిశువు మృతిపై మాక్స్ ఆస్పత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి.

తాము శిశువులను కదిపి చూశామని, కదలిక లేకపోవడంతోనే చనిపోయినట్లు ప్రకటించామని తెలిపారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను సెలవులో వెళ్లమని చెప్పామని, దర్యాప్తు కూడా చేస్తామని వివరణ ఇచ్చారు.

దిల్లీలో ఇటీవల ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గత నెల మరో ప్రైవేటు ఆస్పత్రిలో జ్వరంతో ఒక పాప చనిపోయింది. దానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్‌‌పై హత్యాయత్నం కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆప్

దిల్లీ హింస: ‘హిందువుల ఆలయాలను ముస్లింలు రక్షించారు’

వాట్సాప్, ట్విటర్, టిక్‌టాక్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

యువకుడి ఆచూకీ కోసం వెదుకుతుంటే సింహాల బోనులో అస్థిపంజరం దొరికింది

కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా.. శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’

యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్

దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ ఎవరు.. ఆయన బదిలీపై చర్చ ఎందుకు

దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది

దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...