భూసేకరణ చట్టం: ఏపీ, తెలంగాణలు ఎలా మార్చేశాయి?

 • 2 డిసెంబర్ 2017
భూసమీకరణ చట్టంపై ఆందోళన చేస్తున్న రైతు Image copyright Getty Images

భూసేకరణ చట్టంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేస్తున్నాయి. ఈ సవరణలు చట్టస్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం వివిధ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇవి అవసరమే అంటున్నాయి.

ఆ వరుసలో గుజరాత్ ముందు నిలువగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఇంతకీ భూసేకరణ చట్టం 2013లో ఏ నిబంధనలను సవరిస్తున్నారు? ఎలా సవరిస్తున్నారు? ఎందుకు సవరిస్తున్నారు?

Image copyright Getty Images

ఏమిటి 2013 భూసేకరణ చట్టం?

1894లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటిసారి భూ సేకరణ చట్టం తెచ్చింది. ఈ చట్టం ఆధారంగానే దాదాపు 120 సంవత్సరాల పాటు మన దేశంలో ప్రభుత్వాలు భూ సేకరణ చేశాయి. భూములను బలవంతంగా తీసుకోవడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు తలెత్తాయి.

పశ్చిమబెంగాల్‌లో సింగూరు, నందిగ్రామ్‌లలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో భూసేకరణ విధానాలపై నిరసనలు ఉధృతమయ్యాయి. పాత చట్టాన్ని మార్చాలన్న డిమాండ్లు సుదీర్ఘ కాలంగా బలపడటంతో యూపీఏ-2 ప్రభుత్వం 'భూ సేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం -2013' చేసింది.

2014 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టంలో అనేక అంశాలను పొందుపరిచింది.

ఈ చట్టంలోని 107 సెక్షన్ ప్రకారం.. ఈ చట్టం కింద చెల్లించగల పరిహారం కన్నా అధికంగా పరిహారం చెల్లించేందుకు లేదా ఈ చట్టంలో పేర్కొన్న పునరావాసం, పునర్నిర్మాణం ప్రయోజనాలకన్నా మెరుగైన ప్రయోజనాలను అందించేందుకు.. ఈ చట్టాన్ని మెరుగుపరచడం లేదా మరిన్ని అంశాలను చేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయవచ్చు.

ఈ సెక్షన్‌ కింద గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు.. అసలు చట్టంలోని కీలక అంశాలను నిర్వీర్యం చేస్తూ తమకు అనుకూలంగా భూసేకరణ చట్టాలను రూపొందించాయి.

Image copyright Getty Images

అసలు చట్టంలోని ముఖ్యాంశాలు

 • ప్రభావిత ప్రాంతంలో భూసేకరణ వల్ల కలిగే సామాజిక ప్రభావంపై సర్వే చేయాలి. పునరావాస, పునర్మిర్మాణ ప్రణాళికను రూపొందించాలి. ప్రజాభిప్రాయం సేకరించి నివేదికలో పొందుపరచాలి. గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ లేదా కార్పొరేషన్ ఆమోదం పొందాలి.
 • బహుళ పంటలు పండే భూమిని అనివార్యమైతే చివరి దారిగా తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించరాదు. ఒకవేళ సేకరించాల్సివస్తే ఆ పంట భూమికి బదులుగా ప్రత్యామ్నాయ భూమికి నీటి సౌకర్యం కల్పించి, దానిని అభివృద్ధి చేసి ఆహార ధాన్యాల కొరత రాకుండా చూడాలి.
 • ప్రభుత్వ, ప్రభుత్వ - ప్రయివేటు ప్రాజెక్టుల కోసం భూమిని తీసుకుంటే 70 శాతం, ప్రయివేటు సంస్థల కోసం తీసుకుంటే 80 శాతం ప్రభావిత కుటుంబాలు సమ్మతి తెలిపితేనే భూసేకరణ మొదలు పెట్టాలి. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన భూములైతే ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను సేకరించరాదు.
 • సేకరించే భూమి మార్కెట్‌ విలువ ఆధారంగా.. గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్ల వరకూ, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్ల వరకూ అదనంగా నష్టపరిహారం ఇవ్వాలి. పట్టణాభివృద్ధి కోసం సేకరించినట్లయితే.. ఆ భూమిని అభివృద్ధి చేసి యజమానులకు 20 శాతం భూమి ఇవ్వాలి. పరిశ్రమల్లో 25 శాతం వాటా ఇవ్వాలి.
 • ఇళ్ళు కోల్పోతే ఇందిరా ఆవాస్ యోజన కింద ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. పట్టణ ప్రాంతాలలోనైతే 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. దీనికి బాధితులు ఆమోదించకపోతే ఒకేసారి రూ.1.50 లక్షలకు తగ్గకుండా ఎక్కువ ఎంతైనా ఇవ్వవచ్చు.
 • సాగునీటి ప్రాజెక్టు క్రింద భూమి కోల్పోయిన చిన్నస్థాయి రైతు కుటుంబానికి కనీసం ఎకరం భూమి ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకైతే కోల్పోయిన భూమికి సమానంగా మరోచోట భూమి ఇవ్వాలి. ఇళ్ళు పోతే ఆ ఇంటి నిర్మాణ ఖర్చు అంచనా కట్టి అంతే మొత్తంలో చెల్లించాలి.
 • సేకరించే భూమిపై ఆధారపడ్డ కూలీలు, కౌలుదారులు, వృత్తిదారులు ఎవరైనా సరే భూ సేకరణకు ముందు మూడు సంవత్సరాల పాటు సదరు భూమిపై ఆధారపడి ఉన్నట్లయితే వారందరూ పరిహారానికి అర్హులవుతారు.
 • వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, చిరువ్యాపారులు, ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ ఒకరికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇవ్వాలి లేదా ఒకేసారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలి లేదా 20 సంవత్సరాల పాటు నెలకు రూ. 2,000 చొప్పున చెల్లించాలి.
 • సేకరించిన భూమిలో ఐదు సంవత్సరాల లోపు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోతే ఆ భూమిని దాని పూర్వపు యజమానులకు గానీ, వారి వారసులకు గానీ తిరిగి ఇవ్వాలి.
 • పరిహారం, పునరావాసం, పునర్నిర్మాణానికి సంబంధించి ఏ అంశాలనైనా ప్రభుత్వ అధికారులు, కంపెనీలు ఉల్లంఘిస్తే సదరు వ్యక్తులకు కనీసం ఆరు నెలలు, గరిష్టంగా మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
Image copyright Getty Images

ఈ చట్టం మీద ప్రతిస్పందనలు ఏమిటి?

 • 2013 భూసేకరణ చట్టంలో పొందుపరిచిన పునరావాసం, పునర్నిర్మాణం, నష్ట పరిహారం, యజమానుల అంగీకారం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయని సామాజిక సంస్థలు, రైతు సంఘాలు ఆహ్వానించాయి. అయితే 'ప్రభుత్వ అవసరం' అనేదానికి నిర్వచనంలో అస్పష్టత, కౌలు రైతులకు పరిహారం వంటి అంశాలపై నిర్దిష్టత లోపించాయని అసంతృప్తీ వ్యక్తమైంది.
 • మరోవైపు పారిశ్రామిక వర్గాల నుంచి ఈ చట్టం మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సామాజిక సర్వే, పునరావాసం, పునర్నిర్మాణం తదితర నిబంధనలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని.. భూయజమానుల్లో 80 శాతం మంది ఆమోదం వంటి నియమాల వల్ల భూసేకరణ కష్టమవుతుందని పేర్కొన్నాయి.
 • ఈ నిబంధనల వల్ల భూసేకరణ ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరుగుతుందని, ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశాయి. దేశంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, భూముల రేట్లు పెరిగిపోతాయని చెప్పాయి.
Image copyright Getty Images

మోదీ సర్కారు సవరణలు ఏమిటి?

 • 2014 మే చివర్లో కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చింది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెప్పిన బీజేపీ.. పారిశ్రామిక వర్గాల ఆందోళనను పరిష్కరించడానికి 2013 భూసేకరణ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది.
 • భూయజమానుల అంగీకారం తప్పనిసరి అన్న నిబంధనను సడలించటం.. సామాజిక ప్రభావ సర్వే తప్పనిసరి అనే నిబంధనను తొలగించటం.. బహుళ పంటలు పండే భూములను కూడా సేకరించటం.. 'ప్రజా అవసరాల'లో ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు విద్యా సంస్థలను చేర్చటం.. 'ప్రైవేటు కంపెనీ' పదాన్ని 'ప్రైవేటు ఎంటిటీ' అని మార్చటం.. భూమిని ఐదేళ్లపాటు వినియోగించకపోతే తిరిగి ఇచ్చేయాలన్న నిబంధనను సడలించటం వంటి సవరణలు అందులో ఉన్నాయి.
 • వీటిని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పౌర సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ చట్టాన్ని ఆమోదించినపుడు బీజేపీ కూడా మద్దతు తెలిపిందని కాంగ్రెస్ గుర్తుచేసింది. లోక్‌సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో అవసరమైనంత మద్దతు లేకపోవడంతో ఈ సవరణలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలను ఒప్పించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు.
 • దీంతో 2014 డిసెంబర్ 31న ఈ సవరణలను ఆర్డినెన్స్ రూపంలో అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత 2015 మే 30 వరకూ మరో రెండు సార్లు ఇదే ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఆ తర్వాత బీహార్, దిల్లీ తదితర రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో ఆర్డినెన్స్ కాలం ముగిశాక అలా వదిలేసింది. లోక్‌సభలో ఆమోదం పొందిన సవరణ బిల్లు రాజ్యసభలో ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
Image copyright Getty Images

గుజరాత్ ఏం చేసింది?

 • 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో శాసనసభలో బిల్లు ఆమోదించింది. 'ప్రజా అవసరాలు', 'పారిశ్రామిక కారిడార్ల' కోసం చేపట్టే భూసేకరణకు సమాజిక ప్రభావ సర్వే, భూయజమానుల అంగీకారం నిబంధనలను తొలగించింది. రక్షణ రంగం, రోడ్లు, కాలువలు, స్కూళ్లు, అందుబాటు ధరలో గృహ నిర్మాణం వంటి సామాజిక మౌలిక వసతులను ప్రజా అవసరాలుగా పేర్కొన్నారు. దీనికి రాష్ట్రపతి ఆగస్టులో ఆమోదం తెలిపారు.
 • కేంద్రంలో మోదీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌లో పొందుపరచిన మార్పులన్నీ దాదాపుగా గుజరాత్ చట్టంలో ఉన్నాయి.
 • 2013 భూసేకరణ చట్టం వల్ల భూసేకరణ ప్రక్రియ సుదీర్ఘంగానూ కష్టంగానూ మారిందని.. కాబట్టి అందులో కఠినమైన నిబంధనలను సడలించాల్సిన అవసరముందని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది.
Image copyright Getty Images

తెలంగాణ ప్రభుత్వం ఎలా మార్చింది?

 • తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ కోసం 2015 జూలై 30వ తేదీన జీఓ 123 జారీ చేసింది. దానిప్రకారం.. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో 'భూసేకరణ కమిటీ'లను ఏర్పాటు చేసి.. 'సుముఖంగా ఉన్న భూయజమానుల నుంచి ప్రజా అవసరాల కోసం' భూమిని సేకరిస్తారు. ఆ భూమికి మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తారు. భూములను తహసీల్దారు పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తారు.
 • ప్రభుత్వంతో ఒకసారి ఒప్పందం చేసుకుంటే ఆ భూమి/ఇల్లుపై యజమాని పూర్తిగా హక్కులు కోల్పోతారు. ఆ జీఓ చెల్లదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు 2016 ఆగస్టులో కొట్టివేసింది. 2013 భూసేకరణ చట్టం నిర్దేశించిన అనేక అంశాలను ఈ జీఓ విస్మరించిందని తప్పుపట్టింది.
 • దీంతో తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో 2017 మే నెలలో సవరించిన భూసేకరణ చట్టాన్ని నోటిఫై చేసింది. 2013 భూసేకరణ చట్టంలో నిర్దేశించిన.. సామాజిక ప్రభావ సర్వే, 70 లేదా 80 శాతం మంది యజమానుల అంగీకారం, మార్కెట్ విలువకు నాలుగు రెట్ల వరకూ పరిహారం, పునరావాసం, పునర్నిర్మాణం, భూమిపై ఆధారపడ్డ వారికి పరిహారం వంటి నియమనింభనలు చాలా వరకూ వర్తించకుండా చేసింది.
 • బహుళ పంటలు పండే భూములను అత్యవసరమైనపుడు తప్పనిసరి పరిస్థితుల్లో మినహా సేకరించరాదన్న నిబంధన.. 'ప్రజా అవసరాల కోసం భూసేకరణ'కు వర్తించకుండా సవరించింది. 'ప్రజా అవసరాల' కింద.. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు, మౌలిక వసతుల నిర్మాణం, పారిశ్రామిక కారిడార్లు వంటివన్నీ చేర్చింది.
 • పునరావాసం, పునర్నిర్మాణానికి బదులుగా ఒకేసారి ఏకమొత్తం పరిహారం చెల్లించేలా నిబంధనల్లో మార్పుచేసింది. 2013 భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిన 2014 జనవరి 1వ తేదీ నుంచీ ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొంది.
Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్ సర్కారు చేసిన మార్పులేమిటి..?

 • ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం కోసం 'భూ సమీకరణ' పేరుతో వినూత్న విధానాన్ని అమలు చేసింది. రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టును 2013 భూసేకరణ చట్టం నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 'ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి సంస్థ చట్టం 2014'లో ఇందుకు సంబంధించిన విధివిధానాలను చేర్చింది.
 • 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న సామాజిక ప్రభావం సర్వే, బహుళ పంటల భూములకు మినహాయింపు, మార్కెట్ విలువకు నాలుగు రెట్ల వరకూ పరిహారం, పునరావాసం, పునర్నిర్మాణం వంటి నియమనిబంధనల ఊసులేదు. భూయజమానులు 'స్వచ్ఛందంగా' అప్పగించే భూములను ప్రభుత్వ సంస్థ సమీకరిస్తుంది. వాటిని అభివృద్ధి చేసిన తర్వాత అందులో భూమి, యాజమాన్యం వర్గీకరణను బట్టి ఎకరాకు 50 చదరపు గజాల నుంచి 1,000 వెయ్యి చదరపు గజాల వరకూ ప్లాట్లను యజమానులకు అప్పగిస్తారు. పదేళ్ల పాటు ఏటా ఎకరాకు రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకూ చెల్లిస్తారు. సదరు వ్యవసాయ భూములపై ఆధారపడ్డ మిగతా వారందరికీ పదేళ్ల పాటు నెలకు రూ. 2,500 చొప్పున పెన్షన్ చెల్లిస్తారు. ఈ భూసమీకరణ విధానాన్ని పలు ఇతర ప్రాజెక్టులకు కూడా అమలు చేసింది.
 • భూసమీకరణలో భూమిని ఇవ్వడానికి ఒప్పుకోని వారి నుంచి భూసేకరణ చేయడం కోసం గుజరాత్, తెలంగాణల బాటలోనే 2013 భూ సేకరణ చట్టానికి సవరణ చేస్తూ 2017 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ఆమోదించింది. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు సవరించిన విధంగానే.. కీలకమైన సామాజిక ప్రభావ సర్వే, భూయజమానుల అంగీకారం, నష్టపరిహారం, పునరావాసం, పునర్నిర్మాణం వంటి నిబంధనలన్నిటినీ సడలించింది.
 • కేంద్ర భూసేకరణ చట్టానికి 'సబ్ క్లాజ్ 10ఏ'ని చేర్చుతూ.. దేశ రక్షణ , గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు, గృహనిర్మాణం, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నెలకొల్పే పారిశ్రామిక కారిడార్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు తదిరాలను పేర్కొంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భారీగా భూమిని సేకరించాలనుకున్నప్పుడు బహుళ పంటలు పండే భూములకు మినహాయింపు, సామాజిక ప్రభావం అంచనా, భూయజమానుల అంగీకారం, గ్రామసభల ఆమోదం, రెట్టింపు పరిహారం వంటి నిబంధనలు ఈ ప్రాజెక్టులకు వర్తించవని నిర్దేశించారు.
 • మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుకు మరిన్ని మార్పులు చేస్తూ తాజాగా శాసనసభ శీతాకాల సమావేశాల్లో నవంబర్ చివర్లో తాజా బిల్లును ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే చట్టంగా మారుతుంది.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionనా బాధ చూసి రెండేళ్ల కూతురు కూలి పనికి వస్తానంటోంది!

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు