ఆంధ్రప్రదేశ్: బోయింగ్ విమానాన్ని నడుపుతున్న అతి పిన్న భారతీయ మహిళా పైలెట్
- గుర్ప్రీత్ కౌర్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Rocky
మధ్య తరగతి నుంచి వచ్చిన అనీ దివ్య గతంలో ఎప్పుడూ విమానం ఎక్కలేదు. కానీ తన ఆసక్తితో పట్టుదలగా పైలెట్ శిక్షణ తీసుకున్నారు. 30 ఏళ్ల అనీ, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ అయిన బోయింగ్ 777ను నడిపే అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలెట్‌గా పేరొందారు.
అనీ పంజాబ్‌లో జన్మించారు. ఆమె తండ్రి సైనికుడు. అనీ పదేళ్ల వయసులో, ఆమె తండ్రికి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు బదిలీ అయింది.
పైలెట్ కావాలనేది చిన్నప్పటి నుంచి అనీ కల. కానీ ఆ కలను నిజం చేసుకోవడం అంత సులభమేమీ కాలేదు.
పైలెట్ శిక్షణకు అవసరమైన రూ.15 లక్షలను అనీ తండ్రి సమకూర్చలేకపోయారు. దీంతో కొంత సొమ్మును స్నేహితుల నుంచి అప్పుగా తీసుకుని, మిగతాది బ్యాంక్ లోన్ తీసుకున్నారు.
''నా తల్లిదండ్రులు నాపై విశ్వాసాన్ని ఉంచారు. అందుకు నేను వారెప్పటికీ రుణపడి ఉంటాను'' అంటారు అనీ.
ఫొటో సోర్స్, Neelutpal das
ఇంగ్లీష్ వింగ్లీష్
ఆ తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరా గాంధీ నేషనల్ ఫ్లయిట్ అకాడెమీలో చేరారు. అయితే ఆమెకు ఎదురైన సవాళ్లు అక్కడితో ఆగిపోలేదు.
విధి నిర్వహణలో భాగంగా పైలెట్లు పలు దేశాలలో పర్యటించాల్సి ఉంటుంది. అక్కడి వాళ్లతో మాట్లాడాల్సి ఉంటుంది. అందుకోసం ఇంగ్లీష్‌లో సంభాషించే నైపుణ్యం చాలా అవసరం. కానీ అనీ ఇంగ్లీష్ అంత బాగుండేది కాదు.
అందువల్ల ఆ భాషను మెరుగుపరచుకొనేందుకు ఆమె తన క్లాస్‌మేట్స్‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడ్డం ప్రారంభించారు.
''మొదట అందరూ నన్ను ఎగతాళి చేసేవారు. కానీ తర్వాత కొంతమంది నా భాషలోని తప్పుల్ని సరిచేసేవారు'' అని తెలిపారు అనీ.
ఇంగ్లీష్ సినిమాలు, వార్తలు చూడడం, పాటలను వినడం ద్వారా కూడా అనీ తన ఇంగ్లీష్‌ను మెరుగుపరచుకున్నారు. ఈరోజు తన ఇంగ్లీష్, హిందీ కంటే బాగుంటుంది అంటారామె.
ఫొటో సోర్స్, Akhil Bhakshi
సమస్యలు లేనిదెక్కడ?
అనీ 17 ఏళ్ల వయసులోనే పైలెట్ కోర్సు పూర్తి చేశారు. 19 ఏళ్ల వయసులో ఆమెకు ఎయిర్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. 21 ఏళ్ల వయసులో ఆమె బోయింగ్ 737 విమానాన్ని నడిపారు. ఇటీవలే ఆమె బోయింగ్ 777ను నడిపారు.
బోయింగ్ 777 విమానాన్ని నడిపిన అత్యంత పిన్న వయస్కురాలైన పైలెట్‌గా అనీ గుర్తింపు పొందారు.
అనీ కెరీర్లో సుదీర్ఘకాలం నడిపిన ఫ్లైట్ - ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో. దానికి 18 గంటల సమయం పట్టింది.
ఒక మహిళగా పనిలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా.. సమస్యలు అన్ని చోట్లా ఉంటాయని సమాధానమిచ్చారు అనీ. కానీ వాటిని పక్కనబెట్టి పని మీద దృష్టి కేంద్రీకరిస్తానని అన్నారు.
అయితే నేటికీ ఆడపిల్లలకు ఇంకా స్వేచ్ఛ లేదనేది అనీ అభిప్రాయం.
''ఇవాళ్టికి కూడా విజయవాడలోని చాలా కాలేజీల్లో ఆడపిల్లలు ప్యాంట్లు, షర్టులు వేసుకోవడానికి వీల్లేదు'' అని అనీ తెలిపారు.
ఫొటో సోర్స్, Akhil Bhakshi
ఆరోగ్యమే మహాభాగ్యం
''నన్ను నేను ఫిట్‌గా ఉంచుకుంటాను. అందుకోసం రోజూ వర్కౌట్ చేస్తాను. ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాను'' అని అనీ తెలిపారు.
సాధారణ యువతుల్లాగే అనీ కూడా సమయం దొరికినప్పుడు పాటలు పాడతారు, సంగీతం వింటారు, సరదాగా స్నేహితులను కలుస్తారు.
తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతూ.. తనలాగే పైలెట్ కావాలనుకునేవారికి సూచనలు ఇస్తానని తెలిపారు.
పైలెట్ కావాలనుకునే వాళ్లకు ప్రభుత్వం సాయం చేయాలని ఆమె సూచించారు.
''చాలా ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్లలో విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు దొరకడం లేదు. వాళ్లకు బ్యాంకులు ఇస్తున్న రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వం వాళ్లకు తక్కువ వడ్డీతో రుణం లభించేలా చూడాలి'' అన్నారు.
ఫొటో సోర్స్, Rocky
చాలా మందికి పైలెట్ కావాలనే కల ఉంటుంది. అయితే వారికి సరైన దిశానిర్దేశం, సమాచారం అందించే వాళ్లు లేరు. అలాంటి వాళ్లకు అనీ ఇచ్చే సూచనలు:
- ప్లస్ టూలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తీసుకోండి.
- పైలెట్ కోర్సులో చేరాలంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి.
- ఈ వృత్తిలో ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఇంటర్వ్యూ సందర్భంగా చాలా పరీక్షలుంటాయి. ఉద్యోగం వచ్చాక కూడా ప్రతి ఏడాది వైద్య పరీక్షలుంటాయి. అందువల్ల మొదటి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
- ఆర్థిక ఇబ్బందులుంటే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- నిరంతరం మీ ఇంగ్లీష్ ను మెరుగుపర్చుకోండి. అన్నిటికన్నా ఇది చాలా ముఖ్యం.
(ఇది 2017 డిసెంబరు 03న ప్రచురితమైన కథనం. ఎక్కువ మందికి అందించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మళ్లీ పబ్లిష్ చేశాం.)
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)