రైతులకు మార్గదర్శి గుజరాత్ గెనభాయి పటేల్‌.

  • వినీత్ ఖరే
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

దానిమ్మ రైతులకు మార్గదర్శి

గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లాలోని రైతులకు 15 ఏళ్ల కిందటి వరకు దానిమ్మ ఎలా సాగు చేయాలో చెప్పిన వారే లేరు. కానీ, ఇప్పుడు అదే ప్రాంతం దానిమ్మ తోటలతో కళకళలాడుతోంది. విదేశాలకు నాణ్యమైన పండ్లను ఎగుమతి చేసే స్థాయికి చేరింది.

ఇంతటి మార్పు తెచ్చిన ఘనత ఈ 53 ఏళ్ల రైతు, పద్మశ్రీ గెనభాయి పటేల్‌దే.

చిన్నతనంలోనే గెనభాయిని పోలియో మహమ్మారి కాటేసింది. కాళ్లపై నడవలేకున్నా వ్యవసాయంలో అనుసరించాల్సిన మెలకువలన్నీ నేర్చుకున్నారీయన.

ఈ క్రమంలోనే తరతరాలుగా సాగు చేస్తున్న ఒకేవిధమైన సంప్రదాయ పంటలు లాభదాయకంగా ఉండటంలేదని గుర్తించారు. అందుకు ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచించారు.

తమ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు దానిమ్మ తోటలకు చాలా అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. 2004లో మహారాష్ట్ర వెళ్లి దానిమ్మ మొక్కలను తెచ్చి నాటించారు గెనభాయి.

అప్పట్లో ఇతను చేస్తున్నది "బుద్ధిమాలిన ప్రయత్నం" అంటూ కొందరు రైతులు విమర్శించేవారట. కానీ, పంట దిగుబడి మొదలయ్యాక అంతా షాకయ్యారు.

తొలి పంటను స్థానికంగా ఉన్న ఓ కంపెనీ కిలోకి రూ.42 చొప్పున చెల్లించి కొనుగోలు చేసింది. దాంతో గెనభాయికి మంచి ఆదాయమే వచ్చింది.

తర్వాత ఇంటర్నెట్ ద్వారా ఇతర ప్రాంతాల్లోని పెద్ద వ్యాపారులనూ సంప్రదించారు. 80 టన్నుల దానిమ్మ పండ్లను 55 రూపాయలకు కిలో చొప్పున అమ్మితే రూ. 40 లక్షలు వచ్చాయి.

శ్రమలేని తుంపర సేద్యం

తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో తోటను సాగు చేసేందుకు డ్రిప్ ఏర్పాటు చేశారు. దాంతో నీరు పెట్టే శ్రమ చాలావరకు తగ్గిందంటారు ఈ 'ఆదర్శ' రైతు.

ఇలా వ్యవసాయంలో వినూత్న మార్పుల కోసం గెనభాయి చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

ఈ రైతు విజయాన్ని చూసి బనాస్‌కాంఠా జిల్లాలోని ఇతర రైతులూ దానిమ్మ సాగును ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ దాదాపు 74 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ తోటలు ఉన్నాయి.

అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకూ నాణ్యమైన దానిమ్మ పండ్లను ఎగుమతి చేస్తున్నారు.

అయితే, పాకిస్తాన్‌కి ఎగుమతి చేసేందుకు వీలుగా వాఘా మాదిరిగా, తమ ప్రాంతానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు వద్ద గేటు ఏర్పాటు చేస్తే బాగుంటుందని గెనాభాయి పటేల్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)