గుజరాత్: గ్రామీణ పేదలకు చేరని ప్రభుత్వ పథకాలు
పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణులు
గుజరాత్లోని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ పోషహాకార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన పోషకాలు అందక ఎంతో మంది చిన్నారులు, మహిళలు బక్కచిక్కిపోతున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాహోద్ జిల్లాలో 'బీబీసీ గుజరాత్ ఆన్ వీల్స్'బృందం నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది.
మారని బతుకులు
1991 నుంచి భారత్ జీడీపీ 50 శాతం పెరిగింది. కానీ, ఇప్పటికీ ప్రపంచంలోని పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు భారత్లోనే ఉన్నారు.
దేశంలోని ఐదేళ్లలోపు వయసున్న పిల్లల్లో దాదాపు సగం మంది ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉన్నారు.
2006లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన దేశంలోని అత్యంత వెనకబడిన 250 జిల్లాల జాబితాలో గుజరాత్లోని దాహోద్ జిల్లా కూడా ఉంది. బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్ పథకం కింద(బీఆర్జీఎఫ్) కింద ఈ జిల్లాకు కేంద్రం నుంచి నిధులు కూడా వస్తున్నాయి.
కానీ, ఇక్కడి గ్రామీణులకు మాత్రం ఆ ఫలాలు అందడంలేదు.
దాహోద్ జిల్లాలో దాదాపు 73,384 మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.
గుజరాత్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలివి
- 2012లో రాష్ట్ర ప్రభుత్వం, కాగ్ వెల్లడించిన లెక్కల ప్రకారం గుజరాత్లోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు తక్కువ బరువు కలిగి ఉన్నారు.
- ఐదేళ్లలోపు చిన్నారుల్లో 44 శాతం మంది బరువు తక్కువున్నారు.
- 6 నుంచి 59 నెలల వయసున్న పిల్లల్లో 69 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
- 36.3 శాతం మహిళల బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) సాధారణం కంటే తక్కువ ఉంది.
- 15 నుంచి 49 ఏళ్ల వయసున్న గర్భిణీలలో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
- 15 నుంచి 49 ఏళ్ల వయసున్న స్త్రీలలో 55 శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు.
పథకాలు ఏమవుతున్నాయి?
ఎస్టీ జనాభా అధికంగా ఉన్న దాహోద్ జిల్లాలోని గ్రామీణులకు మాతాశిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలేవీ అందడంలేదని స్వచ్ఛంద సంస్థ 'జన్ స్వస్థ్య అభియాన్ గుజరాత్' చెబుతోంది.
ఇక్కడ ఆస్పత్రుల్లో ప్రసవాలకూ సరైన వసతులు కల్పించడంలేదని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అంటున్నారు.
దశాబ్ద కాలంలో పోషకాహార లోపం సమస్యను 27శాతానికి తగ్గించగలిగామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇప్పటికీ 43.9 శాతం మంది చిన్నారులకు సరైన పోషకాలు అందడంలేదని ఎన్జీవో జరిపిన అధ్యయనంలో తేలింది.
ఇక్కడి షెడ్యూల్డ్ వర్గాలకు చెందిన చిన్నారుల్లో 70 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. ఇది దేశంలోనే అత్యధికమని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.
దీన్ని బట్టి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆరు మాసాలలోపున్న 15.8 శాతం చిన్నారుల్లో పౌష్ఠికార సమస్య ప్రమాదకర స్థాయిలో ఉంది. అనేక మంది బాలింతలూ ఇదే సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితమైందని, గ్రామీణుల బతుకుల్లో ఎలాంటి మార్పూ కనిపించడంలేదని స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)