యూనివర్సిటీల్లోనూ కులవివక్ష ఉందా?

  • 3 డిసెంబర్ 2017
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, రోహిత్ వేముల Image copyright Getty Images

రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన నాటి నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఏదో ఒక రూపంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

యూనివర్సిటీ పరిపాలనా విభాగం కులవివక్ష ప్రదర్శిస్తోందని విద్యార్థి సంఘాలు, క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి బయటి రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని పరిపాలనా విభాగం ప్రత్యారోపణలు చేస్తున్నాయి.

''రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత క్యాంపస్ పూర్తిగా మారిపోయింది. గతంలో యూనివర్సిటీలో చర్చకు అవకాశం ఉండేది. అలాంటిది ఇప్పుడు లేకుండా పోయింది. విద్యార్థులు, పరిపాలనా విభాగం ఇప్పుడు ఒకరినొకరు విశ్వసించడం లేదు'' అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు పి.శ్రీరాగ్ అన్నారు.

ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ తెలంగాణ బీజేపీ సీనియర్ నేతల సహకారంతో పని చేశాడని రోహిత్ స్నేహితులు బలంగా విశ్వసిస్తున్నారు.

యూనివర్సిటీ పరిపాలనా విభాగం కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తోందని, యూనివర్సిటీ కులాలకు, తీవ్రవాదులకు, జాతి వ్యతిరేక రాజకీయ శక్తులకు నిలయంగా మారిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆగస్టు 2015లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి లేఖ రాయడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

Image copyright Getty Images

రోహిత్ వేముల మరణానంతరం వైస్ ఛాన్సెలర్ అప్పారావును తొలగించాలన్న డిమాండ్ ఊపందుకుంది.

అనేక రాజకీయ పార్టీలూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, పలువురు వామపక్ష నేతలు యూనివర్సిటీని సందర్శించి, నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

రోహిత్ మరణంపై విచారణ కోసం నియమించిన జస్టిస్ రూపన్‌వాలా కమిటీ.. రోహిత్ వ్యక్తిగత కారణాల వల్లే మరణించాడని, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నట్లు రోహిత్ దళితుడు కాదని తేల్చింది.

గత ఏడాది సంఘటనల అనంతరం క్యాంపస్ చీలిపోయిందని యూనివర్సిటీలో సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ పావరాల వినోద్ తెలిపారు.

''రోహిత్ మరణాంతరం క్యాంపస్ 'వాళ్లు వర్సెస్ మేము' అని చీలిపోయింది. దీనికి ఎక్కడో ఓ చోట ముగింపు పలకాలి. ఇందుకోసం రెండు వర్గాల మధ్య పార్టీలకు తావు లేకుండా బహిరంగ చర్చ జరగాలి'' అన్నారు.

Image copyright Getty Images

ఏబీవీపీ వర్సెస్ అంబేద్కరిస్టు-వామపక్ష కూటమి

1993లో అంబేద్కరిస్టు విద్యార్థి సంఘం (ఏఎస్‌ఏ) ఏర్పాటుతో యూనివర్సిటీలో ఆత్మగౌరవ ఉద్యమం మొదలైంది.

వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులను అవమానించడం క్యాంపస్‌లో అలవాటుగా మారిందని విద్యార్థి నేత ప్రశాంత్ తెలిపారు.

క్యాంపస్‌లో ఏఎస్‌ఏ, ఏబీవీపీ మధ్య ఘర్షణ గురించి వివరిస్తూ, ''ఏబీవీపీ క్యాంపస్‌ను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నించింది. ఏఎస్‌ఏ ఈ ప్రయత్నాలను వ్యతిరేకించడంతో ఘర్షణ మొదలైంది'' అని తెలిపారు.

ఈ ఏడాది జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవిని 1,509 ఓట్లు పొందిన ఏఎస్‌జే కైవసం చేసుకుంది.

2019లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడుతున్న తరహాలో, క్యాంపస్‌లో కూడా తమను ఓడించడానికి అదే ఫార్ములాను అనుసరిస్తున్నారని ఏబీవీపీ అధ్యక్షుడు ఉదయ్ అన్నారు.

Image copyright Getty Images

క్యాంపస్‌లో ఇంకా అలజడి ఉందా?

అక్టోబర్ నుంచి ఇప్పటివరకు క్యాంపస్‌లో రెండు ప్రధానమైన నిరనస ప్రదర్శనలు జరిగాయి.

వాటిలో ఒకటి గిరిజన విద్యార్థుల సమాఖ్య (టీఎస్‌ఎఫ్) నిర్వహించిన రిలే నిరాహార దీక్ష. తమ అభ్యర్థి నరేష్ లునావత్‌ను విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా గుర్తించాలనేది వారి డిమాండ్. నరేష్ ఏబీవీపీకి చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించాడు.

అయితే నియమాల ప్రకారం అతనికి 75 శాతం హాజరు శాతం లేదని ఏబీవీపీ ఫిర్యాదు చేయడంతో యూనివర్సిటీ పాలకవర్గం దీనిపై విచారణకు ఒక కమిటీని నియమించింది.

ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుండగానే, నవంబర్ 3వ తేదీ రాత్రి మళ్లీ నిరసనలు ప్రారంభమయ్యాయి.

క్యాంపస్ నియమాల ప్రకారం మగ విద్యార్థులు ఆడ విద్యార్థుల హాస్టల్స్‌లోకి, ఆడ విద్యార్థులు మగ విద్యార్థుల హాస్టల్స్‌లోకి ప్రవేశించకూడదు. యూనివర్సిటీ అధికారులు ఒక మగ విద్యార్థి గదిలో మహిళా విద్యార్థిని కనుగొనడంతో వివాదం మొదలైంది.

అయితే ఇది మోరల్ పోలీసింగ్ అని విద్యార్థులు ఆరోపించారు. ఆ మహిళా విద్యార్థికి మద్దతుగా విద్యార్థి సంఘాలతో పాటు కొందరు విద్యార్థుల బృందం హాస్టల్ బయట గుమికూడారు. యాజమాన్యం పోలీసులను పిలవడంతో సైబరాబాద్ పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు.

ఈ ఘటనలో పది మంది విద్యార్థులను సస్పెండ్ చేయడంతో మరోసారి నిరసన ప్రదర్శనల పర్వం ప్రారంభమైంది.

తాను టీఎస్‌ఎఫ్ ప్రతినిధిని కావడం వల్లనే తనను లక్ష్యంగా చేసుకున్నారని సస్పెండ్ అయిన ఎరుకల వెంకటేశ్వర్లు అనే విద్యార్థి ఆరోపించారు.

Image copyright Getty Images

విద్యార్థి సంఘాలు విద్యార్థులకు, యాజమాన్యానికీ మధ్య వారధిగా పని చేయాల్సి ఉన్నా, అది జరగడం లేదని వెంకట్ చౌహాన్ అనే రీసెర్చి స్కాలర్ తెలిపారు. విద్యార్థి ఉద్యమాల్లోకి రాజకీయ శక్తులు ప్రవేశించడం వల్ల సమస్యలు పక్కదారి పడుతున్నాయనేది అతని అభిప్రాయం.

అయితే రాజకీయ పార్టీల జోక్యంపై నెపం మోపే బదులు, విద్యార్థి సంఘాల నిరసన వెనుక ఉన్న అసలైన కారణాన్ని కనుగొనాలని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు.

''సెంట్రల్ యూనివర్సిటీ ఒక దుర్భేధ్యమైన కోటగా మారింది. అక్కడ సందర్శకులను లోనికి అనుమతించడం లేదు. బయటి రాజకీయ శక్తులు విద్యార్థుల్లో అలజడి సృష్టిస్తున్నాయని ఆరోపించడం హాస్యాస్పదం. కుల వివక్షకు వ్యతిరేకంగా ఏకం అవుతున్న విద్యార్థుల నిరసనలను నీరుకార్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు'' అని వీరయ్య అన్నారు.

Image copyright Getty Images

ఎలాంటి అలజడీ లేదు

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలె అప్పారావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వివాదాలకు కేంద్రంగా మారారు. అయితే క్యాంపస్‌లో ఎలాంటి అలజడీ లేదని ఆయన తెలిపారు.

''ఎవరో ఓ 200 మంది విద్యార్థులు నిరసన ప్రదర్శిస్తే క్యాంపస్‌లో అలజడి ఉన్నట్లా?’’ అని ఆయన ప్రశ్నించారు. క్యాంపస్‌కు చెడ్డ పేరు తెచ్చే బదులు విద్యార్థి సంఘాల నాయకులు విద్య నాణ్యత పెంచడంపై దృష్టి పెడితే మంచిదని సూచించారు.

యూనివర్సిటీలో కొనసాగుతున్న అలజడిపై రాజకీయ సిద్ధాంతవేత్త, రచయిత కంచె ఐలయ్య, ''భారతీయ యూనివర్సిటీలు ఇంగ్లీష్ విద్య పొందిన ఉన్నత కులాల వారి అవసరాలు తీరుస్తున్నాయి. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఆ విద్య అందడం వారికి ఇష్టం లేదు. సమస్యకు మూలం ఇదే. దేశవ్యాప్తంగా అందరికీ ఇంగ్లీష్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం వల్ల అసమానతలను కొంత వరకు రూపుమాపవచ్చు'' అని అభిప్రాయపడ్డారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు