అభిప్రాయం: 'వికలాంగులకి కావలసింది ఏంటి?'

  • 3 డిసెంబర్ 2017
అమ్మాయిలు Image copyright Getty Images

నేనొక లాయర్‌ను. సామాజిక కార్యకర్తను. తెలుగు మహిళను. రచయితను.. ఆర్టిస్ట్‌ను / సింగర్‌ను.. ఇంకా చెప్పాలంటే జీవితాన్ని అన్ని కోణాల నుంచి అనుభవిస్తూ, పరిశీలిస్తున్న మానవ చలనశీలిని.

'అబ్బే.. ఇదేం పరిచయం? మాకు నచ్చలేదు' అంటారా.. అయితే నాకో ప్రత్యేక ముద్ర ఉంది. ఆ ముద్ర పేరు శారీరక వికలాంగురాలు.

మోదీ గారి భాషలో చెప్పాలంటే దివ్యాంగురాలిని. అంతర్జాతీయ డిజేబిలిటీ పరిభాషలో చెప్పాలంటే, "పర్సన్ విత్ డిజేబిలిటీ"ని. కానీ అంతకంటేముందుగా మనిషిని. తర్వాతే నా ఎబిలిటీ అయినా డిజేబిలిటీ అయినా.

ముందుగా దివ్యాంగుడు లేదా దివ్యాంగురాలు అన్న పదాలను 'డిజేబిలిటీ కమ్యూనిటీ' ఒక అభ్యంతరకరమైన మాటగా పరిగణిస్తోంది.

చిత్రం శీర్షిక రచయిత సాయి పద్మ

అందుకు నేను పూర్తి మద్దతు ఇస్తాను. తిట్టు లాంటి ఆ పదాన్ని ప్రభుత్వానికి ఎందుకు వాడానో చెప్పే ముందు.. మీకో చిన్న కథ చెప్తాను.

నా ప్రత్యేక గుర్తు మీకు చెప్పాను కదా.. పర్సన్ విత్ డిజేబిలిటీ. చిన్నప్పుడే వచ్చిన పోలియో వల్ల పూర్తి శరీరం చచ్చుబడి పోయింది మాటతో సహా!

షాక్ ట్రీట్మెంట్ వల్ల మాట.. శరీరం పైబాగం చలనం వచ్చింది. కాళ్ళు మాత్రం ఇంకా చచ్చుబడే ఉన్నాయి.

అయినా నేనెప్పుడూ నడిచే ప్రయత్నం మానలేదు. ఎడిసన్ ప్రయోగాల్లా నా నడక ప్రయోగాలు కూడా తక్కువేం కాదు.

రకరకాల బ్రేసేస్ అనబడే కేలిపర్స్ (నడవటం కోసం కాళ్ళకి వేసుకొనే పరికరాల్లాంటివి.) తో ప్రయోగాలు, ఇంకా రకరకాల థెరపీలు, సర్జరీలు ఇలా ఓ ఎపిసోడ్ లెక్కన నడిచే ఈ రిహాబిలిటేషన్‌లో నేనెప్పుడూ మా అమ్మకు కంప్లైంట్ చేసేదాన్ని -

"అమ్మా.. మూడు అడుగులు ముందుకి వేస్తే, రెండు అడుగులు వెనక్కి అవుతోంది.. ఇలా అయితే ఎప్పటికి?'' అని. అమ్మ నవ్వుతూ అనేది ''మొత్తం మీద ఒక అడుగన్నా ముందుకు పడుతోంది కదరా!..'' అని. చాలా గొప్పగా, ఇన్స్పిరేషన్ గా అనిపించేది ఆ మాట.

Image copyright Getty Images

డిజేబిలిటీని గవర్నమెంట్‌నీ పోల్చి చూద్దాం..

'యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్' (యూఎన్సీఆర్పీడీ) వికలాంగుల హక్కులకు సంబంధించి అతి ముఖ్యమైన ఈ ట్రీటీని అంగీకరిస్తూ సంతకం చేసిన దేశాల్లో భారత దేశం మొదటి వరుసలో ఉంది.

అది అలాగే అమలు పరిస్తే మనం ఎన్నో అడుగులు ముందుకి వేసినట్లే. కానీ.. ఇటీవల సుప్రీం కోర్ట్ 'జనీష్ కుమార్ పాండే వెర్సస్ యూనియన్ అఫ్ ఇండియా' కేసులో సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో ముఖ్యమైనవి -

• వికలాంగ పిల్లల్ని, బుద్ది మాంద్యం కలిగిన పిల్లల్ని ఒకటే స్కూల్లో చేర్పించడం కుదరదు కాబట్టి, వారి కోసం స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి.

• అదే విధంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్‌కి వేరే ఎడ్యుకేటర్లను నియమించి చదువు చెప్పించాలి.

ఈ వ్యాఖ్యలు డిజేబిలిటీ కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి, నిస్సహాయతతో కూడిన ఆశ్చర్యానికి గురి చేశాయి. 'ది రైట్స్ అఫ్ పర్సన్స్ విత్ దిజేబిలిటీస్ ఏక్ట్-2016' ప్రకారం..

చట్టం ముఖ్య ఉద్దేశ్యం ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించి, భారత దేశం అంగీకరించిన 'యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ అఫ్ పర్సన్స్ విత్ దిజేబిలిటీస్'ని యధాతధంగా అమలు పరచటం.

ఈ డిక్లరేషన్ మీద భారత్ 13వ తేదీ డిసెంబర్ 2006 న సంతకం చేసింది.


ది రైట్స్ అఫ్ పర్సన్స్ విత్ దిజేబిలిటీస్ ఏక్ట్-2016' ముఖ్య ఉద్దేశాలు

ప్రతీ ఒక్కరికీ సమాన గౌరవం, వ్యక్తిగత స్వాతంత్ర్యం.

  • ఏ రకమైన వివక్ష లేకుండా ఉండటం.
  • సమాజంలో ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశాలు, ప్రతిపత్తి కలిగించటం.
  • వికలాంగులలో ఉన్న తేడాలను గుర్తించి, గౌరవంతో అంగీకరించటం.
  • సమాన అవకాశాలు.
  • బేరియర్ రహిత సమాజం కల్పించటం.
  • పురుషులూ, మహిళల మధ్య సమానత్వం.
  • స్పెషల్ చిల్డ్రన్ / చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్ లో అంకురిస్తున్న విభిన్న ప్రతిభను గుర్తించి, గౌరవించి. వారిని వారి స్పెషల్ కెపాసిటీలతో ఎదిగేందుకు దోహదం చేయటం.

ఇలా పైన ఉదహరించిన లక్ష్యాలు, పాలసీగా ఏర్పడిన చట్టం 'రైట్స్ అఫ్ పర్సన్స్ విత్ దిజేబిలిటీస్ ఆక్ట్-2016'.

ఇది ఏర్పడి ఇంకా సరైన ఫ్రేం వర్క్ కూడా మొదలు కాలేదు.. ఈలోపు ఇలాంటి వ్యాఖ్యలు తీవ్ర నిరాశని కల్గిస్తాయనటంలో సందేహం లేదు.

ఇది మూడు అడుగులు ముందుకు వెళ్తున్న ఇంక్లూజన్‌ని నాలుగు అడుగులు వెనక్కి లాగుతోంది.

ఇది సుమారు ఏడు కోట్ల వికలాంగుల హక్కుల సమస్య. వారి ఆత్మగౌరవ సమస్య.

Image copyright Getty Images

ఇక పోతే సుప్రీం కోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం రాజ్యాంగ స్ఫూర్తికి అనువుగా లేదు.

ఈ విషయంలో రాజ్యాంగం ఏం చెప్తోందో చూద్దాం సమానత్వపు హక్కు, రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 17 మరియు 18 ల ప్రకారం ప్రసాదించబడింది.

ఈ హక్కు చాలా ప్రధానమైనది. స్వేచ్ఛా సమానత్వాన్ని ప్రసాదించే ఈ హక్కు, క్రింది విషయాల్లో గ్యారంటీ ఇస్తుంది :

• చట్టం ముందు సమానత్వం : రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్) 14 ప్రకారం, పౌరులందరూ సమానంగా, భారతచట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం పౌరుల పట్ల ఎలాంటి వివక్షా చూపరాదు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ మరియు పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి భేదాలూ చూపరాదు.

• పౌర ప్రదేశాలలో సామాజిక సమానత్వం మరియు సమాన ప్రవేశాలు : అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నాన ఘాట్‌లు, మరియు దేవాలయాలు మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు.

• పౌర ఉద్యోగాల విషయాలలో సమానత్వం : అధికరణ 16 ప్రకారం, ఉద్యోగాలు పొందేందుకు, ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్షా చూపరాదు.

Image copyright Getty Images

ఒక డిజేబిలిటీ యాక్టివిస్ట్‌గా నిత్యం వికలాంగ పిల్లలు, అడల్ట్స్ మధ్య ఉండే నన్ను వాళ్ళ ప్రతిభా పాటవాలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి.

నిత్యం ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి కూడా! చిన్నప్పుడు మొదటి అంతస్తులో పాటల పోటీలు పెడితే నేను వెళ్ళలేనని, మా క్లాస్ పిల్లలందరూ కలసి స్కూల్ ఆవరణలోనే ఓ చెట్టు కింద పోటీలు పెట్టించిన నేపధ్యం నాకు గుర్తొస్తోంది.

చట్టాలు పెరుగుతున్నా అవగాహన లేని ఈరోజుల్లో కొన్ని విషయాల్ని గమనించాలి మనం.

• సెపరేట్ స్కూల్స్, సెపరేట్ జీవితం.. అప్పుడు ఒకరి బలాలనూ బలహీనతలనూ తెలుసుకొనే అవకాశం ఎలా వస్తుంది?? ఇంక్లూజన్ మరియు సమానత్వం రెండు ముఖ్యమైన పార్శ్వాలు.

• నా స్నేహితుడు ఒక విజువల్ల్లీ చాలెంజ్‌డ్ ఉన్నారు. ఆయన వస్తే మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆయన ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఫోన్‌లో ఉన్న ఏప్స్ ద్వారా ఆయన ఆఫీస్ పనులు నిర్వహించే విధానంతో నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను.

• బధిర పిల్లలు బాడీ లాంగ్వేజ్ ద్వారా, సైన్ లాంగ్వేజీ ద్వారా తెలియపరిచే విధానం, వాళ్ళు మనుషుల్ని, పరిస్థితులనీ బేరీజు వేసే తీరు.. పర్సనాలిటీ డెవెలప్మెంట్ క్లాసుల్లో చెప్పాలని నాకు అనిపిస్తూ ఉంటుంది.

• కేవలం ఒక స్పర్శ ద్వారా సెరిబ్రల్ పాల్సీ పిల్లలు.. ఎవరు తమకి స్నేహితులో, లేదా తామంటే ఇష్టం లేని వాళ్ళో గమనించేస్తారు. కొన్నేళ్ల తర్వాత కూడా ఆ స్పర్శలను గుర్తు పెట్టుకుంటారు.

• ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో 87% వరకూ వికలాంగులకు కేటాయించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు మిగిలిపోతున్నాయి అని తేలింది. ఎక్కడికక్కడ విడిగా సేపెరేట్‌గా చూస్తూ ఉంటే అక్కడిదాకా రావడం ఎలా? హక్కులకి చట్టబద్ధత, న్యాయ నిబద్ధత లేకపోతే సమాన అవకాశాలు ఎలా నెరవేరతాయి?

Image copyright Getty Images

• బ్యాలెన్స్‌డ్ లెర్నింగ్ - నా దగ్గరకి కౌన్సెలింగ్‌కి వచ్చే చాలామంది, ముఖ్యంగా డిజేబుల్డ్ పిల్లల తల్లిదండ్రులు మొదట ఎదుర్కొనే ఇబ్బంది.. తమ పిల్లల కండిషన్ పట్ల యాక్సెప్టెన్స్.

'మా ఇంట్లో ఇలా ఎవరూ లేరండీ..ఈ ఆటిజం అనే పేరు నేను మొదటి సారి వింటున్నాను' అని చెప్తారు.

చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే.. మొదటి నుండీ స్కూళ్ళల్లో గానీ, బయట వాతావరణంలో గానీ అలాంటి పిల్లల్ని చూడకపోవటం. వాళ్ళ లెర్నింగ్ కర్వ్ మార్చటంలో చాలా విలువైన సమయం వృధా అవుతుంది.

నార్మల్ లేదా కామన్.. లేదా మామూలు 'ఇలాంటి పదాలకి కొలబద్ద ఏది? ఇవాళ వికలాంగ పిల్లలని విడిగా పెట్టమనే సుప్రీం కోర్ట్ రేపు ముసలివాళ్ళకి వేరే సౌకర్యాలు అవసరం కాబట్టి వాళ్ళని విడిగా పెట్టమంటుంది. నిర్మిద్దామా డిజేబుల్డ్ దేశాల్నీ, ఏజ్‌డ్ రాష్ట్రాల్నీ ??

మన దేశంలో ఏ హక్కులూ లేనివాళ్లు దేవుళ్ళు మాత్రమే.

స్త్రీని పూజిస్తాం అని చెప్పుకుంటూ, ఆ స్త్రీని మనిషిగా పరిగణించని సమాజంలో బ్రతుకుతున్నాం. అందువల్ల హక్కులు నెరవేరని, హక్కుల కోసం పోరాడనివ్వని దివ్యాంగత్వం తమకి వద్దని ప్రతీ 'పర్సన్ విత్ డిజేబిలిటీ' ఎలుగెత్తి చాటాలి. తన నిరసనని తెలియచేయాలి తమ తమ పద్ధతుల్లో.

హరిజన్' అనే పదం గాంధీజీ ప్రవేశపెట్టినప్పుడు, మరి మిగతావారు 'రాక్షస జనమా' అన్న డా|| అంబేద్కర్ మాటలు గుర్తుకు వచ్చాయి.

మేము 'దివ్యాంగులం' అయితే మరి మిగతా వారు ఏమవుతారు? శాస్త్రీయపరంగా చూస్తే దివ్యత్వమున్న అంగం అంటే అపారమయిన శక్తి కలిగి అనితరసాధ్యమైన పనులు చేయగలిగి ఉండాలి! మరి అలా జరగదే.. కావున 'దివ్యాంగం' అన్న పదమే లోపాయకారిగా ఉంది.

• ఒకసారి ప్రకృతిని గమనిస్తే ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. అసలు భిన్నత్వం లేకపోతే మానవ జీవితానికి మనుగడ, సంపూర్ణత్వం లేనే లేదు.

జీవన వైవిధ్యమే మనుగడలో అందం. వైవిధ్యాన్ని అర్ధం చేసుకోకుండా సహానుభూతి సాధించటం కష్టం.

Image copyright Getty Images

అందుకని, ఏవిధంగా చూసినా స్పెషల్ అంటే సెపరేట్ చేయమని కాదు. వారి వారి స్పెషల్/విభిన్న అవసరాలను గమనించటమే! స్పెషల్ ట్రీట్మెంట్ అంటే విడదీయటం కాదు. కుష్టు రోగుల కాలనీలు, TB శానిటోరియంలూ విడిగా పెట్టేందుకు, డిజేబిలిటీ అన్నది ఒకరి నుండి ఒకరికి సోకే వ్యాధి కాదు.

జీవన వైవిధ్యంలో అదొక అందమైన పార్శ్వం.

చివరగా వొక్కమాట.. 'వికలాంగులకి కావలసింది ఏమిటి?' అని అందరూ అడుగుతూ ఉంటారు. వికలాంగులకి కావలసింది మనుషులందరికీ కావలసిన కొన్ని ముఖ్యమైన విషయాలే వికలాంగులకూ కావాలి.

అవే.. గౌరవం, స్వాతంత్ర్యం, సమానత్వం. ఇంత సరళమైన వాళ్ళ హక్కులను చాలా నిర్లజ్జగా, ఏమాత్రం ఆలోచన లేకుండా ఎందుకు కాలరాస్తున్నాం? అనే ప్రశ్న ప్రభుత్వాలు, పౌర హక్కుల సంఘాలు, అన్ని కమ్యూనిటీలు తమని తాము వేసుకోవాల్సిన ప్రశ్న.

పురోగమన దిశగా ఆలోచన మొదలవ్వాలి. దానికి వైవిధ్యాన్ని అర్ధం చేసుకొనే సహానుభూతి అలవాటు చేయాలి.

ఆ దిశగా ఆలోచన, ఆచరణ, చట్ట భద్రతపై అవగాహన పెరుగుతుందని ఆశిస్తూ .. అందరికీ.. అంతర్జాతీయ వికలాంగ దినోత్సవ శుభాకాంక్షలు.

(సాయి పద్మ గ్లోబల్ ఎయిడ్ వ్యవస్థాపకులు, లీగల్ లాబ్స్ LLPకి డైరెక్టర్‌గా ఉన్నారు)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

మా ఇతర కథనాలు