‘హైదరాబాద్ మెట్రోలోంచి చూశాక సిటీపై ఇష్టం చాలా పెరిగింది’

  • 6 డిసెంబర్ 2017
మెట్రో రైలు

హైదరాబాద్ మెట్రోలో మొదటిసారి ప్రయాణించిన బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని తన అనుభవాల్ని పంచుకుంటున్నారు...

రద్దీ సమయాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి అష్టకష్టాలు పడే నా లాంటి ఎంతో మంది హైదరాబాదీల కల నెరవేరింది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చే మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది.

మెట్రో సేవలు సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చిన తొలి రోజు నవంబరు 29న, ఇందులో ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు నేను రసూల్‌పుర నుంచి అమీర్‌పేట వరకు ప్రయాణించాను.

ప్రస్తుతం మియాపూర్-నాగోల్ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 30 కిలోమీటర్లు. ఈ మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి.

మెట్రో స్టేషన్‌లోకి అడుగు పెట్టగానే మన దృష్టిని ఆకర్షించేవి ఏంటంటే- ఏది ఎక్కడ ఉందో, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్లాలో సూచించే ఏర్పాట్లు.

టికెట్ కౌంటర్‌తో మొదలై రైలు ఎక్కడం వరకు అన్నింటినీ స్పష్టంగా సూచించే బోర్డులను తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఏర్పాటు చేశారు.

టికెట్ కౌంటర్ వద్ద క్యూను చూస్తే చాలు, హైదరాబాద్ వాసుల్లో మెట్రో పట్ల ఎంత ఆసక్తి, ఆత్రుత ఉన్నాయో అర్థమవుతుంది.

టోకెన్ తీసుకుందామని క్యూలో నిలబడ్డాను. కూకట్‌పల్లిలో ఒక పెళ్లికి హాజరయ్యేందుకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నారాయణరెడ్డి అనే వ్యక్తి నా వెనక నిలబడి ఉన్నారు.

వివాహ వేదిక వద్దకు మెట్రోలో వెళ్లాలన్నది ఆయన ఆలోచన. ''నాకు ఎంతో ఉద్వేగంగా ఉంది. మెట్రో గురించి చాలా వింటున్నాను. తొలిసారిగా మెట్రో ఎక్కబోతున్నా'' అంటూ ఉత్సాహంగా చెప్పారు నారాయణ.

Image copyright Hyderabad Metro Rail Ltd/Facebook

స్మార్ట్ కార్డుతో ప్రయాణిస్తే రాయితీ

ప్రయాణికులు టోకెన్ లేదా స్మార్ట్ కార్డుతో మెట్రోలో ప్రయాణించవచ్చు. టికెట్ కనీస ధరను రూ.10గా నిర్ణయించారు.

రసూల్‌పుర నుంచి అమీర్‌పేటకు రూ.25 అవుతుంది.

ప్రతి మెట్రో స్టేషన్‌లో ఆటోమేటెడ్ టోకెన్ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. స్మార్ట్ కార్డుతో ప్రయాణిస్తే ఐదు శాతం రాయితీ లభిస్తుంది. రూ.100 డిపాజిట్ కలుపుకొని కార్డు ధర రూ.200.

డిపాజిట్ పోగా మిగతాది ప్రయాణానికి వాడుకోవచ్చు. గరిష్ఠంగా రూ.2 వేల దాకా కార్డుకు రీఛార్జి చేసుకోవచ్చు. దీనిని 365 రోజుల్లోపు అంటే ఏడాది కాలంలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు.

Image copyright Hyderabad Metro Rail Ltd/Facebook

సేల్స్ మేనేజర్‌గా పనిచేసే సునీల్ అనే ప్రయాణికుడితో నేను మాట్లాడాను.

ఆయన బేగంపేటలో ఉంటారు. ఉద్యోగ రీత్యా సిటీ అంతా తిరుగుతుంటారు. కార్డు కొనుక్కున్న ఆయన, ఇక దీనిని రోజూ వాడతానని చెప్పారు. ''ప్రతిసారి క్యూలో నిలబడటం కన్నా కార్డు కొనుక్కోవడం మంచిదని భావించి కొన్నాను'' అన్నారాయన.

టోకెన్ తీసుకున్న తర్వాత ప్రయాణికులను, లగేజిని తనిఖీ చేసే చోటుకు వెళ్లాలి. తనిఖీలు అయ్యాక అక్కడున్న యంత్రంపై టోకెన్‌ను స్కాన్ చేస్తే, ప్లాట్‌ఫాం మీదకు వెళ్లేందుకు వీలుగా గేటు తెరచుకుంటుంది.

గమ్యస్థానాన్ని బట్టి సరైన ప్లాట్‌ఫాం ఏదో సూచించే బోర్డులు ఉన్నాయి.

భద్రతపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మైకులో ప్రకటనలు చేస్తున్నారు. భద్రతాపరమైన జాగ్రత్తలతో కూడిన కరపత్రాన్ని ప్రజల అవగాహన కోసం టోకెన్‌తోపాటు అందిస్తున్నారు.

తదుపరి మెట్రోకు ఇంకెంత సమయం ఉంది లాంటి వివరాలను ప్లాట్‌ఫాంపై ఉన్న బోర్డులు చూపిస్తున్నాయి.

మెట్రోలో వెళ్తున్నప్పుడు రాబోయే స్టేషన్‌ ఏదో ముందే ప్రకటిస్తారు. కోచ్‌లో ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్ రాబోయే స్టేషన్‌ను హైలైట్ చేసి చూపిస్తుంది.

546 మందితో భద్రత

మెట్రో స్టేషన్లలో భద్రత ఏర్పాట్లను ప్రైవేటు సంస్థలు చూసుకొంటున్నాయి.

ప్రయాణికులకు ఫ్లాట్‌ఫాం వివరాలు చెప్పడం, ప్రయాణికుల సహాయ కేంద్రాల దారి చూపించడం లాంటి సేవలనూ భద్రతా సిబ్బంది అందిస్తున్నారు.

మెట్రో స్టేషన్లలో మొత్తం 546 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) తెలిపింది.

స్టేషన్‌లోకి అడుగుపెట్టడం మొదలుకొని ప్రయాణం ముగిశాక బయటకు వచ్చే వరకు ప్లాట్‌ఫాంలు సహా అంతటా భద్రతా సిబ్బంది కనిపిస్తుంటారు. తద్వారా ప్రయాణికులకు ముఖ్యంగా మహిళలకు భద్రతపరంగా భరోసా దొరుకుతుంది.

Image copyright Hyderabad Metro Rail Ltd/Facebook

వికలాంగులు, వృద్ధుల కోసం లిఫ్టులు

మెట్రో స్టేషన్లలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం లిఫ్టులు ఏర్పాటు చేశారు.

అంగవైకల్యమున్న సుశీల అనే ప్రభుత్వ ఉద్యోగినితో నేను మాట్లాడాను.

బస్ స్టేషన్లు లాంటి అనేక బహిరంగ ప్రదేశాల్లో వికలాంగులకు అవసరమైన సదుపాయాలు ఉండవని, మెట్రో స్టేషన్లలో లిఫ్టుల ఏర్పాటు తనకు ఊరట ఇస్తోందని, ఈ సదుపాయం తనను మెట్రోలో ప్రయాణించేలా చేస్తోందని ఆమె చెప్పారు.

కిక్కిరిసిపోతున్న కోచ్‌లు

రోడ్లపై రద్దీ, కొత్తదనే ఉత్సాహం నేపథ్యంలో మెట్రోకు జనం పోటెత్తుతున్నారు. కోచ్‌లు కిక్కిరిసిపోతున్నాయి.

తొలి రోజు (నవంబరు 29న) సుమారు రెండు లక్షల మంది మెట్రోలో ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు.

కోచ్‌లో రెండు వైపులా సీట్లు ఉన్నాయి. రద్దీ వల్ల సీటు దొరకడం గగనమే.

సీటు దొరకలేదన్న బాధ, భాగ్యనగర అందాలను చూస్తూ సాగే ప్రయాణంతో తీరి పోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మెట్రో అంత ఎత్తులోంచి, అంత మేర నగరాన్ని చూసే అవకాశం ఇప్పటివరకు ఎవరికీ వచ్చి ఉండదు.

తన తండ్రితో కలిసి మెట్రో ప్రయాణం చేస్తున్న సమంత అనే 14 ఏళ్ల విద్యార్థినితో మాట కలిపాను. హైదరాబాద్‌ను తాను ఎన్నడూ ఇలా చూడలేదని, మెట్రోలో వెళ్తూ చూశాక సిటీపై ఇష్టం చాలా పెరిగిపోయిందంటూ ఉబ్బితబ్బిబ్బయిపోయయ్యారు సమంత.

నాతో పాటు ప్రయాణించిన ఇతర మహిళా ప్రయాణికులు, మెట్రోలో ఉన్న సౌకర్యం గురించి చర్చించుకోవడం కనిపించింది.

ఫాతిమా అనే మహిళ ఉద్యోగ రీత్యా రోజూ బేగంపేట నుంచి మియాపూర్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది.

మియాపూర్ వరకు బస్సులో వెళ్లి, అక్కడి నుంచి ఆటోలో పది నిమిషాలు ప్రయాణించి కార్యాలయానికి చేరుకుంటారు.

మెట్రో ప్రయాణంపై ఫాతిమా స్పందిస్తూ- ''బస్సులో ఎప్పుడూ భయంగా అనిపిస్తుంటుంది. విపరీతమైన రద్దీ వల్ల ఊపిరి కూడా సరిగా ఆడదు. మెట్రోలోనూ రద్దీ తప్పదన్నది నిజమే. కానీ, ఇందులో ఏసీ ఉంటుంది కాబట్టి కాస్త నయం. మెట్రో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, మెట్రో స్టేషన్ల నుంచి మాలాంటి ప్రయాణికుల గమ్యస్థానాలకు మంచి ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది'' అని అభిప్రాయపడ్డారు.

ప్రతికూలం: పార్కింగ్

మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికుల వాహనాల పార్కింగ్‌కు తగినంత స్థలం లేకపోవడం ప్రతికూలాంశంగా ఉంది.

నాగోలు, మియాపూర్ మెట్రో డిపోల వద్ద పార్కింగ్ స్థలం చాలినంత ఉంది. అయితే 24 మెట్రో స్టేషన్లకు 12 చోట్ల మాత్రమే తగినంత పార్కింగ్ స్థలం ఉంది. పార్కింగ్ సదుపాయాన్ని కల్పించే పనులు పూర్తికావాల్సి ఉంది.

ఉదాహరణకు రసూల్‌పుర స్టేషన్నే తీసుకుంటే ఇక్కడ ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పనులు పూర్తికానందున పార్కింగ్ రుసుములను ఇంకా ఖరారు చేయలేదని ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ఎల్ అధికారులు చెప్పారు.

మెట్రోలో రసూల్‌పుర నుంచి అమీర్‌పేట చేరడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది. రోడ్డు మార్గంలో అయితే కనీసం 20 నిమిషాలు పడుతుంది.

నరసింహ అనే ఉద్యోగి తన పనిపై నిత్యం ఎంఎంటీఎస్ (మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) రైళ్లలో ప్రయాణిస్తుంటారు.

ఎంఎంటీఎస్ రైలు దిగిన తర్వాత తన గమ్యస్థానాన్ని చేరాలంటే నడవాల్సి ఉంటుందని, లేదా ఆటో ఎక్కాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. మెట్రో విషయంలో ఇలా జరగదనే ఆశిస్తున్నానని నరసింహ తెలిపారు.

ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించి, మెట్రో స్టేషన్లను ప్రయాణికుల గమ్యస్థానాలతో అనుసంధానిస్తూ ప్రజారవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తే హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల ఆదరణను చూరగొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు