ప్రెస్ రివ్యూ: ఆర్ కృష్ణయ్య అప్పుడెందుకు మాట్లాడలేదు? - చంద్రబాబు

  • 4 డిసెంబర్ 2017
Image copyright Getty Images

నమస్తే తెలంగాణ: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయడం కోసం పార్లమెంట్‌లో చట్టం తీసుకురావలసిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పక్షాన కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రం తరఫున అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.

బీసీల సంక్షేమం-అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదివారం అసెంబ్లీ కమిటీహాలులో జరిగిన బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమశాఖను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. పదోన్నతుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు కేసీఆర్ చెప్పారు. బీసీలకు సంబంధించి రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని అంశాలపైనా సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు మారినప్పటికీ విధానపరమైన విషయాల్లో స్థిరత్వం ఉంటుందని, కానీ భారతదేశంలో విధానపరమైన స్థిరత్వం లేకపోవడం ప్రధాన లోపమని సీఎం అన్నారు. బీసీల కోసం విధానాలు, పథకాలు రూపకల్పన చేసే సందర్భంలో భవిష్యత్తులో వాటినెవ్వరూ తొలిగించలేనంత పకడ్బందీగా రూపొందించాలని సీఎం కోరారు. ఎంబీసీలు, సంచార జాతులను కూడా పైకి తీసుకొనిరావాల్సిన అవసరమున్నందున వారితో కూడా చర్చించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అన్ని కులాల అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని సూచించారు.

Image copyright Getty Images

బిసిలు, కాపులను ఓటు బ్యాంకుగా చూడలేదు

ప్రజాశక్తి: బిసి, కాపులను తానెప్పుడూ ఓటు బ్యాంకుగా చూడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కొరియా పర్యటనకు వెళ్లే ముందు ఆయన మంత్రులు, పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజకీయ లబ్ధికోసమే కొన్ని పార్టీలు కులాల్ని రెచ్చగొడుతున్నాయన్నారు.

ఏ వర్గానికీ అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. చాలాకాలంగా ఉన్న డిమాండును నెరవేర్చామని, ఇచ్చిన మాటకు కట్టుబడ్డామని పేర్కొన్నారు. బిసిలకు రిజర్వేషన్లలో కోత పెట్టకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని గతంలోనే చెప్పామని, ఇప్పుడు చేశామని పేర్కొన్నారు.

దీనివల్ల బిసిలకు అన్యాయం జరగదన్నారు. తెలంగాణాలో కొన్ని కులాల్ని బిసి జాబితా నుండి తొలగించినప్పుడు మాట్లాడని ఆర్‌.కృష్ణయ్య ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

మూడు రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. సియోల్‌, బూసన్‌ నగరాల్లో పర్యటిస్తారు. సిఎంతోపాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, సిఎంఓ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌ తదితరులు పర్యటనలో పాల్గొంటారు.

Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వ్యవసాయం

ఈనాడు: వివిధ దేశాల్లో పురుగు మందుల పిచికారి, భూసార పరిస్థితి, పంటలపై పురుగుల ప్రభావాన్ని గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రంగంలో డ్రోన్ల సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రబీ నుంచే ఈ కార్యక్రమం చేపట్టేందుకు సన్నద్ధమైంది.

పురుగుమందు చల్లాల్సిన పొలాన్ని గుర్తించి కంప్యూటర్‌పై సంకేతాలు ఇస్తే నిర్దేశిత ప్రాంతంలోనే డ్రోన్‌ తిరుగుతూ మందు చల్లుతుంది. విద్యుత్తు స్తంభాలు, చెట్లు ఉన్నా వాటికి తగలకుండా ముందే సూచనలు ఇస్తారు. పొలంలో కీటకాలు, పురుగుల తీవ్రతను గుర్తించి మందులు పిచికారి చేసే ఆధునిక డ్రోన్లు కూడా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి.

మూడు లీటర్ల సామర్థ్యం ఉండే డ్రోన్‌ రూ. 1.50 లక్షలు, అయిదు లీటర్లదైతే రూ. 3 లక్షలు, 20 లీటర్లదైతే రూ. 6 లక్షల వరకు ఉంది. వాటి ద్వారా పురుగు మందు చల్లించాలన్నా ఎకరానికి రూ. 600 వరకు అవుతోంది. ఇదే కూలీల ద్వారా చల్లిస్తే ఎకరానికి రూ. 200 వంతునే అవుతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గిస్తేనే రైతులు డ్రోన్లవైపు మళ్లే అవకాశం ఉంది.

డ్రోన్ల ద్వారా పురుగు మందుల పిచికారిపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నివేదిక రూపొందించింది. రైతుల్ని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎంత మొత్తంలో రాయితీ ఇవ్వాలి? ఎకరాలో మందు చల్లడానికి ఎంత ఖర్చవుతుందనే అంశాలను పరిశీలిస్తున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ తెలిపారు. పదిరోజుల్లోపు దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Image copyright Getty Images

చిల్లర మామూళ్లు వెయ్యి కోట్లు

సాక్షి: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల్లో ఏటా చిన్న చిన్న 'చిల్లర' లంచాల మొత్తమే ఏకంగా రూ. 1,000 కోట్లు దాటిపోతోంది. ప్రజలకు తరచూ ఏదో ఒక పనిపడే ప్రభుత్వ విభాగాల్లో ఈ జాడ్యం ఎక్కువగా ఉందని ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాల రహస్య అధ్యయనంలోనే వెల్లడైంది. ఇక అవసరమైన పెద్ద పనుల కోసం, అక్రమాలు, అవకతవకలకు సహకరిస్తూ అధికారులు, సిబ్బంది డిమాండ్‌ చేసే 'ముడుపులు'వేరే.

అన్ని ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే.. రెవెన్యూ విభాగం చిన్న చిన్న లంచాల స్వీకరణలోనూ టాప్‌లో నిలుస్తోంది. స్థానిక, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి భూముల లెక్కలు సరిచేసే వరకు చాలా రకాల సేవలు అందించే రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందికి చదివింపులు భారీగానే ఉంటున్నట్టు విజిలెన్స్‌ అధ్యయనంలో వెల్లడైంది.

రాష్ట్రంలో కొత్త మండలాలతో కలిపి మొత్తంగా 584 మండలాలు ఉన్నాయి. వీటిలో 510 కార్యాలయాలు నిత్యం బిజీగా ఉంటాయి. వీటిలో పనుల కోసం వచ్చే జనం.. రోజూ సగటున సుమారు రూ.35 వేల వరకు సమర్పించుకుంటున్నారు. ఈ లెక్కన మండల రెవెన్యూ కార్యాలయాలన్నింటిలో కలిపి రోజుకు రూ.1.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 645 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నట్లు విజిలెన్స్, ఏసీబీల అధ్యయనంలో వెల్లడైంది.

రెవెన్యూ శాఖ పరిధిలో 31 జిల్లాల కలెక్టరేట్‌ కార్యాలయాల్లో ఇలా ఏటా రూ.273 కోట్ల మేర లంచాలు వసూలవుతున్నాయని ఏసీబీ ఇటీవల జరిపిన రహస్య అధ్యయనంలో గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ఆర్టీఏ, యూనిట్‌ ఆఫీసులలో ఒక్కో యూనిట్‌లో రోజుకు రూ.లక్ష మేరకు చిన్న చిన్న లంచాలు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు అంచనా. ఇలా ముడుపుల సొమ్ము ఏటా రూ.220 కోట్ల వరకు చేరుతోంది.

జిల్లా, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కలిపి నెలకు సుమారు రూ.2.2 కోట్ల చొప్పున ఏటా రూ.26 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోందని ఏసీబీ, విజిలెన్స్‌ సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. ఎక్సైజ్‌ శాఖలో ప్రతీ నెల జిల్లాల వారీగా రూ.45 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా చిన్న చిన్న చదివింపులు ఉంటున్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల రూ. 15 కోట్ల చొప్పున ఏడాదికి రూ.180 కోట్ల మేర 'మామూళ్లు'అందుతున్నాయి.

వాణిజ్య పన్నుల శాఖలోని 12 డివిజన్లలో ప్రతీ నెలా రూ.65 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు 'చిన్న మొత్తాలు'వస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇలా ఏటా రూ.10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోంది.

Image copyright Getty Images

కండోమ్‌లూ నకిలీ!

ఆంధ్రజ్యోతి: గుంటూరులోని ఆటోనగర్‌, నరసరావుపేటలోని శ్రీరామ్‌నగర్‌, కోట సెంటర్‌లలో నకిలీ కండోమ్‌ల తయారీ కుటీర పరిశ్రమల్లా చురుగ్గా ఉన్నట్లు సమాచారం. పది నుంచి 15 కుటుంబాలు ఈ పనిలోనే ఉన్నాయని తెలుస్తోంది. రెండు రకాలుగా నకిలీ కండోమ్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు.

వివిధ బ్రాండెడ్‌ కంపెనీల బాక్స్‌లపై సీల్స్‌ తీసేసి అందులో నకిలీ కండోమ్‌లు పెట్టి అమ్మేస్తున్నారు. కనీసం పది రూపాయలు కూడా విలువ చేయని కండోమ్‌లను రూ.200లకు అంటగడుతున్నారు. పరీక్షగా చూస్తేగానీ తెలియనంతగా అక్రమార్కులు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.

బ్రాండ్‌ అయితే దానిపై తయారీ, గడువు ముగిసే తేదీలు ఉంటాయి. కొనుగోలుదారులు అవేమీ చూడకుండా దుకాణదారు ఇచ్చిందే తడవుగా జేబులో పెట్టుకుని వెళ్లిపోతూ. ఎయిడ్స్‌ వంటి భయంకర రోగాల బారిన పడుతున్నారు. ఈ ఆతృతనే క్యాష్‌ చేసుకుంటున్నారు నకిలీరాయుళ్లు.

కండోమ్స్‌ తయారు చేసే సంస్థలు జాతీయ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థ సూచించిన నిబంధనలు పాటించాలి. ఈ నకిలీ కండోమ్‌ల తయారీలో అవేమీ ఉండవు. పైగా తయారీదారులే సొంతంగా మార్కెట్‌ చేసుకుంటున్నారు. వీటిని ఎక్కువగా వినియోగించే లాడ్జీలు, వ్యభిచార ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. రేటు తక్కువని చీకటి బేరం చేస్తూ అంటగట్టేస్తున్నారు. ఇంకొందరైతే దుకాణదారులతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. 60 శాతం డిస్కౌంట్‌, వెంటనే నగదు ఇవ్వాలనే ఒప్పందంపై లావాదేవీలు సాగుతున్నాయి. గుంటూరు, కృష్ణాజిల్లాలకు ఎక్కువగా నకిలీ కండోమ్‌లను సరఫరా చేస్తున్నారు.

వీటిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీనిపై జిల్లా వైద్యశాఖాధికారులను కదిలిస్తే మాత్రం...తాము ప్రస్తుతం నకిలీ మందుల కేసులో బిజీగా ఉన్నామని అవి కొలిక్కి రాగానే దృష్టి పెడతామని తాపీగా బదులిస్తున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)