డిజిటల్ యుగంలో పాత ఫొటో స్టూడియోల్ని కాపాడేందుకు ఒక ప్రాజెక్టు

  • 4 డిసెంబర్ 2017
19వ శతాబ్దంలో తమిళనాడు మహిళలు Image copyright Sathyam Studio
చిత్రం శీర్షిక ఆర్కైవ్ ఫొటోల్లో కుటుంబాలు, ప్రఖ్యాత వ్యక్తుల పోర్ట్రెయిట్లు అధికంగా ఉన్నాయి

ఒకప్పుడు ఏ కార్యక్రమమైనా ఫొటోగ్రాఫర్ రానిదే ప్రారంభమయ్యేది కాదు. ‘‘ఫొటోగ్రాఫర్ రావటం ఆలస్యమయితే ఒక ప్రదర్శన కార్యక్రమం ప్రారంభించకుండా నిర్వాహకులు కూడా జాప్యం చేసిన రోజులు నాకు గుర్తున్నాయి‘‘ అని చెప్తారు సత్యం స్టూడియోలో మూడో తరం ఫొటోగ్రాఫర్ బాలచంద్రరాజు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇంకా మనుగడ సాగిస్తున్న పాత తరం ఫొటో స్టూడియో ఇది. బాలచంద్రరాజు వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు.

‘‘ఇప్పుడు ఫొటో తీసుకోవడానికి అరచేతిలో ఇమిడిపోయే ఒక ఫోన్ ఉంటే చాలు’’ అంటారాయన.

ఈ డిజిటల్ యుగంలో ఫొటో స్టూడియోలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. అవి మనుగడ కోసం పోరాటం చేస్తుంటే.. పాత ఫొటోలను డిజిటలీకరించటం ద్వారా ఈ స్టూడియోల చారిత్రక పాత్రను పరిరక్షించడానికి గల మార్గాలపై ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ దృష్టి సారించింది.

బ్రిటిష్ లైబ్రరీ నిధులు సమకూర్చిన ఈ ప్రాజెక్టు తమిళనాడు వ్యాప్తంగా 100 ఫొటో స్టూడియోలను సందర్శించి, వాటిలోని 10,000 ఫొటోలను డిజిటలైజ్ చేయడం ద్వారా సంరక్షించింది. వాటిలో చాలా ఫొటోలు 1880-1980 మధ్య కాలంలో తీసినవి. కుటుంబాలు, ప్రముఖుల పోర్ట్రెయిట్ల నుంచి వివాహాలు, అంతిమ సంస్కారాల వరకూ ఆ ఫొటోల్లో ఉన్నాయి.

Image copyright French Institute of Pondicherry
చిత్రం శీర్షిక ఆ కాలంలో పోర్ట్రెయిట్ ఫొటోల కోసం చాలా మంది స్టూడియోలకు వరుసకట్టేవారు

భారతదేశంలో ఈ తరహా ప్రాజెక్టు చేపట్టడం ఇదే మొదటిదని పరిశోధకుల్లో ఒకరైన జో ఇ హెడ్లీ పేర్కొన్నారు. ‘‘19వ శతాబ్దపు తమిళనాడులో జీవితం ఎలా ఉండేదనే చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారికి ఈ డిజిటల్ ఆర్కైవ్ ఒక నిధి లాంటిది‘‘ అని ఆయన చెప్పారు.

ఇది ఫొటోగ్రాఫర్లకు ‘‘బంగారు గని’’ వంటిదని ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న మరో పరిశోధకుడు రమేశ్‌కుమార్ అభివర్ణించారు. ‘‘డిజిటల్ ఫొటోగ్రఫీ మన పట్టణాలు, నగరాల్లోకి రాకముందు ఫొటోగ్రఫీలో ఉపయోగించిన ప్రొడక్షన్ టెక్నిక్‌ల గురించి కూడా మేం చేసిన పరిశోధనలో ముఖ్యమైన భాగం’’ అని ఆయన తెలిపారు.

స్టూడియోలని అటక మీదో, అల్మరాలో దొంతరలుగానో పాత ఫొటోలన్నీ ఒక దానిపై ఒకటి పెట్టి కనిపించేవి. ‘‘వాటిని శుభ్రం చేసే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. తమిళనాడులోని ఉష్ణమండల వాతావరణం, గాలిలో తేమ కారణంగా చాలా ఫొటోలు పాడైపోయాయి’’ అని రమేశ్‌కుమార్ వివరించారు.

చెన్నై నగరంలో ఇంకా నడుస్తున్న ఫొటో స్టూడియోల సంఖ్య విషయమై ఈ పరిశోధకుల దగ్గర ఖచ్చితమైన సంఖ్య లేదు. అయితే, ‘‘డిజిటల్ విప్లవం ప్రపంచవ్యాప్తంగా ఫొటో స్టూడియోలకు మరణశాసనం లిఖించింది’’ అని హెడ్లీ అంటారు.

Image copyright Sathyam Studio
చిత్రం శీర్షిక సత్యం స్టూడియో 1930 నుంచీ ఒకే స్థలంలో కొనసాగుతోంది

చెన్నైలోని ఆర్‌కే మఠ్ రోడ్డులో ఉన్న సత్యం స్టూడియోని 1930లో ప్రారంభించారు. అప్పటి నుంచీ అది అక్కడే కొనసాగుతోంది. బయటి నుంచి చూస్తే అది ఫొటో స్టూడియో లాగా కాకుండా ఏదో చిన్న ఫొటో కాపీ షాపు లాగా కనిపిస్తుంది. లోపల ప్రఖ్యాత తమిళ సినిమా స్టార్ హేమమాలిని, భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరిల పోర్ట్రెయిట్లు రిసెప్షన్ గదిలో గోడల మీద అలంకరించి ఉంటాయి.

ఈ స్టూడియోను ఇప్పుడు ఆనంద్‌రాజు నిర్వహిస్తున్నారు. ఆయన తన తండ్రి నుంచి దీనిని వారసత్వంగా పొందారు. ఆనంద్‌రాజు తాత బ్రిటిష్ హయాంలో ఈ స్టూడియోను స్థాపించారు. ఆ కాలంలో ఒక గాగరియోటైప్ కెమెరాను కూడా ఆయన డిజైన్ చేశారు. ఇప్పుడు దానిని ఒక గుడ్డలో చుట్టి పక్కన పెట్టేశారు. డాగరియోటైప్ ప్రక్రియ ఫొటోగ్రఫీ మొట్టమొదటి రూపాల్లో ఒకటి. అందులో.. ఫొటోలు తయారుచేయడానికి అయోడిన్ పూతతో కూడిన వెండి ప్లేట్ల, పాదరసాన్ని ఉపయోగించేవారు.

Image copyright Sathyam Studio
చిత్రం శీర్షిక తన తాత తయారు చేసిన డాగరియోటైప్ కెమెరాతో బాలచంద్ర రాజు

‘‘మా తాత ఈ స్టూడియోను నిర్మించినపుడు రాజు లాగా బతికాడు. ఇప్పుడీ వ్యాపారం ప్రాభవం కోల్పోయింది’’ అంటారు రాజు. ఒకప్పుడు వెలుగుజిలుగుల ఫొటోలతో కళకళలాడిన ఈ స్టూడియో డార్క్‌రూమ్ ఇప్పుడు స్టోర్ రూమ్‌గా మారిపోయింది’’ అని ఆయన చెప్పారు.

తమిళనాడులోని నల్లపల్లి స్టూడియో అనే మరొ ఫొటో స్టూడియో కథ కూడా ఇలాంటిదే.

తన ముత్తాత 150 ఏళ్ల కిందట స్థాపించిన ఈ స్టూడియో నిర్వహణ కోసం నెలకు రూ. 20,000 ఖర్చు చేస్తున్నానని దాని యజమాని రంగనాథన్ తెలిపారు.

‘‘ఈ డిజిటల్ యుగంలో మనుగడ సాగించటానికి ఎంతో కష్టపడుతున్నాం. చాలా మంది ప్రత్యేక కార్యక్రమాలను ఫొటోలు తీయడం కోసం మమ్మల్ని పిలవడం మానేశారు. అందుకోసం వాళ్లందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘మరో ఐదేళ్ల వరకైనా ఫొటో స్టూడియోలు బతుకుతాయా అనేది అనుమానమే’’ అని ఆయన బీబీసీ తమిళ ప్రతినిధితో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.

Image copyright Sathyam Studio
చిత్రం శీర్షిక హైదరాబాద్ పాలకులైన నిజాం కుటుంబ సభ్యుల్లో ఒకరి పోర్ట్రెయిట్
Image copyright French Institute of Pondicherry
చిత్రం శీర్షిక తమిళనాడులో ఫొటో స్టూడియోల్లో ఇటువంటి పోర్ట్రెయిట్లను అధికంగా తీసేవారు

అందుకే ఈ ఆర్కైవల్ ప్రాజెక్టు చాలా ముఖ్యమని రాజు అంటారు.

‘‘ఈ ప్రాజెక్టు వల్ల నా స్టూడియోకు మేలు జరుగుతుందా అనేది నాకు తెలియదు. కానీ పరిశోధకులు నా స్టూడియోలో గంటల కొద్దీ సమయం గడిపినపుడు ఈ పాత ఫొటోలన్నీ చూసి వారు ఎంతో ఆశ్చర్యానందానికి లోనవడం చూశాను. వారు ఈ ఫొటోలకు పునర్జన్మనిచ్చినట్లు అనిపించింది’’ అని ఆయన పేర్కొన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం