రిటైర్మెంట్ తర్వాత సోనియా విశ్రాంతి తీసుకుంటారా? చక్రం తిప్పుతారా?

  • 4 డిసెంబర్ 2017
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ Image copyright Getty Images

సోనియా గాంధీ మరోసారి త్యాగం చేశారు. ఈసారి తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు.

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టబోయే రాహుల్ గాంధీ.. కాంగ్రెస్‌లో ఐదో తరానికి చెందిన, నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఆరో వ్యక్తి.

132 ఏళ్ల వయసు కలిగిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు 45 ఏళ్ల పాటు నెహ్రూ-గాంధీ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. 19 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ అత్యంత ఎక్కువ కాలం ఆ బాధ్యతలు నిర్వర్తించారు.

జవహర్‌లాల్ నెహ్రూ 11 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇందిరాగాంధీ ఏడేళ్లు, రాజీవ్ గాంధీ ఆరేళ్లు, మోతీలాల్ నెహ్రూ రెండేళ్లు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు.

Image copyright Getty Images

రాజకీయాల నుంచి రిటైర్మెంట్

సోనియా గాంధీకి రాజకీయాల నుంచి తప్పకుండా విరామం కావాలి.

డిసెంబర్ 2013లో సోనియాగాంధీ తన 66వ జన్మదినాన.. 70 ఏళ్లకు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని పార్టీ నేతలకు చెప్పారు.

సోనియా వ్యాఖ్యలు చాలా మంది కాంగ్రెస్ నేతల్లో కలవరాన్ని సృష్టించాయి. ఎందుకంటే భారతదేశంలో రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకున్నవారెవ్వరూ లేరనే చెప్పవచ్చు.

రాహుల్ పట్టాభిషేకానికి స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధమైపోయింది. అయితే 2016లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు విడిచిపెట్టలేకపోయారు.

అందుకే ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారు.

ఒకవేళ ఆమె రాయ్‌బరేలీ సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేకపోతే మాత్రం ఓ సాధారణ ఎంపీగా వ్యవహరిస్తారు.

ఒకవేళ రాయ్‌బరేలీకి రాజీనామా చేస్తే మాత్రం ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్‌కు అంత సులభమేమీ కాదు.

Image copyright Getty Images

వాట్ నెక్ట్స్?

భవిష్యత్తులో సోనియా గాంధీ ఏ పాత్ర పోషించాలన్న దానిపై కాంగ్రెస్ వర్గాల నుంచి అనేక సలహాలు, సూచనలు వస్తున్నాయి. సోనియా పార్టీగా మార్గదర్శిగా వ్యవహరించాలనేది చాలా మంది పార్టీ నేతల అభీష్టం.

కానీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక కూడా రాహుల్ తన తల్లి నీడలో ఉంటే ఆయనకు అంతకన్నా చెరుపు చేసేది మరొకటి ఉండదు.

2004 నుంచి 2017 వరకు తల్లీకొడుకులు 13 ఏళ్ల పాటు కలిసి పని చేసారు.

ఈ పదమూడేళ్ల కాలంలో అనేకసార్లు రాహుల్ అంచనాలు, ఆలోచనలకన్నా పార్టీపై సోనియా ఆధిపత్యమే ఎక్కువగా కనిపించింది.

Image copyright Getty Images

క్లీన్ ఇమేజ్

2010లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్డినెన్స్‌ను రాహుల్ ఎలా చింపి పారేశారో ప్రపంచం మొత్తం చూసింది.

ఆ ఆర్డినెన్స్.. దోషులుగా తేలిన రాజకీయ నేతలు చట్టసభలకు అనర్హులని ప్రకటించిన సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఉద్దేశించింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్‌కు క్షమాపణలు చెప్పారు.

ఆ సంఘటన తర్వాత రాహుల్ గాంధీ పారదర్శకత, సుపరిపాలన ఆశిస్తున్న క్లీన్ ఇమేజ్ కలిగిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

2004లో ప్రధాని బాధ్యతలు స్వీకరించడానికి సోనియా గాంధీ నిరాకరించినప్పుడు, చాలా మంది ఆమె పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని భావించారు.

ఈ సంఘటన తర్వాత జైరాం రమేష్, పులక్ ఛటర్జీ, ఇతర నేతలు యూపీఏ చైర్ పర్సన్, జాతీయ సలహా మండలి చీఫ్ సోనియాగాంధీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఆ విధంగా సోనియా గాంధీకి కేబినెట్ మంత్రి హోదా లభించింది.

పార్లమెంటరీ పార్టీ నేతగా, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు చీఫ్‌గా, ఇతర చోట్ల సోనియా ఒక అనధికార దర్బార్ నడిపేవారు.

సోనియా గాంధీ యూపీఏకు, జాతీయ సలహా మండలికి దూరంగా ఉండి ఉంటే మన్మోహన్ సింగ్, యూపీఏ ప్రభుత్వం పాలన మరింత మెరుగ్గా ఉండేది.

Image copyright Getty Images

రెండు అధికార కేంద్రాలు?

నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన 47 ఏళ్ల యువ రాహుల్ గాంధీ, ఒంటరిగానే తన బలాన్ని పెంచుకోవాలి. కష్టపడి పని చేసి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి.

ఒక తల్లిగా సోనియా గాంధీకి తన కుమారునికి సలహా ఇచ్చే హక్కు ఉంది. కానీ అది సంస్థాగతంగా కాకూడదు.

నియామకాలు, విధానపరమైన అంశాలు, సిద్ధాంతపరమైన విషయాలలో కాంగ్రెస్‌కు నాయకుల కొరత లేదు.

ఒకవేళ రాహుల్ గాంధీ నిజంగా తనకు సాయం కావాలనుకుంటే ప్రియాంక గాంధీని పిలిపించుకోవచ్చు.

ప్రియాంక.. రాహుల్‌ను బలోపేతం చేసేందకు ప్రయత్నించవచ్చు. కానీ ఈసారి కూడా రెండు అధికార కేంద్రాలు లేకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకోవాలి.

రాహుల్ తనను తాను నిరూపించుకోవాల్సిన సమయమిదే.

నెహ్రూ కుటుంబానికి చెందిన వారెవ్వరూ రాజకీయాల్లో విఫలం కాలేదు. ఈసారి ఆ బాధ్యత రాహుల్ భుజాల మీద ఉంది.

10 జనపథ్ నుంచి సోనియా గాంధీ వాటన్నిటినీ కేవలం ఒక ప్రత్యక్ష సాక్షిలా గమనించాలి.

(ఇవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు)

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)