స్మృతి ఇరానీ విమర్శలతో రాహుల్‌కు లాభమా, నష్టమా?

  • 5 డిసెంబర్ 2017
రాహుల్ గాంధీ Image copyright Getty Images

అందరి దృష్టినీ ఆకర్షించడం స్మృతి ఇరానీకి బాగా తెలుసు. బహుశా నటి కావడం వల్ల ఆమెకు ఈ విద్య సహజంగానే అబ్బిందేమో..

స్మృతి ఇరానీకి ప్రధాని నరేంద్ర మోదీ, సంఘ్ పరివార్ మద్దతు ఎక్కువ. గత ఎన్నికలలో ప్రత్యర్థి అయిన రాహుల్ గాంధీని విమర్శించడంలో ఆమె ఎల్లప్పుడూ ముందుంటారు.

2014లో అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్‌పై పోటీ చేసి స్మృతి ఇరానీ ఓడిపోయారు. కానీ బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. రాహుల్ గాంధీని విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా స్మృతి ఇరానీ వదులుకోరు.

గతంలో అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ అమెరికన్ యూనివర్సిటీలో తనకు ఎదురైన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెప్పారు. కశ్మీర్ అంశం మొదలుకుని నోట్ల రద్దు, వారసత్వ రాజకీయాలపై సంధించిన ప్రశ్నలకు దీటుగానే సమాధానం చెప్పారు. ఆ వెంటనే రాహుల్‌ను 'అసమర్థ నాయకుడు' అంటూ స్మృతి ఇరానీ విమర్శించారు. ఆమె విమర్శలు ఘాటుగా అనిపించినా వాటికి ఆధారాలు, లోతు తక్కువ.

Image copyright Getty Images

ఇక ఇరానీ చేసిన విమర్శ విషయానికి వస్తే.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనందుకే రాహుల్ 'అసమర్థ నాయకుడు' అయ్యారా? ఈ విమర్శలకు సమాధానంగా అమేథీలో స్మృతి ఇరానీ ఓటమిని కాంగ్రెస్ పార్టీ ఆమెకు గుర్తుచేసింది. అంతేకాకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గకుండా స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి అవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.

కాంగ్రెస్‌ విమర్శలకు తోడుగా చాలా మంది వ్యక్తులు కూడా ట్విటర్ వేదికగా స్మృతి ఇరానీని విమర్శించారు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ తన గత చరిత్రను మరిచిపోయినట్టుంది! డా. మన్మోహన్ సింగ్ కూడా ఎటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే భారత ప్రధానిగా పదేళ్లు పనిచేశారు.

స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీల మధ్య వయసు తేడా కేవలం 6 సంవత్సరాలే. రాహుల్ 1970లో జన్మించగా, స్మృతి 1976లో జన్మించారు. ప్రధాని మోదీ, ఆయన అధికార ప్రతినిధులు కూడా రాహుల్ గురించి మాట్లాడేటపుడు చాలా జాగ్రత్త వహిస్తున్నారు. రాహుల్‌ను ఎక్కువగా విమర్శిస్తే మోదీకి రాహుల్ సమ ఉజ్జీ అనే ఇమేజ్ ఇచ్చినట్టుంటుందని వారి భయం. అంతేకాకుండా.. ఇందిరా గాంధీ, సోనియా గాంధీలు లక్ష్యంగా ప్రత్యర్థులు మాటల దాడి చేయడం వారిద్దరికి ఏవిధంగా కలిసొచ్చిందో బీజేపీకి బాగా తెలుసు.

కానీ ఇరానీ, రాహుల్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా రాహుల్‌కు బాగానే కలిసొచ్చింది. దీనివల్ల.. రాహుల్ ఓ బలమైన నేతగా ఎదుగుతున్నారు.

రాహుల్ గాంధీ కాస్త బలమైన నేతగా, పనితీరు కాస్తంత సంతృప్తికరంగా ఉండటానికి చాలా కారణాలు పనిచేశాయి. ఫ్లోరిడా, బోస్టన్, ఇతర అమెరికా నగరాల్లో ఎక్కువకాలం ఉండటం కూడా ఆయనకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. శామ్ పిట్రోడా, మిలింద్ దేవరా, శశి థరూర్ లాంటి వారు రాహుల్ ప్రసంగాలను ముందుగానే సిద్ధం చేస్తారు. ప్రసంగంలో మెరుపుల్లాంటి పాయింట్లు కూడా అప్పుడే సిద్ధమవుతాయి.

Image copyright Getty Images

ముందస్తుగా తయారు చేసిన ప్రసంగాలను రాహుల్ విశ్వసిస్తారు. దాంతో పాటుగా వాటిపై ఆయన కసరత్తు చేస్తారు కూడా. కానీ దేశంలో జరిగే రాజకీయ కార్యక్రమాల కోసం ప్రసంగాలు రాసేందుకు కూడా నిపుణులను ఏర్పాటు చేసుకోకపోవడం చూస్తే నాకు జాలేస్తుంది!

ఆయన ప్రసంగం చెడ్డగా ఏమీ ఉండదు. కానీ సభికులతో ప్రత్యక్షంగా సంభాషించే సంధర్భాల్లోనే ఆయన ఇబ్బంది పడతారు.

వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే సమయాల్లో అమెరికాలోని వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడి ఉండాల్సింది. రాహుల్ గాంధీ బుష్ కుటుంబం, క్లింటన్ కుటుంబాలను ఉదహరించి ఉండొచ్చు. ఏమో ఎవరికి తెలుసు.. భవిష్యత్తులో బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ కుటుంబాలు కూడా రాజకీయాల్లోకి రావచ్చు. డొనాల్డ్ వారసత్వం ఇవాంకా ట్రంప్‌కూ రావొచ్చు కదా!

ప్రపంచంలో రాహుల్ ఎక్కడ ప్రసంగించినా, ఏ విషయంపై మాట్లాడినా.. దానిపై బీజేపీ స్మృతి ఇరానీ లాంటి వారి ద్వారా విమర్శలు చేయిస్తున్నంత సేపూ రాహుల్‌కు ఢోకా లేదు. రాహుల్‌కయినా, ఆయన కాంగ్రెస్ పార్టీకయినా రాజకీయంగా ఇది మంచిదే. రాహుల్ చేయబోయే అమెరికా పర్యటనలో ఈ ప్రయోజనం నెరవేరుతుంది.

Image copyright Getty Images

''ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్'' ఎన్నికల విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం గురించి రాహుల్ మాట్లాడింది ఒకింత బాగానే అనిపించింది. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి భారతదేశ ఎన్నికల విధానంలో ఉన్న ''ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్'' (ఎఫ్.పి.టి.పి) ను కాంగ్రెస్ ప్రశ్నిస్తూనే ఉంది.

సంక్షిప్తంగా చెప్పాలంటే, 'ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్' ఎన్నికల విధానంలో జనం ఓట్లేసి ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి గెలుస్తాడు. తక్కిన అభ్యర్థులకు పోలైన ఓట్లకు విలువ ఉండదు.

ఈ విధానంపై ఉన్న పెద్ద విమర్శ ఏమిటంటే మెజారిటీ ఓట్లు అనుకూలంగా పడనప్పటికీ అభ్యర్థులు గెలుపు సాధిస్తారు, పార్టీలు అధికారం చేపడుతుంటాయి. ఈ అంశం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఎఫ్.పి.టి.పి ఎన్నికల విధానాన్ని ప్రశ్నిస్తోంది. కానీ 1952, 1957, 1984 సాధారణ ఎన్నికలను మినహాయిస్తే తక్కిన ఎన్నికలన్నింట్లో ఈ విధానం ద్వారా ఎక్కువగా లాభపడింది కాంగ్రెస్ పార్టీనే!

అమెరికా పర్యటనలో రాహుల్ ప్రసంగాలు, సంభాషణల్లో 20109 ఎన్నికల వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై రాజకీయ అస్త్రాలను సంధించేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాను రాహుల్ ఎంచుకున్నారు. విదేశీ గడ్డపై నుంచి తమ ప్రత్యర్థులను విమర్శించడం, వారిపై మాటల దాడి చేయడాన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీనే కదా!

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)