పాకిస్తాన్: 'భారత్ జిందాబాద్' అని రాసినందుకు యువకుడి అరెస్టు

  • 5 డిసెంబర్ 2017
సాజిద్ షాకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడేఅవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. Image copyright Getty Images
చిత్రం శీర్షిక సాజిద్ షాకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

తన ఇంటి గోడలపై 'భారత్ జిందాబాద్' అని రాసిన పాక్ యువకుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని హరిపుర్ పట్టణంలో చోటు చేసుకుంది.

అగ్గి పెట్టెల పరిశ్రమలో పని చేసే సాజిద్ షా తన ఇంటి గోడలపై 'హిందుస్తాన్ జిందాబాద్' అని నినాదాలు రాసినందుకు ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలా రాసినందుకు అతనికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

బాలీవుడ్ సినిమాలు, పాటలంటే ఎంతో ఇష్టమని, నటుడు కావాలనుకున్నాని సాజిద్ పోలీసులకు తెలిపారు.

పాక్‌లో ఇలాంటి నినాదాలపై ప్రత్యేకంగా నిషేధం లేనప్పటికీ సెక్షన్ 505 ప్రకారం తిరుగుబాటును ప్రేరేపించే విధంగా ఉందని, సైనికుల ప్రాణాలకు ముప్పువాటిల్లేలా ఉందని, హింసను ప్రోత్సహించేలా ఉందనే కారణాలతో అరెస్టు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

సాజిద్ షాను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించారు.

సాజిద్ తండ్రి చనిపోయారని, నలుగురు అన్నదమ్ముల్లో అతనే పెద్దవాడని పోలీసు అధికారి అబ్దుల్ రెహాన్ తెలిపారు. అతని సంపాదన మీదే కుటుంబం గడుస్తోందని చెప్పారు.

అగ్గి పెట్టెల పరిశ్రమలో పని చేసేందుకు సాజిద్ బడికి వెళ్లడం మానేశారు.

గస్తీ దళాలు ఇచ్చిన సమాచారం మేరకు మఖాన్ వీధిలో ఇంటి గోడలపై రాసిన నినాదాలు చూసి సాజిద్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.

'పోలీసులు సాజిద్ ఇంటి తలుపు తట్టగా ఓ యువకుడు తలుపులు తెరిచారు. గోడలపై నినాదాలు రాసింది తానేనని అంగీకరించారు.' అని నివేదికలో వారు వెల్లడించారు.

'క్రికెట్' అరెస్టులు

గతేడాది జనవరిలో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని పోలి ఉండే అభిమానిని పాక్ పోలీసులు అరెస్టు చేశారు. భారత జాతీయ పతాకాన్ని తన ఇంటి ముందు ఎగరవేసి కోహ్లీకి అభినందనలు తెలపడంతో అతన్ని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

గత డిసెంబర్‌లో భారత యువకుడొకరు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీ షర్టును ధరించడంతో దాడికి గురయ్యారు.

ఇక జూన్‌లో ఛాంపియన్ ట్రోఫీ తుది పోరు సందర్భంగా.. మధ్యప్రదేశ్‌లో 15 మంది ముస్లింలు పాక్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేయడంతో వాళ్లపై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలనుకున్నారు. తర్వాత మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని కేసులు పెట్టారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)