అనంతపురం: నడిరోడ్డు మీద డిప్యూటీ ఇంజినీరుపై కాంట్రాక్టర్ దౌర్జన్యం
ప్రతిమ ధర్మరాజు
బీబీసీ కోసం
బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేస్తున్నారంటూ డిప్యూటీ ఇంజినీర్‌పై ఓ కాంట్రాక్టర్ దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కాలుతో తన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
కాంట్రాక్టర్ నరసింహారెడ్డి చెత్త ఊడ్చే యంత్రాన్ని అనంతపురం నగర పాలక సంస్థకు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ యంత్రానికి సంబంధించి అనేక ఆరోపణలు రావడంతో అధికారులు బిల్లుల చెల్లింపును నిలిపేశారు.
దీంతో ఆగ్రహించిన నరసింహారెడ్డి తన స్నేహితులతో కలిసి నగర పాలక సంస్థ కార్యాలయానికి వచ్చారు. అక్కడ పని చేస్తున్న ఇంజినీర్లను బూతులు తిట్టారు. ఆయన్ను అడ్డుకోడానికి ప్రయత్నించిన డిప్యూటీ ఇంజినీరు(డీఈ)ను బెదిరించారు.
అక్కడితో గొడవ సద్దుమణిగింది అనుకొని డీఈ కిష్టప్ప తన వాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో నరసింహారెడ్డి ఆయనను అడ్డుకున్నారు. రోడ్డుపైనే కిష్టప్పపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే కాలుతో అతడిని తన్నారు. కొట్టొద్దని వేడుకున్నా వినలేదు. ఈ సంఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు.
ఫొటో సోర్స్, facebook/మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియ
డీజీపీకి ఫిర్యాదు చేసిన మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్
దాడిపై బాధితుడు కిష్టప్ప వన్‌టౌన్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. మరోవైపు, మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాంట్రాక్టర్‌ను కఠినంగా శిక్షించాలని కోరింది.
పరారీలో ఉన్న కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకున్న డీఎస్పీ వెంకట్రావు అతడ్ని రిమాండ్‌కు పంపారు.
'అందుకే దాడి చేశా'
కాంట్రాక్టర్ నరసింహారెడ్డి జరిగిన ఘటనపై మాట్లాడుతూ, డీవో కిష్టప్పకు తనకు సంబంధమే లేదని తనను తిట్టినందు వల్లనే దాడికి దిగానని వివరణ ఇచ్చారు. తనకు చాలా అన్యాయం జరిగిందని, అధికారులు లంచాలు అడుగుతూ రెండేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
బాధితుడు కిష్టప్పను ఈ విషయంపై బీబీసీ ఫోన్లో సంప్రదించగా తోటి ఉద్యోగులను తిడుతుండటంతోనే తాను కలగచేసుకున్నానని, అతని బిల్లుల చెల్లింపులో ఆలస్యానికి తనకు సంబంధమే లేదని చెప్పారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)