గుజరాత్: మోదీకన్నా హార్దిక్ సభలకు ఎక్కువ జనం వస్తున్నారా?

  • 5 డిసెంబర్ 2017
రాజ్‌కోట్‌లో హార్దిక్ పటేల్ సభకు హాజరైన జనం Image copyright Bipin Tankariya
చిత్రం శీర్షిక రాజ్‌కోట్‌లో హార్దిక్ పటేల్ సభకు హాజరైన జనం

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 9న (ఆదివారం) తొలి విడత పోలింగ్ సమీపిస్తుండగా రాష్ట్రంలో పాటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్, ప్రధానమంత్రి నరేంద్రమోదీల మధ్య పోటాపోటీ ప్రచార పోరు సాగుతోంది.

గుజరాత్ రాజకీయాల్లో పటేల్ కొత్త యువకుడైతే.. మోదీ సొంత మైదానంలో ఒకప్పుడు అతిపెద్ద ప్రజాకర్షక శక్తి. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడినట్లు కనిపిస్తోంది. హార్దిక్ సభలకు వచ్చినంత మంది ప్రేక్షకులు మోదీ కార్యక్రమాల్లో కనిపించటం లేదని చాలా మంది అంటున్నారు.

‘‘డిసెంబర్ 3న నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వస్థలమైన రాజ్‌కోట్‌లో ఒక బహిరంగ సభ నిర్వహించారు. కానీ గత వారం హార్దిక్ పటేల్ సభకు హాజరైనంత మంది జనం మోదీ కార్యక్రమంలో కనిపించలేదు’’ అని ఆ రెండు సభలకూ హాజరైన రాజ్‌కోట్ జర్నలిస్ట్ కీర్తిసిన్హ్ ఝాలా చెప్తున్నారు.

చిత్రం శీర్షిక ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలో ఖాళీ కుర్చీలు

‘‘హార్దిక్ సభలకు హాజరవుతున్న వారిలో చాలా మంది సొంతంగా వస్తున్నారు. కానీ ప్రధాని మోదీ సభలకు ప్రజలను తీసుకురావడానికి బీజేపీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి వస్తోంది’’ అని కూడా పేర్కొన్నారు.

అయితే హార్దిక్ మాట్లాడుతున్న అంశాలు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయని చాలా మంది భావిస్తున్నారు.

Image copyright Sam Panthaky/AFP/Getty Images
చిత్రం శీర్షిక తన తల్లి ఉషాబెన్‌తో హార్దిక్ పటేల్ (ఫైల్ ఫొటో)

‘‘గ్రామాల్లో యువతకు వర్తించే వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం వంటి అంశాల గురించి హార్దిక్ మాట్లాడుతున్నారు. గుజరాత్‌ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం ఆకర్షణీయంగా లేకపోగా ఉద్యోగ అవకాశాలు లభించని యువత కూడా ఆయనకు మద్దతుగా వస్తున్నారు. మరోవైపు మోదీ ప్రజాకర్షణ కోల్పోయారు. ఒక సందర్భంలో మోదీ దక్షిణ గుజరాత్‌లో తన బహిరంగ సభ ప్రదేశాన్ని మార్చాల్సి వచ్చింది. గతంలో మోదీ భారీ సభలను నేను చూశాను. ఇప్పుడు ఆయన సభలకు అంతంత మాత్రం స్పందనను చూస్తున్నాను’’ అని హార్దిక్, మోదీ సభలు రెండింటికీ హాజరైన సీనియర్ జర్నలిస్ట్ దర్శన్ దేశాయ్ పేర్కొన్నారు.

ఆదివారం నాడు హార్దిక్ పటేల్ సూరత్‌లో ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత సూరత్‌లోని కిరణ్ చౌక్‌లో బహిరంగ సభ నిర్వహించారు.

Image copyright Sam Panthaky/AFP/Getty Images
చిత్రం శీర్షిక హార్దిక్ ఇంటి వద్ద ఆయన పేరుతో పోస్టర్ అంటిస్తున్న ఆయన కుటుంబ సభ్యురాలు (ఫైల్ ఫొటో)

‘‘హార్దిక్ 25 కిలోమీటర్ల రోడ్ షో, ఆ తర్వాత సూరత్‌లో జరిగిన బహిరంగ సభ అనూహ్యం. చెట్ల మీద కూడా నిలుచోవడానికి ఖాళీ లేదు. అదే రోజు (ఆదివారం) నరేంద్ర మోదీ భరూచ్ జిల్లా అమోద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఇది మొత్తం పరిస్థితిని చెప్తుంది’’ అని సూరత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఫైసల్ బాకిలి బీబీసీకి చెప్పారు.

‘‘హార్దిక్ సభలకు జనం భారీగా తరలిరావడం బీజేపీ మీద పాటీదార్లలో ఉన్న ఆగ్రహాన్ని చూపుతోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Image copyright Kevin Frayer/Getty Images
చిత్రం శీర్షిక ప్రధానమంత్రి నరేంద్రమోదీ

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హార్దిక్ పటేల్ మధ్య ఎలాంటి పోలికా లేదు. మోదీ దేశానికి అతిపెద్ద నాయకుడు. ప్రధాని మోదీ సభలకు వస్తున్న భారీ స్పందన పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం. అది పార్టీలో సానుకూల వాతావరణం కల్పించింది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి యామాల్ వ్యాస్ బీబీసీతో చెప్పారు.

భద్రతా కారణాల రీత్యా దక్షిణ గుజరాత్‌లో వేదికను మార్చాల్సి వచ్చిందని, వేరే ఏమీ లేదని కూడా వ్యాస్ చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)