మోదీ ప్రభుత్వానికి హిందూత్వం అజెండాగా మారినట్టేనా?

  • 6 డిసెంబర్ 2017
Image copyright Getty Images

25 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈరోజునే హిందూ మితవాదులు పురాతన బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో నిర్మించారు.

అయితే.. ముస్లిం పాలకులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రాంతంలోనే ఈ బాబ్రీ మసీదును నిర్మించారన్నది ప్రధాన ఆరోపణ.

ఈ ఘటనతో మొదలై.. భారత రాజకీయ రంగంలో భారతీయ జనతా పార్టీ ఎలా దూసుకుపోయిందన్న విషయాన్ని బీబీసీ ఇండియా పూర్వ ప్రతినిధి మార్క్ టలీ దగ్గరగా గమనించారు.

1992, డిసెంబర్ 6న అయోధ్య పట్టణంలో నేలమట్టమైన పురాతన మసీదును నేను చూశాను. ఈ ప్రాంతం శ్రీరాముడి జన్మస్థానం అంటూ హిందూ గుంపులు మసీదును ధ్వంసం చేశాయి.

బాబ్రీ మసీదును ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో రామ మందిరాన్ని నిర్మించాలంటూ ఆరేళ్లుగా బీజేపీ చేస్తోన్న ఆందోళనకు ఈ ఘటన పరాకాష్ఠ.

మసీదు సమీపంలో గుమిగూడిన దాదాపు 15,000 మంది ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చారు. మసీదు వద్ద మోహరించిన పోలీసు రక్షణ వలయాన్ని తోసుకుంటూ ఓ ప్రవాహంలా మసీదు పైకి ఎగబాకి ధ్వంసం చేయడం ప్రారంభించారు.

ఆ అల్లరి గుంపులను అదుపు చేయడం పోలీసులకు సాధ్యపడలేదు. మరోవైపున పోలీసులపై రాళ్లవర్షం మొదలైంది. దాంతో తమ షీల్డ్‌లను తలలకు అడ్డుగా పెట్టుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నేనొక చారిత్రక ఘటనకు సాక్షిగా ఉన్నట్టు నాకు అప్పుడే అర్థమైంది. ఈ ఘటనతో హిందూ జాతీయవాదులు విజయం సాధించినా లౌకికవాదం ఓడిపోయింది.

Image copyright Getty Images

''ఆధునిక భారతదేశంలో ఈ ఘటన చట్టాన్ని అత్యంత ఘోరంగా ఉల్లంఘించిన చర్య'' అంటూ రాజకీయవేత్త జోయా హసన్ అభిప్రాయపడ్డారు. భారతీయ జాతీయవాదానికి ఒక ముఖ్యమైన మలుపని ఆమె భావించారు.

అప్పటి బీబీసీ ఉత్తర్ ప్రదేశ్ ప్రతినిధి రామ్ దత్త్ త్రిపాఠీ ఈ సంఘటనపై మాట్లాడుతూ..

''హిందూ జాతీయవాదులు బంగారు గుడ్లు పెట్టే బాతును చంపేశారు. శ్రీరాముడి జన్మస్థానంగా భావించే ఆ ప్రాంతంలోని మసీదు భావోద్వేగాలకు సంబంధించిన అంశమే కానీ, ఆ ప్రాంతంలో నిజంగానే రామ మందిరాన్ని కట్టాలన్నది వారి కోరిక కాదు.''

''రామ మందిరాన్ని నిర్మించాలన్న ఉద్యమం బలహీనపడుతుంది. కానీ బాబ్రీ మసీదు మాత్రం అక్కడ ఉండదు కదా..'' అని ఆయన అన్నారు.

రామ్ దత్త్ త్రిపాఠీ పొరబడ్డాడని నేను మొదట్లో అనుకున్నాను. కానీ దేశవ్యాప్తంగా హిందూ-ముస్లిం అల్లర్లు చెలరేగాయి. రక్తం ఏరులైంది. ముంబైలో 900 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు హిందూ గుంపుల పక్షాన ఉన్నారన్న ఆరోపణలూ వచ్చాయి.

అల్లర్లు ఆగిపోయాయి. పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ రామ మందిర ఉద్యమం కూడా బలహీనపడింది.

Image copyright Getty Images

ఈ ఘటన తర్వాత హిందూ ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయని బీజేపీ భావించింది. కానీ 1993లో ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రాలేదు.

1995 తర్వాత జరిగిన మూడు సాధారణ ఎన్నికల్లో మెల్లమెల్లగా బీజేపీ బలపడటం ప్రారంభమై, 1999లో మాత్రమే అది అధికారంలోకి రాగలిగింది.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది.

అంతకన్నా ముందు... 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా నెహ్రూ-గాంధీ కుటుంబాల వారసత్వం బలహీనపడింది.

నాయకత్వం స్వీకరించాల్సిన రాజీవ్ గాంధీ భార్య, ఇటలీలో పుట్టి పెరిగిన సోనియా గాంధీ మొదట్లో రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడలేదు.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత పి.వి.నరసింహారావు 1991లో పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.

బాబ్రీ మసీదుపై దాడులను అడ్డుకోవడంలో పి.వి.నరసింహారావు విఫలమయ్యారంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు గోతులు తవ్వడం మొదలుపెట్టారు.

నరసింహారావు కూడా ఓ హిందూ జాతీయవాదే అని ఆరోపించారు. పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. 1996 ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు గందరగోళంగా మారాయి.

Image copyright Getty Images

1999లో బీజేపీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చాక కూడా రామ మందిరం అంశమే తమ పార్టీనీ గెలిపించిందని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గానీ, లాల్ క్రిష్ణ అద్వాణీ గానీ భావించలేదు.

హిందూత్వ అజెండాతోనే ముందుకు వెళ్లాలని కానీ, రామ మందిరం అంశాన్ని పునరుద్ధరించాలని కానీ అనుకోలేదు.

బీజేపీ ఓ హిందూ జాతీయవాద పార్టీలా కాకుండా, మధ్యస్థంగా ఉండాలని వారు భావించారు.

అప్పటికి వారిది సంకీర్ణ ప్రభుత్వం కావడం ఓ కారణమైతే, బాబ్రీ అంశంతో తమకు దూరమైన ఓటర్ల మద్దతును తిరిగి సంపాదించడం కూడా వారికి అత్యవసరంగా తోచింది.

''హిందూ మతంలో భిన్న పార్శ్వాలున్నాయి. మతం పేరుతో హిందువులందర్నీ ఏకతాటిపైకి తేలేం'' అని ఎల్.కే.అద్వాణీ ఓసారి నాతో అన్నారు.

కానీ హిందూ ఓట్లను హిందూ జాతీయవాదం గొడుగు కిందికి తెచ్చి ఉంటే, 1994 ఎన్నికల్లోనే బీజేపీ గెలిచి ఉండేదని చాలా మంది బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.

అయితే 1994 ఎన్నికల్లో పొత్తుల విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లు.. తడబాట్లే ఓటమికి ప్రధాన కారణం.

మరోవైపున పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సోనియా సంసిద్ధత వ్యక్తం చేయడం, పార్టీని ఒక్కతాటిపై తీసుకొచ్చేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించడం జరిగిపోయాయి.

ఆ తర్వాత పదేళ్లపాటు సోనియా నేతృత్వంలోనే కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది.

Image copyright Getty Images

బాబ్రీ ఘటన చరిత్రలో ప్రముఖమైనది అయినప్పటికీ.. దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేంతగా హిందూ ఓటు బ్యాంకును పటిష్టం చేయలేకపోయింది.

కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్టు అనిపిస్తోంది. 2014లో బీజేపీ మొదటిసారి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ నిరభ్యంతరంగా హిందూ జాతీయవాదాన్ని బలపరుస్తూ హిందూత్వ అజెండా అమలును కూడా ప్రారంభించారు.

కబేళాలకు ఆవుల క్రయవిక్రయాలను నిషేధించడం, హిందీ భాషను పనిగట్టుకుని రుద్దడం, విద్య, సాంస్కృతిక రంగాల్లో హిందూమత సానుభూతిపరులకు అగ్రస్థానం కల్పించడం.. ఇవన్నీ ఈ మార్పుకు ఉదాహరణలే!

భారతీయులందరి కోసమే దేశాన్ని అభివృద్ధి చేస్తున్నానంటూ మోదీ చెబుతున్నారు.

కానీ ఇటు కేంద్రంలోనూ, అటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ అధికారంలో ముస్లింల ప్రాతినిధ్యం మాత్రం చాలా తక్కువ.

రాజకీయ ప్రాధాన్యమున్న రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ ఒకటి. అలాంటి రాష్ట్రానికి ముస్లిం వ్యతిరేకిగా ముద్ర పడ్డ వ్యక్తిని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిని చేశారు.

Image copyright Getty Images

అయితే వాస్తవం ఏమిటంటే నరేంద్ర మోదీ హిందూత్వ ఓట్లతో గెలవలేదు. దేశాన్ని అభివృద్ధి చేస్తానని, దేశాన్ని మారుస్తానన్న హామీలే మోదీకి అధికారాన్ని కట్టబెట్టాయి.

మరో వైపున కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు కూడా మోదీకి లాభించాయి. గోవులను కబేళాలకు తరలించడం, వాటిని వధించడంపై నిషేధాన్ని సడలించేదుకు మోదీ ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది. లేకపోతే రైతుల ఓట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

హిందూ మతం చాలా భిన్నమైనది. భారతదేశం కూడా వివిధ రకాల పురాతన సంస్కృతులూ, సంప్రదాయాల సమ్మేళనం.

భారతదేశాన్ని లౌకికరాజ్యంగా కాకుండా, పూర్తి హిందూ దేశంగా మార్చేందుకు మోదీ ప్రయత్నిస్తారా అన్నది నాకింకా ప్రశ్నగానే మిగిలి ఉంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లో ఫొటోలు ఇప్పటివేనా?

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన ఐసీజే

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...