ప్రెస్‌రివ్యూ: ‘15 రోజుల్లో వేగం పెరగకపోతే మీ సంగతి చూస్తా’ - పోలవరంపై కేంద్ర మంత్రి గడ్కరీ

  • 6 డిసెంబర్ 2017
నితిన్ గడ్కరీ, దేవినేని ఉమా మహేశ్వరరావు Image copyright I and PR/Govt of AP

పోలవరం ప్రాజెక్టు తాము ఆపమన్నామంటూ మీడియా అపోహలు సృష్టించిందని, ఆ నెపాన్ని తమపై నెట్టేయడానికి ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నవ్వుతూ అన్నట్లు ఈనాడు పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పిలిచిన టెండర్‌ ప్రక్రియపై ముందుకెళ్లవద్దంటూ కేంద్ర జలవనరుల శాఖ మాజీ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ రాసిన లేఖ వివాదాస్పదమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో గడ్కరీ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమ, ఉన్నతాధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు.

సమావేశంలో ట్రాన్స్‌టాయ్‌ గుత్తేదారుతో గడ్కరీ మాట్లాడుతూ... 15 రోజుల్లో పనితీరులో వేగం చూపకపోతే అప్పుడు మీ సంగతి ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఉపగుత్తేదారు త్రివేణి సంస్థ సమస్యలపై స్పందిస్తూ'' వెళ్లి పనులు చేపట్టండి... బిల్లులు చెల్లించే బాధ్యత నాదని...'' కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. 'రాష్ట్ర ప్రభుత్వం 60 సి కింద కొంత పని తొలగించి వేరే వారికి ఇస్తామంటోంది. ఈ విషయంలో నాకు వేరే అభిప్రాయం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఈ విషయం మాట్లాడతా...' అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 7.2 లక్షల కోట్ల రూపాయల పనులు చేయించే తనకు పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత సమయంలోగా ఎలా పూర్తి చేయించాలో తెలుసునని గడ్కరీ అన్నట్లు ఈనాడు ఓ వార్త ప్రచురించింది.

Image copyright facebook/vishal

'పందెంకోడి'కి భారీ షాక్

తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకున్న సినీనటుడు విశాల్‌కు నామినేషన్‌ దశలోనే చుక్కెదురైంది. పట్టువదలకుండా పోరాడినప్పటికీ... 'క్లైమాక్స్‌'లో మాత్రం ఫలితం తనకు వ్యతిరేకంగా వచ్చింది. ఆయన నామినేషన్‌ గంటల వ్యవధిలో తిరస్కరణ, స్వీకరణ... మళ్లీ తిరస్కరణకు గురైంది అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్‌గా విశాల్‌ దాఖలు చేసిన నామినేషన్‌పై రోజంతా హైడ్రామా చోటుచేసుకుంది. సోమవారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా ఎన్నికల అధికారులు మంగళవారం వాటిని పరిశీలించారు. నామినేషన్‌లో అభ్యర్థిని ప్రతిపాదిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. విశాల్‌కు సంబంధించిన ఆ పదిమందిలో సుమతి, దీపన్‌ అనే ఇద్దరు ఓటర్లు ఉన్నారు. అయితే... వీరు ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించారు. దీంతో విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారి ప్రకటించారు అని ఆంధ్రజ్యోతి ప్రచురించింది.

Image copyright FACEBOOK/JANASENA

'అతని ప్రశ్న అంతర్మథనంలో పడేసింది'

తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నట్టు ఒక ప్రకటనలో చెప్పారు. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించాలని ఆయన నిర్ణయించారు అని ఈనాడు పేర్కొంది.

ఇటీవల ఇంగ్లాండ్‌ పర్యటనలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఓ ప్రశ్న నన్ను అంతర్మథనంలో పడేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదాన్ని ఆ విద్యార్థి ప్రస్తావించాడు. ''రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పడవ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తెదేపాకు మద్దతుగా ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసినందున మీరు కూడా బాధ్యులు కాదా?'' అని విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. ఆలోచిస్తే ఆ ప్రశ్నలో సహేతుకత ఉందనిపించింది. అందువల్ల ఆ పడవ ప్రమాదం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ కారణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంకటేశ్‌ ఆత్మహత్య ఉదంతంలో నా వంతు బాధ్యత కూడా ఉందని అంగీకరిస్తున్నా. వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపే వెళ్తున్నా' అని పవన్‌ వివరించారు అని ఈనాడు వెల్లడించింది.

Image copyright Naveen

ఏపీలో రాజకీయాస్త్రంగా 'ఎసిబి'

అక్రమార్కులు, లంచగొండుల పాలిట సింహస్వప్నంగా నిలవాల్సిన అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రతిష్ట మసకబారుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లోని అవినీతి పరుల భరతం పట్టడానికి ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ప్రస్తుతం రాజకీయాస్త్రంగా మారుతోందన్న విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఎసిబి పనిలో నేరుగా జోక్యం చేసుకుని స్వలాభం పొందుతున్నట్లు తెలుస్తోంది అంటూ ప్రజాశక్తి పేర్కొంది

లంచం కేసుల్ని మినహాయిస్తే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ ముందుకెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇక్కడే కొందరు పెద్దలు అవకాశాల్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయ, సామాజిక అంశాల ప్రాతిపదికనే ఎసిబి దాడుల్ని నిర్వహిస్తుందనే ఆరోపణలొస్తున్నాయి. టీడీపీ అధికారం చేపట్టాక 2014 జూన్ 1 నుంచి 2017 అక్టోబర్ 24వరకు సుమారు 118 ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్ని ఎసిబి అధికారులు నమోదు చేశారు. సామాజిక, రాజకీయ అంశాల్ని పరిగణనలోకి తీసుకునే ఈ దాడుల్ని చేయిస్తున్నట్లు తెలుస్తోంది అని ప్రజాశక్తి ఓ కథనాన్ని ప్రచురించింది.

Image copyright High court website

నిత్యం విషం తింటున్నాం: హైకోర్ట్

‘నిత్యం విషమే తింటున్నాం. మన పిల్లలూ ఈ విషాన్నే తినాల్సి వస్తోంది. రసాయనాలతో పండించిన, మగ్గబెట్టిన ఫలాలే కాదు.. పాలు, పెరుగు, పంచదార, ఉప్పు, బియ్యం.. ఇలా అన్నీ కల్తీనే. కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి? తనిఖీలు ఏమైనా చేస్తున్నారా? కోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు మాత్రం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం.. అని చెబుతారు. లేదంటే దాని గురించే పట్టించుకోరు. అయినా మీ బాధ్యతల గురించి మేం ఎందుకు చెప్పాలి? మీ అంతట మీరు మీ బాధ్యతలను నిర్వర్తించలేరా? మేం చెబితే పాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటారు. చెప్పకపోతే మీరంతట మీరు చేయరు' అని హైకోర్టు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించినట్లు సాక్షి పేర్కొంది.

'కాల్షియం కార్బైడ్‌ ఉపయోగించి పళ్లను మగ్గబెడుతున్న వారికి సంబంధించి ఇటీవలి కాలంలో ఎన్ని తనిఖీలు చేశారు? ఎన్ని కేసులు పెట్టారు? ఎంత మందిని ప్రాసిక్యూట్‌ చేశారు? ఈ వివరాలన్నీ తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచండి. లేనిపక్షంలో కోర్టులంటే ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి' అని హైకోర్టు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. కాల్షియం కార్బైడ్‌ను ఉపయో గించి పండ్ల వ్యాపారులు కాయల్ని మగ్గబెట్టి అమ్మకాలు చేస్తుండటంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు పిల్‌గా పరిగణించింది' అని సాక్షి ఈ వార్త ప్రచురించింది.

Image copyright ktr/facebook

'అందరికీ కొలువులు దక్కవు'

'ఏ ప్రభుత్వం అయినా అన్ని ఉద్యోగాలు భర్తీ చేసినా... అందరికీ కొలువులు దక్కవు. ఎవరి పొట్టకొట్టే పనిని తెలంగాణ ప్రభుత్వం ఎన్నడూ చేయబోదు’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదికోట్ల లావాదేవీలు జరిపిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 10 కోట్ల లావాదేవీలు పూర్తి చేసినందుకు ఆపరేటర్లకు అభినందనలు తెలిపారు. మీసేవ ఆపరేటర్ల సంక్షేమం కోసం టీఫైబర్ ద్వారా ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. మీసేవా ఆపరేట్లరు తాము ఉన్నచోటే ఉపాధిని పొందుతున్నారని, వారి డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు నమస్తే తెలంగాణ వార్త ప్రచురించింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)