కుల వ్యవస్థ ప్రసంగాలతో పోయేది కాదు: బీబీసీతో అంబేడ్కర్

  • 7 డిసెంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionభారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు: బీఆర్ అంబేడ్కర్

బీబీసీ: డాక్టర్ అంబేడ్కర్, భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందా?

అంబేడ్కర్: అవ్వదు. అయితే నామమాత్రంగా, లాంఛనప్రాయంగా మాత్రం ఉంటుంది.

భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీ ఛైర్మన్ బీఆర్ అంబేడ్కర్ 1953 జూన్ 22న బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం భవిష్యత్తు, ఎన్నికల వ్యవస్థ, ఇతర అంశాలపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందా అని బీబీసీ అడగ్గా- విజయవంతం కాదని అంబేడ్కర్ సమాధానమిచ్చారు. అయితే నామమాత్రంగా, లాంఛనప్రాయంగా మాత్రం ఇది కొనసాగుతుంటుందని, ఎన్నికలు, ప్రధానమంత్రి, ఇతరత్రా అంశాలన్నీ ఉంటాయని చెప్పారు.

సరైన వారు ఎన్నికైతేనే ఎన్నికలకు ప్రాధాన్యం

ఎన్నికలు ముఖ్యం కాదా అని ప్రశ్నించగా, ముఖ్యం కాదని, ఎన్నికల్లో సరైన వారు ఎన్నికైతేనే వాటికి ప్రాధాన్యం ఉంటుందని అంబేడ్కర్ స్పష్టం చేశారు.

సరిగా పాలించని వారిని గద్దె దించేందుకు ఎన్నికలు ప్రజలకు అవకాశం కల్పిస్తాయి కదా అని పేర్కొనగా, ''అవును, కానీ ఆ స్పృహ, ఆలోచన ఎవరిలో ఉన్నాయి? ఓటింగ్ జరిగేది ప్రభుత్వాలను ఎన్నుకొనేందుకు/మార్చేందుకు అనే చైతన్యం ఎవరిలో ఉంది? ఎవ్వరిలోనూ లేదు'' అని ఆయన స్పందించారు.

మన ఎన్నికల వ్యవస్థలో అభ్యర్థికి ప్రాధాన్యం తక్కువ అని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. అభ్యర్థిని నిర్ణయించడంలో ప్రజలకు పాత్ర లేకుండా పోయిందని కూడా ఆయన చెప్పారు.

''ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తమ చిహ్నం జోడెద్దులకు ఓటేయాలని ప్రజలను కోరింది. ఎందుకంటే.. అభ్యర్థి ఎవరన్నది జనం పట్టించుకోరు. ఓటర్లు జోడెద్దులకే ఓటేశారు'' అని ఆయన చెప్పారు.

చిత్రం శీర్షిక బీబీసీ ఇంటర్వ్యూలో అంబేడ్కర్

అసమానతలు పోవాలి

''భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. మౌలిక కారణం ఏంటంటే- ఇక్కడున్న సామాజిక వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం అనువైనది కాదు'' అని అంబేడ్కర్ తెలిపారు.

భారత సామాజిక వ్యవస్థలో అసమానతలు ఉన్నాయని ఆయన విచారం వ్యక్తంచేశారు. వివక్షతో కూడిన ఈ వ్యవస్థను అంతమొందించాల్సి ఉందన్నారు.

శాంతియుత మార్గంలో ఈ వ్యవస్థను అంతమొందించాలంటే సమయం పడుతుందని అంబేడ్కర్ చెప్పారు. సామాజిక వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి (జవహర్‌లాల్ నెహ్రూ), ఇతర నాయకులు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు కదా అని ప్రస్తావించగా, అంతులేని ప్రసంగాలతో ఒరిగేదేమీ లేదని అంబేడ్కర్ వ్యాఖ్యానించారు. ప్రసంగాలతో విసుగెత్తిపోయామన్నారు.

మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు.

మార్పు రాకపోతే కమ్యూనిజమే ప్రత్యామ్నాయం

మార్పు కోసం చేసే ప్రయత్నాలేవీ ఫలించకపోతే ప్రత్యామ్నాయం ఏమిటని బీబీసీ ప్రశ్నించగా- అప్పుడు ఒక విధమైన కమ్యూనిజమే ప్రత్యామ్నాయం అవుతుందని తాను భావిస్తున్నట్లు అంబేడ్కర్ చెప్పారు.

ఇటీవలే తాను అమెరికా వెళ్లి వచ్చానని ఆయన ప్రస్తావించారు. అమెరికాలో ప్రజాస్వామ్యం ఉందని, ప్రజాస్వామ్యం విజయవంతమవుతున్నందున అక్కడ కమ్యూనిజం రాదని అభిప్రాయపడ్డారు. అమెరికాలో అందరికీ మంచి ఆదాయం ఉందని చెప్పారు.

భారత్‌లోనూ అలాంటి పరిస్థితులు ఏర్పడేలా చర్యలు చేపట్టవచ్చు కదా అని బీబీసీ పేర్కొనగా, భారత్‌లో అదెలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.

భారత్‌లో అందరికీ భూమి లేదని, వర్షపాతం తక్కువని, ఇతర సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించకుండా పరిస్థితులను మెరుగుపరచలేమని ఆయన వివరించారు.

ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించగలదని తాను అనుకోవడం లేదని అంబేడ్కర్ తెలిపారు.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా

సిక్కిం: సున్నా నుంచి 10కి చేరిన బీజేపీ బలం.. ఫిరాయింపు చట్టం వర్తించదంటున్న రాంమాధవ్

విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా

’అణ్వస్త్ర’ క్షిపణిని పరీక్షించిన అమెరికా.. సైనిక ఉద్రిక్తతలను పెంచుతోందన్న రష్యా

అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్

సిరియా యుద్ధం ఈ బాలుడి ముఖాన్ని మార్చేసింది

చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు

టాయిలెట్లో శిశువును హత్యచేసిందనే ఆరోపణల నుంచి ఎల్ సాల్వడార్ మహిళకు విముక్తి