ప్రెస్ రివ్యూ: తిరుమలలో నకిలీ టికెట్లు

  • 7 డిసెంబర్ 2017
తిరుమల Image copyright Facebook

తిరుమలలో బుధవారం నకిలీ టికెట్ల వ్యవహారం బయటపడింది. శ్రీవారి దర్శనం కోసం ముంబయికి చెందిన భక్తుల బృందం కొనుగోలు చేసిన 188 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నకిలీవని తేలిందని ఈనాడు పత్రిక ఓ కథనంలో వెల్లడించింది.

క్యూలైన్‌లోకి వెళ్లే సమయంలో సిబ్బంది స్కానింగ్‌ చేయగా వారి టికెట్లు నకిలీవని గుర్తించారు. ఒక్కో టికెట్ విలువ రూ. 300. ముంబయికి చెందిన ప్రశాంత్‌ దయానంద్‌ భగత్‌ ఈ మోసానికి పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

సెల్‌ఫోన్‌ ఆధారంగా తిరుమలలోని ఓ గదిలో ఉన్న అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మోసపోయిన భక్తులను శ్రీవారి దర్శనానికి తితిదే అనుమతించింది.

Image copyright Getty Images

ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు

ఉత్తర కోస్తాకు వాయుగుండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం ఉదయం ఏర్పడిన వాయుగుండం మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

శుక్రవారం సాయంత్రానికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపిందని సాక్షి పేర్కొంది.

ఈ వాయుగుండం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ నెల 9 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించినట్టు తెలిపింది.

హైదరాబాద్ మెట్రో 'స్మార్ట్' ఆఫర్

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రాయితీలను ప్రకటిచించింది. స్మార్ట్ కార్డుతో ప్రయాణించే వారికి ఛార్జీల్లో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఇదివరకు ఇది 5 శాతం ఉండేది.

ఈ రాయితీ పథకం 2018 మార్చి 31 వరకు అన్ని ట్రిప్పుల్లో వర్తిస్తుందని నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.

అలాగే, పేటీయం వాలెట్ ద్వారా మొట్టమొదటిసారిగా రూ.100 లేదా ఆపైన స్మార్ట్ కార్డును రీచార్జ్ చేసుకుంటే రూ.20 క్యాష్‌బ్యాక్ పొందే ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

Image copyright Getty Images

సతాయిస్తున్న కాలేజీలు

విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగివ్వడంలో తెలంగాణలోని ఇంజీనిరంగ్ కాలేజీలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయి.

వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారితోపాటు, కోర్సు పూర్తి చేసిన వారినీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనం ప్రచురించింది.

హైకోర్టు ఆదేశాలను, సాంకేతిక విద్యామండలి ఉత్తర్వులనూ బేఖాతరు చేస్తూ, పూర్తి ఫీజు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయని పేర్కొంది.

ఈ అంశంపై జేఎన్‌టీయూ, ఉన్నత విద్యామండలి, ఏఐసీటీఈ, ఓయూకు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)