క్లినికల్ ట్రయల్స్‌: ప్రయోగాల వెనుక కథేంటి?

  • 7 డిసెంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionక్లినికల్ ట్రయల్స్‌: ప్రయోగాల వెనుక కథేంటి?

వీడియో/ఫొటోలు: బి. రాజేంద్ర ప్రసాద్

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటకు చెందిన నాగరాజు జూన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అదే మండలం కొత్తపల్లి గ్రామస్థుడు అశోక్‌ మతిస్థిమితం కోల్పోయారు. సురేశ్‌ పరిస్థితి కూడా అలానే ఉంది.

వీళ్లంతా కొన్ని ఫార్మా కంపెనీల క్లినికల్ ట్రయల్స్‌ (ఔషధ ప్రయోగాల)లో పాల్గొన్నట్లు వారి సంబంధికులు బీబీసీకి చెప్పారు. ఔషధ ప్రయోగాల వల్లే వాళ్ల ఆరోగ్యం దెబ్బతిన్నదని అంటున్నారు.

డబ్బుకు ఆశపడి జమ్మికుంట మండల పరిధిలో కొంతమంది స్వచ్ఛందంగా క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధపడుతున్నారని పోలీసుల దర్యాప్తులోనూ తేలింది.

ఆర్థిక సమస్యలు, దళారుల మోసపూరిత మాటల వల్లే కొందరు అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి బీబీసీతో అన్నారు.

Image copyright jagadeesh/whatsapp
చిత్రం శీర్షిక జగదీశ్

జమ్మికుంట మండలానికి చెందిన వంగర నాగరాజు (48) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు ఆయన కుమారుడు జగదీశ్ తెలిపారు.

'మా నాన్న కేటరింగ్ పని చేసేవారు. ఒక రోజు నడుం నొప్పితో కుప్పకూలిపోయారు. ఆస్పత్రిలో చేర్చాం. చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ తర్వాత కర్మకాండల కోసం ఇళ్లు శుభ్రం చేస్తుంటే నాన్నకు సంబంధించిన కొన్ని పత్రాలు దొరికాయి. వాటి గురించి ఆరా తీస్తే బెంగళూరులోని ఓ ఫార్మా కంపెనీలో ఆయన క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. ఇంట్లో ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. ఆ పత్రాల్లో ఏప్రిల్ 26న నాన్న క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు ఉంది. జూన్‌లో ఆయన చనిపోయారు' అని నాగరాజు కుమారుడు జగదీశ్ బీబీసీకి ఫోన్‌లో వివరించారు.

కేసీఆర్ మీద ఫేస్‌బుక్‌ పోస్టులు: కండక్టర్‌ సస్పెన్షన్

తెలంగాణలో కొత్త జోన్లతో కొలువులొచ్చేనా?

Image copyright jagadeesh/whatsaap
చిత్రం శీర్షిక ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీ క్లినికల్ ట్రయల్ పత్రాలపై సంతకం చేసిన నాగరాజు

'క్లినికల్ ట్రయల్స్ విషయం తెలిశాక నాన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఆస్పత్రి చుట్టూ తిరిగాం. డాక్టర్లు ఇప్పటి వరకూ నివేదిక ఇవ్వలేదు. క్లినికల్ ట్రయల్స్ జరిపిన బెంగళూరులోని ఫార్మా కంపెనీకి వెళ్లి మాకు న్యాయం చేయాలని అడిగినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దీనిపై స్పందించ లేదు' అని జగదీశ్ చెప్పారు.ప్రస్తుతం తాను జమ్మికుంటలో డిగ్రీ చేస్తున్నాని ఖాళీగా ఉన్నప్పుడు కూలీకి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాని చెప్పారు.

అశోక్, సురేశ్‌లది మరో కథ

క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అశోక్ మతిస్థిమితం కోల్పోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.

Image copyright B Rajedra prasad
చిత్రం శీర్షిక క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని సురేశ్ చెప్పారు.

బెంగళూరులో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న సురేశ్ అనారోగ్యానికి గురై వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, కేటరింగ్ పని మీద తాను 2006లో హైదరాబాద్ వెళ్లానని, అక్కడే కొందరి ద్వారా క్లినికల్ ట్రయల్స్ విషయం తెలిసిందని చెప్పారు.

Image copyright B Rajedra prasad
చిత్రం శీర్షిక క్లినికల్ ట్రయిల్‌లో పాల్గొన్నందుకు ఓ ఫార్మా ల్యాబ్ నుంచి తనకు అందిన చెక్‌ను చూపెడుతున్న సురేశ్

'ఆర్థిక ఇబ్బందుల వల్ల మొదట హైదరాబాద్‌లోని కొన్ని ఫార్మా కంపెనీల్లో క్లినికల్స్ ట్రయల్స్‌లో పాల్గొన్నాను. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లాను. అక్కడ బౌన్సర్లను పెట్టి మరీ బలవంతంగా నాతో కొన్ని ద్రవాలు తాగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నాకు రక్తపు వాంతులు అయ్యాయి. చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరాను. కానీ, అక్కడి వాతావరణం, చికిత్స విధానం నచ్చక పారిపోయి వచ్చాను. ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నా' అని సురేశ్ బీబీసీకి చెప్పారు.

క్లినికల్ ట్రయల్స్ పై ప్రత్యేక కమిటీ

మెడికల్ ట్రయల్స్ వల్లే ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్న వారి కుటుంబాలను కలసి నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్ రెడ్డి చైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ నివేదిక రావాల్సిఉంది.

కమిటీ వేశాం, చర్యలు తీసుకుంటాం: మంత్రి ఈటెల

క్లినికల్ ట్రయల్స్ అంశం రాష్ట్ర పరిధిలో లేనప్పటికీ జరిగిన ఘటనలపై ఎప్పటికప్పుడు 'డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా'కు తెలియజేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన ఈ అంశంపై కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.

'నాగరాజు మృతి తర్వాత క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి మరో మూడు కేసులు బయటకు వచ్చాయి. ఇదంతా డీసీజీఐ పరిధిలో ఉండే అంశం అయినప్పటికీ నాగరాజు మృతి తర్వాత జస్టిస్ గోపాల్ రెడ్డి, డీఐజీ, నిమ్స్ డైరెక్టర్‌తో పాటు మరో ఇద్దరితో కమిటి వేశాం. ఆ నివేదిక వచ్చాక డీసీజీఐకి పంపిస్తాం' అని మంత్రి చెప్పారు.

'డీసీజీఐ, ఎథిక్స్ కమిటీ కూడా జరిగిన సంఘటనలపై విచారణ జరుపుతోంది. నివేదికలు వచ్చాక తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం' అని ఈటెల తెలిపారు.

డబ్బులకు ఆశపడి యువత ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మంత్రి అన్నారు. నాగరాజుపై క్లినకల్ ట్రయల్స్ నిర్వహించిన లోటస్ సంస్థపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారు తమ పేర్లు చెబితే వైద్య సహాయం అందిస్తామని ప్రకటించారు.

Image copyright B Rajedra prasad
చిత్రం శీర్షిక తన తండ్రి మృతిపై పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని జగదీశ్ బీబీసీకి ఇచ్చారు.

స్పందించని లోటస్ ల్యాబ్‌ యాజమాన్యం

లోటస్ ల్యాబ్ క్లినికల్ ట్రయల్స్‌లో నాగరాజు పాల్గొన్నట్లు అతని కుమారుడు జగదీశ్ చెప్పిన నేపథ్యంలో బెంగళూరులో ఉన్నలోటస్ ల్యాబ్‌ను బీబీసీ సంప్రదించింది.

నాగరాజు మృతి అలాగే, తెలంగాణ పోలీసులు లోటస్ ల్యాబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని వాళ్ల దృష్టికి తీసుకొచ్చింది.

ఈ విషయంపై బీబీసీ బెంగళూరు ప్రతినిధి లోటస్ యాజమాన్యాన్ని ఈ- మెయిల్ ద్వారా సంప్రదించారు. అయితే దీనిపై లోటస్ ల్యాబ్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం రాలేదు.

Image copyright Getty Images

'క్లినికల్ ట్రయల్స్ తప్పుకాదు.. ప్రజల్లో అవగాహన కల్పించాలి'

ఏదైనా కొత్త ఔషధాన్ని కనిపెట్టాలంటే క్లినికల్ ట్రయల్స్ అవసరమని.. పెన్సిలిన్ నుంచి పారాసిటమాల్ మాత్ర వరకు కొత్త ఆవిష్కరణల ఫలితంగానే మానవాళి అరోగ్యంగా మనుగడ సాగిస్తోందని కేర్ ఆస్పత్రి క్లినికల్ రీసెర్చ్ హెడ్, సంస్కార ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ స్థాపకులు డాక్టర్ శ్రీధర్ తిరునగరి అన్నారు.

క్లినికల్ ట్రయల్స్ నిబంధనలను ఆయన బీబీసీకి వివరించారు.

  • భారత్‌లో యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
  • డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ రూల్స్-2005 నిబంధనల్లోని షెడ్యూల్ 'వై' ప్రకారమే దేశంలోని అన్ని ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ చేయాలి.
  • స్వచ్ఛందంగా క్లినికల్ ట్రయల్స్‌కు అంగీకరించిన వ్యక్తి ఎ.వి.(ఆడియో, వీడియో ముందు అతని వ్యాఖ్యలను రికార్డు చేసి) తీసుకున్నాకే ఫార్మా కంపెనీలు ప్రయోగాలు నిర్వహించాలి.
  • క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైన వ్యక్తి వివరాలను అందరికీ అందుబాటులో ఉండేలా క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఇండియా (www.ctri.nic.in)లో కూడా పొందుపర్చాలి.

'మొదటి దశ ప్రయోగశాలలో జీవకణాలపై ప్రయోగాలు చేసి తర్వాత జంతువులపై రెండు మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే మనుషులపై నిర్వహిస్తారు' అని డాక్టర్ శ్రీధర్ తెలిపారు.

'ఇతర దేశాల్లో క్లినికల్ ట్రయల్స్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. ఎన్జీవోలు కూడా అందులో పాలుపంచుకుంటాయి. కానీ, భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ అంటే ప్రాణాలు తీసే ప్రయోగాలు అనే ముద్రపడటం దురదృష్టకరం' అని అన్నారు.

'ప్రాణాలు కాపాడే మందుల ఆవిష్కరణకే ఔషధ ప్రయోగాలు నిర్వహిస్తారు. క్లినికల్ ట్రయల్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది' అని డాక్టర్ శ్రీధర్ వివరించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)