మోదీపై నోరు జారిన మణిశంకర్‌ అయ్యర్ - రాహుల్ గుస్సా

  • 7 డిసెంబర్ 2017
రాహుల్ గాంధీ, మోదీ, మణిశంకర్ అయ్యర్ Image copyright AFP/Getty Images

కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో వేడి మరింత రాజుకుంది.

మణిశంకర్ వ్యాఖ్యలతో బీజేపీకి కాంగ్రెస్‌పై దాడి చేయడానికి మంచి అవకాశం లభించగా, కాంగ్రెస్ ఆత్మరక్షణ స్థితిలో పడిపోయింది.

ప్రధాని మోదీని ఉద్దేశించి మణిశంకర్ అయ్యర్, "ఆయన చాలా నీచమైన వ్యక్తి. ఆయనకు సభ్యత లేదు. ఇలాంటి సందర్భంలో కుళ్లు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమిటి" అని ప్రశ్నించారు.

అంబేడ్కర్‌ పాత్రను తెరమరుగు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ప్రస్తావిస్తూ గురువారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై మణిశంకర్ అసహనాన్ని వ్యక్తం చేశారు.

'మణిశంకర్.. క్షమాపణలు చెప్పు!'

మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలతో రాజకీయంగా జరిగే నష్టాన్ని అంచనా వేసిన రాహుల్ గాంధీ కార్యాలయం దీనిపై ఓ ట్వీట్ చేసింది.

"కాంగ్రెస్‌పై దాడి చేయడానికి బీజేపీ, ప్రధానమంత్రి తరచుగా అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తుంటారు. కాంగ్రెస్‌ సంస్కృతి, వారసత్వం దీనికి భిన్నం. ప్రధానిని ఉద్దేశించి మణిశంకర్ అయ్యర్ వాడిన భాషను, ఆ ధోరణిని నేను సమర్థించను. తన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పాలని నేను, కాంగ్రెస్ కోరుతున్నాం" అన్నది ఆ ట్వీట్ సారాంశం.

మణిశంకర్‌కు వివాదాలు కొత్త కాదు

2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మణిశంకర్ అయ్యర్ నాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ 'చాయ్ వాలా' అన్నారు. అంతకన్నా ముందు ఆయన వాజ్‌పేయీని 'అసమర్థుడు' అన్నారు.

గుజరాత్ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ కోసం ప్రచారానికి డిసెంబర్ 7 చివరి రోజు. కాబట్టి మణిశంకర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిదాడి చేసే అవకాశాన్ని ప్రధాని మోదీ వదులుకోలేదు.

Image copyright Twitter @BJP4India

మోదీ జవాబు

మణిశంకర్ వ్యాఖ్యలపై ప్రధాని, "ఆయన నన్ను నీచుడని అన్నారు. నేను సమాజంలో అట్టడుగు వర్గం నుంచి వచ్చినవాడిని. నా జీవితంలో ప్రతి క్షణాన్ని పేదల కోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం, ఓబీసీ సముదాయాల కోసం పని చేయడానికే వెచ్చిస్తాను. ఆయన భాషను ఆయన వద్దే ఉండనివ్వండి. నేను నా పని చేసుకుంటూ పోతాను" అన్నారు.

ఇది అక్కడితో ఆగలేదు. బీజేపీ నేత, మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

"మణిశంకర్ అయ్యర్ మా ప్రధానిని నీచుడని అన్నారు. కానీ ప్రధాని పట్ల మేం గర్వపడతాం. ఆయన మణిశంకర్ వ్యాఖ్యలకు చాలా హుందాగా జవాబిచ్చారు. మణిశంకర్ మనస్తత్వం దర్బారీల రకానిది" అని ఆయన అన్నారు.

Image copyright AFP/Getty Images

మణిశంకర్ క్షమాపణ

మణిశంకర్ వ్యాఖ్యల పట్ల తమ వైఖరిని స్పష్టం చేయడంలో కాంగ్రెస్ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను పార్టీ ఖండిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు.

తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మణిశంకర్ "అంబేడ్కర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి కాంగ్రెస్ పైనా, రాహుల్ గాంధీ పైనా వ్యంగ్యోక్తులు ఎందుకు విసిరారు? ప్రధాని రోజూ మా నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. నేనొక ఫ్రీలాన్స్ కాంగ్రెస్‌వాదిని. పార్టీలో నాకెలాంటి పదవీ లేదు. కాబట్టి ప్రధానికి నేను ఇలాంటి భాషలో జవాబు చెప్పగలను. నేనాయనను నీచుడని అన్నానంటే నా ఉద్దేశంలో లో లెవల్ అని అర్థం. నేను హిందీలో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్‌లో ఆలోచిస్తాను. ఎందుకంటే హిందీ నా మాతృభాష కాదు. నేను మాట్లాడిన మాటలకు వేరే అర్థం వచ్చి ఉంటే అందుకు క్షమాపణ చెబుతున్నాను" అన్నారు.

అయితే 2014లో మోదీని చాయ్‌వాలా అన్నారన్న ఆరోపణలను మణిశంకర్ తోసిపుచ్చారు. "నేను మోదీని ఎప్పుడూ చాయ్‌వాలా అనలేదు. కావాలంటే మీరు ఇంటర్నెట్‌లో వీడియోలన్నీ చూసుకోండి" అని అన్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)