అభిప్రాయం: న్యాయవ్యవస్థకు సవాలు విసురుతున్న హదియా కేసు

  • ఫ్లావియా ఆగ్నెస్
  • మహిళా హక్కుల న్యాయవాది
హదియా, షఫీ జహాన్
ఫొటో క్యాప్షన్,

హదియా, షఫీ జహాన్

హదియా, షఫీ జహాన్ అనే ఇద్దరు మైనారిటీ తీరిన యువతీయువకులు మతాంతర వివాహం చేసుకోవడం రాజకీయ వివాదంగా మారి, ప్రస్తుతం దాని మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

మెట్రోపాలిటన్ నగరాల్లో అయితే దానిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, హిందూ యువతులు, ముస్లిం యువకుల మధ్య జరిగే ఈ మతాంతర వివాహాలను హిందూ అతివాద వర్గం 'లవ్ జిహాద్'గా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తుండడంతో దీనిపై వివాదం ముదిరింది.

ముస్లిం యువకులు ఒక పథకం ప్రకారం హిందూ యువతులను తమ మతంలోకి ఆకర్షించేందుకు చేపట్టే రాజకీయ పన్నాగమే లవ్ జిహాద్‌ అనే ప్రచారం మొదలైంది. ఇటీవల భారతదేశంలో ఇదొక విషపూరిత ప్రచారంలా మారి యువ దంపతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది.

భారతదేశం ఒక లౌకిక దేశం. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు. మత మార్పిడి లేకుండా మతాంతర వివాహాన్ని చేసుకునే అవకాశం కూడా రాజ్యాంగం కల్పిస్తోంది.

ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో చేసుకున్న వివాహం కేవలం వారిద్దరి అంగీకారంతో లేదా వారిలో ఒకరి అంగీకారంతో మాత్రమే రద్దు అవుతుంది తప్ప మూడో వ్యక్తి ప్రమేయంతో కాదు. అయితే ప్రస్తుత వివాదంలో ఆ ప్రాథమిక హక్కును కూడా కాలరాస్తున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాలూనుకునేందుకు ప్రయత్నిస్తున్న దక్షిణాది రాష్ట్రమైన కేరళలో ఈ వివాదం తలెత్తింది. కేరళలో ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ముస్లింలు ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాలలో వారు క్రమంగా తమ రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోతుంటే, కేరళలో మాత్రం ముస్లింల గొంతుక బలంగానే ఉంది. ఆ రాష్ట్రంలో ముస్లిం యువతను తీవ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారన్న వార్తలు వెలువడ్డాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో హదియా, షఫీ జహాన్‌ల వివాహం జరిగింది. 24 ఏళ్ల హదియా హిందువుగా జన్మించినా, జనవరి, 2016లో ఇస్లాంలోకి మారి, తన పేరును అఖిల నుంచి హదియాగా మార్చుకున్నారు. నాటి నుంచి హదియా తండ్రి ఆమె మతమార్పిడి, వివాహం ఆమె సొంత నిర్ణయంతో జరగలేదని, ఆమెకు 'బ్రెయిన్ వాష్' చేశారని న్యాయ పోరాటం చేస్తున్నారు.

తండ్రి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో కేరళ హైకోర్టు ముందు హాజరైన హదియా, తాను ఎవరి ప్రోద్భలం లేకుండానే మతాన్ని మార్చుకుని, పెళ్లి చేసుకున్నట్లు వివరించారు.

అయినా 2017 మే నెలలో కోర్టు ఆమె పెళ్లి చెల్లుబాటు కాదని దాన్ని రద్దు చేసింది. హదియా 'బలహీనురాలు, దుర్బలురాలు' అని పేర్కొంటూ ప్రాథమిక హక్కులైన ఆమె స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను పట్టించుకోకుండా హదియాను తల్లిదండ్రుల కస్టడీకి ఆదేశించింది.

కేరళ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హదియా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడంతో వ్యక్తిగత జీవితాలలో కోర్టుల జోక్యం, వాటి అధికారంపై చర్చ మొదలైంది.

అయితే హదియా తన ఇష్టపూర్వకంగా చేసుకున్న పెళ్లిని రద్దు చేసిన ప్రాథమిక సమస్యపై కాకుండా సుప్రీంకోర్టు, ఈ సంఘటనపై ఎన్‌ఐఏ (జాతీయ పరిశోధనా సంస్థ) విచారణకు ఆదేశించి మరో వివాదానికి తెర తీసింది. కొన్ని అతివాద బృందాలు హిందూ యువతులను ప్రభావితం చేసి మతమార్పిడి చేస్తున్నాయన్న హైకోర్టు వ్యాఖ్యలతో సుప్రీంకోర్టు ప్రభావితం అయినట్లు కనిపిస్తోంది.

హదియాతో మాట్లాడాలని ఆమె లాయర్లు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆమె తన తండ్రి ఇంటిలోనే బందీగా మారారు.

చివరికి, 27 నవంబర్, 2017న కేసు విచారణకు వచ్చినపుడు, హదియాను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆమె తన వాదనను వినిపించే హక్కుకు అంగీకరించే ముందు రెండు గంటల సమయం తీసుకుంది.

తన తండ్రి బదులుగా, భర్త షఫీ జహాన్‌ను తన చట్టబద్ధమైన సంరక్షకుడిగా నియమించాలన్న హదియా అమాయకమైన విజ్ఞప్తిపై జస్టిస్ చంద్రచూడ్, ''ఏ భర్త కూడా తన భార్యకు సంరక్షకుడు కాలేడు'' అన్న వ్యంగ్య వ్యాఖ్య చేశారు.

అనంతరం షఫీ జహాన్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవేత్త కపిల్ సిబల్‌తో, భార్య ఒకరి సంపద కాదనీ, వ్యక్తిగా ఆమెకు సమాజంలో ఒక హోదా ఉంటుందనీ వివరించమని ఆదేశించారు.

ఫొటో క్యాప్షన్,

హదియా

అయితే ఆ రోజు కోర్టులో జరిగిన పరిణామం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక మహిళకు తన తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకునే స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేవని అభిప్రాయపడుతున్నట్లు సూచిస్తోంది.

ఆ దంపతుల తరపున వాదించిన లాయర్లు హదియా గృహనిర్బంధం ముగిసి, ఆమెకు స్వేచ్ఛ లభించిందని హర్షాతిరేకం వ్యక్తం చేశారు. కానీ ఒక మహిళ ఎవరి సొత్తూ కాదన్న ఒక సాధారణ లాజిక్ మన కోర్టుల దృష్టి నుంచి తప్పించుకున్నట్లుంది.

ఇది కచ్చితంగా లైంగిక వివక్షే అని అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. అయితే, తనదైన సొంత పితృస్వామ్య భావజాలంలో కూరుకుపోయిన అత్యున్నత న్యాయస్థానం.. ఒక మహిళ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్ర్యాలను పరిరక్షించడంతో తాను విఫలమైందని గుర్తించలేకపోయింది.

ఆమె జీవితం మీద, ఆమె కోరికల మీద తృణీకారమైన వ్యాఖ్యలు చేసిన కోర్టు, తన వాదనను వినిపించడానికి కేరళ నుంచి దేశ రాజధానికి వచ్చిన హదియా వాదనను వినడానికి చాలా సేపు మల్లగుల్లాలు పడింది.

వివాహానికి సంబంధించిన విషయాలలో లైంగిక వివక్షను, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ నిరాకరణను గుర్తించడంలో అత్యున్నత న్యాయస్థానం విఫలం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అయితే 'బలహీనురాలు, దుర్బలురాలు' అయిన హదియా ఆ రోజు కోర్టులో చాలా ధైర్యంగా తన కుటుంబం, న్యాయవ్యవస్థ, మీడియా ఒత్తిళ్లకు తట్టుకుంటూ, స్పష్టమైన గొంతుకతో తనకు స్వాతంత్ర్యం కావాలని, తనకు భర్తపై నమ్మకం ఉందని, తన చదువును పూర్తి చేయాలనుకుంటున్నానని ధైర్యంగా చెప్పారు.

కొన్ని నెలల ముందు, ట్రిపుల్ తలాక్ వివాదంలో మీడియా - ముస్లిం మహిళలకు ఎలాంటి హక్కులూ లేవని, వారి తరపున పోరాడే వారెవరూ లేరని, ఆమె ఇస్లాం పితృస్వామ్య వ్యవస్థలో బలిపశువుగా మారుతోందని గావుకేకలు పెట్టింది.

అయితే హదియా కేసును చూస్తే - నిజానికి హిందూ మహిళల తరపున పోరాడే వారే ఎవరూ లేరని, వాళ్లను సులభంగా 'బ్రెయిన్ వాష్' చేయవచ్చని తెలుస్తోంది.

హిందూ యువతులు, ముస్లిం యువకుల మధ్య జరిగే పెళ్లిళ్లను 'లవ్ జిహాద్' అని పేర్కొంటూ, హిందూ మహిళలు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోలేరన్న అభిప్రాయాన్ని రేకెత్తించే ప్రయత్నం జరుగుతోంది.

అంతే కాకుండా, ఏది మంచో నిర్ణయించుకునే శక్తి వారికి లేనందున, ఆమె తరపున నిర్ణయం తీసుకునేవాడు తండ్రి కాబట్టి, అతని అంగీకారం లేకుండా ఆమె పెళ్లి చెల్లుబాటు కాదు.

చాలా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆరెస్సెస్, ఇతర హిందూ మితవాద బృందాలు 'లవ్ జిహాద్' అన్న అసత్య ప్రచారాన్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకున్నాయి. అయితే ప్రస్తుత వివాదంలో కోర్టులు కూడా ఆ పదజాలానికి ఆమోదముద్ర వేయడం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం కోసం ఈ కథనాలు చూడొచ్చు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)