హార్దిక్ పటేల్: ‘పటేళ్లలో సింహం’

  • 9 డిసెంబర్ 2017
నరేంద్రమోదీ, రాహుల్ గాంధఈ Image copyright Getty Images

గుజరాత్‌లో ఓ చిన్న పట్టణంలో దుమ్ముపట్టిన ఓ క్రాస్ రోడ్ వద్ద కొంత మంది ప్రధాని నరేంద్ర మోదీకి నిద్ర లేకుండా చేస్తున్నారని భావిస్తున్న ఓ వ్యక్తి కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు.

హార్దిక్ పటేల్ చాలా సీరియస్‌గా కనిపిస్తారు. మనిషి కొంచెం వంగి ఉంటారు. కామర్స్ గ్యాడ్యుయేట్, ఓ వ్యాపారి కుమారుడైన హార్దిక్ పూర్తిగా మధ్యతరగతి వ్యక్తి.

24 ఏళ్ల వయసులో ఉన్న హార్దిక్‌కు నియమాల ప్రకారం ఎన్నికల్లో నిలబడ్డానికి కూడా అర్హత లేదు.

అయితే ఒక పరిశీలకుని మాటల్లో చెప్పాలంటే ఆయన మోదీకి కంటిలో నలుసులా మారారు.

ఎన్నికలు జరుగుతున్న ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కులపరమైన నిరననలకు ఆయన ముఖచిత్రం. పటేల్ లేదా పాటిదార్‌లకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కావాలని జరుగుతున్న ఉద్యమానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

Image copyright Getty Images

రిజర్వేషన్ కోసం పోరాటం

గుజరాత్‌ జనాభాలో సుమారు 14 శాతం మంది పటేళ్లు. సామాజిక ఆధిపత్యం కలిగిన పటేళ్లు వ్యవసాయ వర్గానికి చెందినవారు. రెండు దశాబ్దాలకు పైగా వారు మోదీ బీజేపీకి ఓటు వేస్తూ వస్తున్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. శ్రమతో కూడుకున్న వ్యవసాయం లాభంలేని వృత్తిగా మారింది. ఇతర జీవనోపాధులతో పోలిస్తే వ్యవసాయం చేసే వారికి లభించే గౌరవమూ తక్కువే.

అనేక రాష్ట్రాలలో భూమిపై యాజమాన్యం కలిగిన కులాల వారు - ఉదాహరణకు హర్యానాలో జాట్‌లు, మహారాష్ట్రలో మరాఠాలు.. విద్యావకాశాలు, ఉద్యోగాలు పొందలేకపోతున్నామని ఆగ్రహంతో ఉన్నారు.

ప్రభుత్వ వృత్తి కళాశాలల్లో నాణ్యమైనవి చాలా తక్కువగా ఉన్నాయి. మరోవైపు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ కాలేజీలలో చదువుకోవడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం తగ్గడంతో ఈ వ్యవసాయ కులాల వారు నగరాలకు వలస వెళుతున్నారు. దాంతో ఉన్న ఉద్యోగాల కోసం అక్కడ పోటీ పెరిగింది.

గుజరాత్‌లో.. చవకైన చైనా ఉత్పత్తులతో పోటీని తట్టుకోలేక పటేళ్లకు చెందిన సుమారు 48,000 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో భవిష్యత్తు గురించి ఆందోళనతో పటేళ్లు రిజర్వేషన్లు కోరుతున్నారు.

''పటేళ్లు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని భావిస్తున్నారు'' అని లాయర్ ఆనంద్ యాగ్నిక్ అన్నారు. అందుకే వారు కోటాను బలపరుస్తున్నారని వెల్లడించారు.

Image copyright Getty Images

పటేళ్లలో సింహం

2012లో గుజరాత్‌లో 182 సీట్లలో మోదీ నేతృత్వంలోని బీజేపీ 115 సీట్లు గెల్చుకుంది. రెండేళ్ల తర్వాత మోదీ భారీ మెజారిటీతో ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. నాటి నుంచి రాష్ట్రంలో ఆయనకు తగిన నాయకుడు లేని లోటు కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ అక్కడ అజేయ శక్తేమీ కాదు.

పటేళ్ల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా గుజరాత్‌లో బీజేపీకి వరుసగా ఆరోసారి విజయం దక్కేది సందేహమే. హఠాత్తుగా మోదీ పార్టీ వెనుకడుగు వేస్తోంది.

తమ జనాభా ఎక్కువగా ఉన్న సుమారు 70 సీట్లలో పటేళ్లు ఫలితాలను ప్రభావితం చేయగలరు. అయితే పటేళ్లను మచ్చిక చేసుకునే బీజేపీ ప్రయత్నాలు ఫలించేట్లు కనిపించడం లేదు.

రెండేళ్ల క్రితం పటేల్ నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించారు. హార్దిక్ పటేల్‌పై రాజద్రోహం కేసు పెట్టి 9 నెలల జైలుశిక్ష విధించారు. ఆ తర్వాత బెయిల్ కండిషన్ల మేరకు ఆయన ఆరు నెలల పాటు రాష్ట్రం బయటే ఉండాలని ఆదేశించారు.

జైలు శిక్ష, బహిష్కారం హార్దిక్‌ను పటేళ్ల దృష్టిలో హీరోను చేసాయి. చిన్న పట్టణమైన తలాలాలో అతని మద్దతుదారులు అతనికి గిర్ అడవుల్లో ఉన్న సింహాల చిత్రాలను బహుకరిస్తుంటారు. ''ఆయన మా పటేళ్లలో సింహంలాంటి వాడు'' అని అతని మద్దతుదారుల్లో ఒకరు తెలిపారు.

''2002 తర్వాత బీజేపీ ప్రస్తుతం అతి కష్టమైన ఎన్నికలను ఎదుర్కొంటోంది. హార్దిక్ పటేల్ నుంచి పోటీ చాలా తీవ్రంగా ఉంది. గుజరాత్ ఎన్నికల్లో అత్యంత ప్రభావశీలి ఆయనే'' అని సీనియర్ జర్నలిస్ట్, మోదీ ప్రభుత్వంపై ఒక పుస్తకం రాసిన ఉదయ్ మహుర్కర్ తెలిపారు.

Image copyright Getty Images

బీజేపీపై విమర్శల వర్షం

హార్దిక్ పటేల్ తన సిల్వర్ ఎస్‌యూవీలో 3 గంటలు ఆలస్యంగా క్రాస్ రోడ్స్‌కు వచ్చినా, ఆయన మద్దతుదారులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. వారిలో చాలా మంది మోటర్ బైకులపై వచ్చిన యువకులు. చేతిలో స్మార్ట్ ఫోన్లు, సన్ గ్లాసెస్ పెట్టుకుని, వాళ్ల టీషర్టులపై తమ నాయకుని చిత్రాన్ని ప్రింట్ చేయించుకున్నారు. వారిలో చాలా మంది తక్కువ జీతానికి పని చేస్తుంటే, మరికొంత మందికి అసలు ఉద్యోగాలే లేవు.

మొదటిసారి ఓటు వేస్తున్న 19 ఏళ్ల భావదిబ్ మరాడియా.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక తనకు అసలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత పొందాలంటే అతనికి కోటా కావాలి. 42 ఏళ్ల ప్లాస్టిక్ వర్తకుడు కీర్తి పనారా.. తన కుమార్తె ఒక ఇంజనీరో, డాక్టరో అయి చిన్న పట్టణాలలోని గొడ్డుచాకిరీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక పంచదార పరిశ్రమ ఏళ్ల కిందే మూతపడింది.

తన కారు పైకి పైకి ఎక్కి హార్దిక్ అందరికీ చేయి ఊపారు. ఆ తర్వాత తన మద్దతుదారులను కలిసేందుకు కారులోంచి బయటకు వచ్చారు. మహిళలు అతని నుదుటిపై తిలకం దిద్ది, మిఠాయిలు పంచారు. ఆయనతో సెల్ఫీలు దిగారు. 'హార్దిక్, దూసుకెళ్లు. మేమంతా నీ వెంటే ఉన్నాం' అని యువకులు ముక్తకంఠంతో అరిచారు.

బీజేపీని ఓడించాలని అందిరికీ చెప్పాక, హార్దిక్ కాన్వాయ్ మెల్లగా ఆ ఇరుకైన రోడ్ల మీద ముందుకు సాగిపోయింది.

దగ్గరలో ఉన్న స్కూల్ పబ్లిక్ గ్రౌండ్‌లో హార్దిక్ తన ట్రేడ్ మార్క్ గళ్ల అంగీ, డెనిమ్ ప్యాంట్ ధరించి మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయం, నిరుద్యోగం, పట్టణాలు, గ్రామాల మధ్య ఉన్న అంతరం గురించి ప్రసంగించారు. తనకు మద్దతు తెలపాలని హార్దిక్ కోరినపుడు మొబైల్ ఫోన్లు పట్టుకున్న వేలాది చేతులు పైకి లేచాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జిగ్నేష్ మేవానీ

కమలానికి ఎదురుగాలి

గత నెల కాంగ్రెస్ పార్టీతో హార్దిక్ పటేల్ జత కట్టారు. కాంగ్రెస్ గుజరాత్‌లో చివరిసారిగా 1985లో గెలిచింది. కానీ ఇప్పటివరకు ఆ పార్టీకి ఎన్నడూ 30 శాతానికి తగ్గకుండా ఓట్లు పడుతున్నాయి.

పునరుత్తేజం పొందిన రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎన్నికల్లో పాల్గొనని ఇద్దరు నేతలతో జత కట్టింది. 40 ఏళ్ల అల్పేష్ ఠాకూర్ ఓబీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 36 ఏళ్ల దళిత నేత జిగ్నేష్ మేవానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీళ్లంతా కలిసి బీజేపీని ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

అయితే మోదీ మ్యాజిక్ డిసెంబర్ 18న వెలువడబోయే ఫలితాలలో తమను గెలిపిస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది.

గుజరాత్ చాలా ఎక్కువగా నగరీకరణ చెందిన రాష్ట్రం. పట్టణ మధ్య తరగతి వర్గాల నుంచి బీజేపీకి చాలా ఎక్కువ మద్దతు ఉంది. ఐదేళ్ల క్రితం ఆ పార్టీ పెద్ద నగరాలు, చిన్న పట్టణాలలోని 84 సీట్లలో 71 సీట్లు గెల్చుకుంది.

అయితే ఈసారి 98 గ్రామీణ సీట్లు ఆ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. చాలా మంది గ్రామస్తులు గతేడాది వివాదాస్పద పెద్ద నోట్ల రద్దు మీద చాలా అసంతృప్తితో ఉన్నారు. ''అభివృద్ధి అనేది యువత, రైతులు, గ్రామాల విషయంలో జరగాలి. కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం కాకూడదు'' అని హార్దిక్ పటేల్ నాతో అన్నారు.

Image copyright Getty Images

సర్వేలు ఏం చెబుతున్నాయి?

20 ఏళ్ల పాటు నిర్విరామంగా గుజరాత్‌ను పాలించాక బీజేపీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అభివృద్ధి, హిందూ జాతీయవాదంతో ఆ పార్టీ కులం, ఆత్మగౌరవ రాజకీయాలపై విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

నిధులు, ఓటర్లను చైతన్యవంతులను చేయడంలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. కానీ ఈసారి విజయం అంత సులభమేమీ కాదు. ఒక ముఖ్యమైన ముందస్తు సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అంతరం తగ్గుతున్నట్లు తేలింది.

అయితే నగరవాసుల ఓట్లు మాత్రం ఇప్పటికీ బీజేపీ వైపు మొగ్గే అవకాశం ఉంది.

''ప్రస్తుత పరిస్థితిని బట్టి బీజేపీకి గడ్డు కాలం ఉన్నా, ఆ పార్టీ ఎలాగోలా విజయం సాధించి, గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది'' అని రాష్ట్రంలో మూడుసార్లు ఎన్నికల సర్వేలు నిర్వహించిన సంజయ్ కుమార్ తెలిపారు.

అయితే బీజేపీని ఓడించడానికి తగిన సమయం ఇదే అనేది హార్దిక్ పటేల్ అభిప్రాయం.

''ఈసారి కనుక పరిస్థితి మారకపోతే, గుజరాత్ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా శక్తిహీనులని అర్థం'' అన్నారు హార్ధిక్.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)