ఫిన్‌లాండ్: వందేళ్ల స్వాతంత్ర్యం.. మీరు తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు

  • 9 డిసెంబర్ 2017
ఫిన్‌లాండ్‌లో ఓ కుటుంబం Image copyright AFP

నోకియా 1100 ఫోన్, యాంగ్రీ బర్డ్స్ గేమ్.. ఇవి ఫిన్‌లాండ్ ప్రపంచానికి ఇచ్చిన బహుమతులు.

అత్యుత్తమ విద్యా వ్యవస్థ, తల్లులకు సముచిత స్థానం, లింగ సమానత్వం.. ఇవి తమ పౌరులకు ఫిన్‌లాండ్ ఇచ్చిన కానుకలు.

ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఫిన్‌లాండ్ ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది.

ఇటీవలె ఫిన్‌లాండ్ వందో స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలకూ అనుసరణీయమైన ఆరు అత్యుత్తమ ఫిన్‌లాండ్ విధానాలివి.

Image copyright MILLA KONTKANEN
చిత్రం శీర్షిక ఫిన్‌లాండ్‌లో పుట్టిన దాదాపు ప్రతి శిశువుకూ ఈ బాక్సే తొలి మంచం

ప్రతి బిడ్డకీ ఓ డబ్బా

గతంలో ఫిన్‌లాండ్‌లో పుట్టిన ప్రతి వెయ్యిమంది పసి పిల్లల్లో 65మంది చనిపోయేవారు. గతేడాది ఆ సంఖ్య 2. శిశు మరణాల రేటు తక్కువ ఉన్న దేశాల్లో అదీ ఒకటి. దీనికి కారణం తల్లయిన మహిళలకు అక్కడ లభించే ప్రత్యేక కార్డ్ బోర్డ్ బాక్సులే.

దాదాపు ఎనభై ఏళ్లకు ముందు ఫిన్‌లాండ్‌లో శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా తల్లయిన వాళ్లకు ఓ బేబీ కేర్ కార్డ్ బోర్డ్ బాక్స్‌ని ఇవ్వడం మొదలుపెట్టింది. పసిపిల్లల సంరక్షణకు ఉపయోగపడే వస్తువులతో పాటు స్లీపింగ్ బ్యాగ్స్, బయటి వాతావరణంలో వేసుకోవాల్సిన దుస్తులూ, డైపర్స్, చిన్న పరుపు లాంటి రకరకాల ప్రొడక్ట్స్ అందులో ఉంటాయి.

ఫిన్‌లాండ్‌లో పుట్టిన దాదాపు ప్రతి శిశువుకూ ఆ బాక్సే తొలి మంచం. దాని కారణంగానే అక్కడ శిశు మరణాల సంఖ్య భారీగా తగ్గిందని ఫిన్నిష్ ప్రభుత్వం చెబుతుంది. దాంతో ఇప్పుడు అనేక ఇతర దేశాలూ ఆ విధానాన్ని అనుసరిస్తున్నాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఫిన్‌లాండ్‌లో ఏడాదిపాటు ప్రసూతి సెలవులు లభిస్తాయి

తల్లులకు భరోసా

అమ్మలకు అత్యుత్తమ దేశం ఫిన్‌లాండేనని ‘సేవ్ ది చిల్డ్రన్’ అనే సంస్థ తేల్చింది. వాళ్లకు అందే ప్రత్యేక శిశు సంరక్షణ బాక్స్‌తో పాటు ఇతర కారణాలూ ఫిన్‌లాండ్‌కి ఆ గుర్తింపు రావడానికి సాయపడ్డాయి.

ఫిన్‌లాండ్‌లో ప్రసూతి సెలవులు ఏడాది పాటు లభిస్తాయి. పిల్లలకు మూడేళ్లు నిండే వరకూ తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరికి ఇంటి దగ్గర ఉండి వాళ్లను చూసుకునే వెసులుబాటు ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి వారికి నెలకు దాదాపు రూ.33వేల రూపాయలు సంరక్షణ భ‌ృతి కింద అందుతాయి.

లింగ సమానత్వం విషయంలో ‘గ్లోబల్ జెండర్ గ్యాప్‌’ నివేదిక ప్రకారం ఫిన్‌లాండ్‌ది గతేడాది రెండో స్థానం. ఉద్యోగం చేసే తల్లులకు ఫిన్‌లాండ్ మూడో అత్యుత్తమ దేశమని ‘ది ఎకనమిస్ట్’ మ్యాగజీన్ పేర్కొంది.

ఆ దేశ పార్లమెంటులో 42శాతం మంది మహిళా ప్రతినిధులున్నారు. అక్కడి మరో విశేషమేంటంటే.. తల్లులతో పోలిస్తే తండ్రులే చదువుకునే వయసున్న పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ తేల్చిన విషయమిది.

Image copyright AFP
చిత్రం శీర్షిక అక్కడ ప్రీ స్కూల్ నుంచి పీజీ వరకు చదువంతా ఉచితం

‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ’

టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు.. అందరికీ ఆమోదయోగ్యమైన విద్యా వ్యవస్థ ఫిన్‌లాండ్ సొంతం. ‘ప్రోగ్రామ్ ఫర్ ది ఇంటర్నేషనల్ అసెస్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్’(పిసా) నిర్వహించే పరీక్షల ఫలితాల ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ ఫిన్‌లాండ్‌దే.

సైన్స్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ప్రతిభ చూపించే ఒకే ఒక్క దేశం ఫిన్‌లాండ్ అని అంచనా. సైన్సులో విద్యార్థుల ప్రతిభలో ఆ దేశానిది 5వ స్థానం.

అందరికీ నచ్చే మరో అంశమేంటంటే.. అక్కడ ప్రీ స్కూల్ నుంచి పీజీ వరకు చదువంతా పూర్తిగా ఉచితం.

అవినీతి అత్యల్పం

అవినీతికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసే ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్’ నివేదికల ప్రకారం అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ గత ఐదేళ్లుగా ముందు వరసలోనే ఉంది.

Image copyright AFP

సరస్సుల దేశం

ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు ఫిన్లాండ్. అక్కడ దాదాపు 1.8లక్షల సరస్సులున్నాయి.

సుమారు నలభై వేల దీవులున్నాయి. వీటికి తోడు అక్కడి భూభాగంలో 75శాతం అటవీ ప్రాంతమే. యూరప్‌లో మరే దేశంలోనూ అంత పచ్చదనం లేదు.

Image copyright AFP

లెనిన్ మ్యూజియం

బోల్షెవిక్ విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్‌కు ప్రత్యేకంగా మ్యూజియం ఉన్న దేశంగా కూడా ఫిన్‌లాండ్ ప్రత్యేకత సంతరించుకుంది.

లెనిన్, స్టాలిన్‌లు తొలిసారి 1905లో దక్షిణ ఫిన్‌లాండ్‌లోని తాంపేరె నగరంలోనే కలుసుకున్నారు.

ఈ మ్యూజియాన్ని ముగ్గురు సోవియట్ నాయకులు.. కృశ్చేవ్, బ్రెజ్నేవ్, గోర్బచేవ్‌లు సందర్శించటం కూడా విశేషం.

భారీ సంస్థలెన్నో..

పూర్వ వైభవం కోల్పోయినా, ఇప్పటికీ ఆ దేశానికి చెందిన నోకియా సంస్థ లక్ష మందికి ఉపాధినిస్తోంది. 130 దేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి.

ఎస్సెమ్మెస్ సేవల్ని అందించే తొలి సెల్‌ఫోన్‌ని 1993లో ఆ దేశమే తయారు చేసింది.

ప్రపంచంలో అతి పెద్ద నౌకలు ఫిన్‌లాండ్‌లోనే తయారవుతాయి.

వీడియో గేమ్‌లు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కూడా అక్కడ భారీగా ఉన్నాయి.

కేవలం 50 లక్షల జనాభా ఉన్న ఫిన్‌లాండ్ ఎన్నో అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తూ ఇతర దేశాలకు కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు