గమ్యం: జేఈఈలో విజయం సాధించడం ఎలా?

  • అనిల్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

గమ్యం - జేఈఈ గైడెన్స్

'గమ్యం' - బీబీసీ న్యూస్ తెలుగు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం.

విద్యార్థులు తమ శక్తికి, ఆసక్తికి తగిన కోర్సులను ఎంపిక చేసుకోవడం, దానికి తగ్గట్లుగా సిద్ధం కావడం, ఎంచుకున్నదానిలో విజయం సాధించడం... ఇలా అనేక సమయాల్లో ఎదురయ్యే సందేహాలకు, తలెత్తే ప్రశ్నలకు 'గమ్యం' ద్వారా నిపుణుల సలహాలు అందించనుంది బీబీసీ న్యూస్ తెలుగు.

డిసెంబరు 1న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ప్రకటన విడుదలైంది. ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే ప్రతి విద్యార్థికీ ఇది ఎంతో ముఖ్యమైన పరీక్ష. దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా పేరుపొందిన ఐఐటీలతోపాటు మరి కొన్నింట్లో ప్రవేశం దక్కించుకోవాలంటే జేఈఈలో మంచి స్కోరు సాధించడం కీలకం.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదివారం 'గమ్యం' ద్వారా విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాం. మీ సందేహాలను, ప్రశ్నలను బీబీసీ న్యూస్ తెలుగులో పోస్ట్ చేయండి. వాటిని Careers360.com ఛైర్మన్ 'మహేశ్వర్ పేరి' నివృత్తి చేస్తారు.

ఫొటో క్యాప్షన్,

మహేశ్వర్ పేరి, Careers360.com ఛైర్మన్

తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో తమ భవిష్యత్తును వెతుక్కుంటూ రకరకాల ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు.

ఈ సంవత్సరం డిసెంబరు 1న జేఈఈ నోటిఫికేషన్ విడుదలైంది. అదేరోజు నుంచి దరఖాస్తు చేసుకోవడం కూడా మొదలైంది. జనవరి 1 దరఖాస్తులకు చివరి తేదీ.

ఏప్రిల్ 15, 16 - 2018న మెయిన్స్ జరగనుంది.

దరఖాస్తును కేవలం ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. దీనికి ఆధార్ కార్డు నంబరు తప్పనిసరి.

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందినవారికైతే ఇది అవసరం లేదు. పరీక్ష మాత్రం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లో జరుగుతుంది. కానీ ఎక్కువ మంది ఆఫ్‌లైన్‌లో రాయడానికి ఆసక్తి చూపిస్తారు.

మెయిన్స్‌లో మొత్తం 360 మార్కులుంటాయి. 81 మార్కులొస్తే అడ్వాన్సుడుకు అర్హత సాధించినట్లే. గత సంవత్సరమే కటాఫ్‌ను 100 మార్కుల నుంచి 81కి తగ్గించారు.

ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన మూడు ఐఐటీలతో కలిపి మొత్తం 35 వేల సీట్లుంటాయి. 23 ఐఐటీలలో సుమారు 11,000 సీట్లు, ఎన్ఐటీల్లో మరో 18,000, ఇతర సంస్థల్లో మరికొన్ని సీట్లు ఉంటాయి. ఈసారి సుమారు 12 నుంచి 13 లక్షల మంది మెయిన్స్ పరీక్ష రాస్తారని అంచనా.

జేఈఈ స్కోరు ఎక్కడ అవసరమవుతుంది?

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాల కోసం ఎంసెట్ ఉంది. కానీ ఒడిశా, హరియాణా, ఉత్తరాఖండ్, మేఘాలయ, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇలా ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేదు.

ఆ రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ చదవాలంటే జేఈఈ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు.

ఐఐటీలు కాకుండా మరికొన్ని విద్యాసంస్థల్లో ప్రవేశానికి కూడా జేఈఈ స్కోరే ప్రామాణికం.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరుతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ఐఐఎస్ఈఆర్‌లలో ప్రవేశానికి కూడా జేఈఈ స్కోరే కీలకం.

పరిశోధనా రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఐఐఎస్ఈఐర్‌లు మంచి ఆప్షన్ అవుతాయి.

ఇలా మాత్రం చేయవద్దు

ఓ సంవత్సరం గ్యాప్ తీసుకుని మంచి స్కోరు సాధిస్తామని కొందరు అంటుంటారు. అది చాలా తప్పు ఆలోచన.

సంవత్సరం గ్యాప్ తీసుకున్నవారిలో కేవలం 17 శాతం మంది మాత్రమే తమ స్కోరును పెంచుకోగలిగారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటి నుంచి ఓ నెలన్నర పాటు జేఈఈకి ప్రిపేర్ అవ్వవచ్చు. తర్వాత రెండు నెలలు ఇంటర్ కోసం చదవండి. ఆ పరీక్షలు ముగిసిన వెంటనే మెయిన్స్ కోసం సిద్ధంకండి.

కోచింగ్ తప్పనిసరని కొందరనుకుంటారు. కానీ ఆన్‌లైన్లో చాలా స్టడీ మెటీరియల్ ఉంటుంది. వాటిని ప్రాక్టీస్ చేయండి. పాత ప్రశ్నపత్రాలు చూడండి.

కొంత మంది జేఈఈకే సన్నద్ధమవుతూ ప్లస్ 2ను నిర్లక్ష్యం చేస్తారు.

ఐఐటీల్లో సీటు రావాలంటే ప్లస్ 2లో కనీసం 75 శాతం మార్కులు రావాలి. ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన అంశం.

ఇంటర్ లేదా ప్లస్ 2లో ప్రాథమిక అంశాలపై లోతైన అవగాహన ఉన్నవారికి, సరైన ప్రణాళిక ప్రకారం సిద్ధమైనవారికి ఇంటర్‌తో పాటు జేఈఈ మెయిన్స్‌కు ప్రిపేర్ కావడం పెద్ద కష్టమైన పని కాదు.

గత సంవత్సరం 96 వేల మంది జేఈఈ మెయిన్స్ రాయగా, వారిలో కేవలం 25 వేల మంది అడ్వాన్సుడుకు అర్హత పొందారు.

వీరిలో కేవలం ఏడు వేల మందికి మాత్రమే ర్యాంకులు వచ్చాయి. సరైన రీతిలో ప్రణాళికాబద్ధంగా కష్టపడితే మీరూ ఈ సంవత్సరం ర్యాంకు సాధించవచ్చు. గుడ్ లక్.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)