ప్రెస్ రివ్యూ: ఇటలీలో కోహ్లి, అనుష్క శర్మల పెళ్లికి ఏర్పాట్లు!

  • 10 డిసెంబర్ 2017
Image copyright STR/AFP/Getty Images

టీమ్ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల పెళ్లిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించడం లేదు గానీ ఏర్పాట్లు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి!

ఈ నెల 12న ఇటలీలోని మిలాన్‌‌లో ఉన్న విలాసవంతమైన బంగ్లా టస్కానీలో వీరి వివాహం జరగనుందని సమాచారం. ఇప్పటికే ఇరువురి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మిలాన్ చేరుకున్నట్టు తెలుస్తోందంటూ ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.

కొద్దిమందికి మాత్రమే ఆహ్వానాలు పంపినట్లు.. అతిథుల జాబితాలో సచిన్‌ తెందుల్కర్‌, యువరాజ్‌ సింగ్‌‌తో పాటు, బాలీవుడ్‌ ప్రముఖులు షారుఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, దీపికా పదుకొణె, ఆదిత్యచోప్రాలు ఉన్నారని సమాచారం.

ఈ నెలాఖరులో విరుష్క జోడీ ముంబయిలో రిసెప్షన్ ఇవ్వనుందట.

Image copyright Gettyimages

ఆన్‌లైన్‌లో పందెం కోళ్ల జోరు

సంక్రాంతికి నెల రోజుల ముందుగానే పందెకోళ్ల సందడి మొదలైంది. ఒకప్పుడు పల్లెలకే పరిమితమైన పుంజుల విక్రయం, ఇప్పుడు ఆన్‌లైన్‌ స్థాయికి ఎదిగింది.

పలు వెబ్‌సైట్లలో జాతి కోడిపుంజుల పేరుతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది.

ఓఎల్‌ఎక్స్, క్వికర్, జెడ్‌ఎజెడ్‌స్పాట్ డాట్ కామ్, పిఒఎస్ఒటిడాట్‌క్లాస్ తదితర వెబ్‌సైట్లలో కోడి పుంజుల అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కో పుంజు ధర కనీసం రూ.3,500 నుంచి రూ.50 వేల వరకూ ఉన్నట్టు పేర్కొంది.

Image copyright NOAH SEELAM

లలితా జ్యువెలరీలో చోరీ.. యాడ్‌లో చెప్పినట్టే చేశారు!

''మీకు నచ్చిన నగకు ఎస్టిమేట్‌ స్లిప్‌ తీసుకోండి.. ఆ నగను మొబైల్‌లో ఫొటో కూడా తీసుకోండి. రెండిటినీ పెట్టుకుని నాలుగైదు షోరూముల్లో కంపేర్‌ చేయండి. ఎక్కడ ధర తక్కువగా ఉంటే అక్కడే కొనండి.. డబ్బులు ఈజీగా రావు. ఇంతవరకూ ఎక్కువ డబ్బులిచ్చింది చాలు..'' అంటూ యాడ్‌లో లలిత జ్యువెలరీ అధినేత ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను ఇద్దరు మహిళలు 'బాగా' వాడేసుకున్నారు!

20 తులాల బరువున్న రూ.6 లక్షల విలువైన ఆభరణాలను చోరీ చేశారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

యాడ్‌లో చెప్పినట్టుగానే ఈ నెల ఒక మహిళ నగను ఫొటో తీసుకుంటూ తస్కరించారు. అదే సమయంలో మరో మహిళ తన వద్ద ఉన్న అచ్చం అలాంటిదే నకిలీ నగను దాని స్థానంలో పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వ్యవహారం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Image copyright Wikipedia

నాగార్జున సాగర్‌కు 63 ఏళ్లు

మానవ నిర్మిత మహా కట్టడం.. ఆధునిక దేవాలయంగా కీర్తించబడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి నేటికి 62 వసంతాలు పూర్తయ్యాయి.

1955 డిసెంబర్ 10న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతులమీదుగా ప్రారంభమైన జలాశయం పనులు 1969లో పూర్తయ్యాయి.

పూర్తిగా దేశీయ ఇంజినీర్ల పరిజ్ఞానంతో నిర్మించారు. రోజూ దాదాపు 500 మంది ఇంజినీర్లు, 500 మంది వర్కుచార్టు ఉద్యోగులు, 40 వేల మంది కూలీలు పని చేసేవారంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)