విమానంలో 'దంగల్' ఫేమ్ జైరా వసీంకు వేధింపులు

జైరా వసీం

దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి జైరా వసీం.. దిల్లీ నుంచి ముంబై వెళుతున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో తనను ఓ వ్యక్తి వేధించాడంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

17 ఏళ్ల జైరా.. విమానంలో తన వెనక కూర్చున్న వ్యక్తి వల్ల ఏవిధంగా ఇబ్బంది పడ్డారో వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

తన వెనక సీట్లో కూర్చున్న ఓ మధ్యవయస్కుడు తనతో ఎలా అసభ్యంగా ప్రవర్తించాడో, ఆ పరిస్థితిని ఎదుర్కోలేక తను ఎంతగా ఇబ్బంది పడ్డారో ఆమె ఈ వీడియోలో వివరించారు.

"నేను నిద్రలో ఉండగా నా వెనక ఉన్న వ్యక్తి నా వీపు మీద, వెనక భాగంలో తన కాలితో తాకడం ప్రారంభించాడు. విమాన సిబ్బంది ఎవ్వరూ నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు" అని ఆమె తెలిపారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 1

పోస్ట్ of Twitter ముగిసింది, 1

జైరా వీడియో వైరల్ కావటంతో ఈ అంశంపై విస్తారా ఎయిర్‌లైన్స్ స్పందించింది.

"జైరాతో ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడనే విషయం మాకు ఇప్పుడే తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్నాం. ఈ విషయంలో జైరాకు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఇలాంటి వాటిని మేం ఏమాత్రం సహించం" అని విస్తారా ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది.

"ఇప్పుడే విమానం దిగాను. నాకు ఎదురైన ఈ ఇబ్బంది గురించి మీ అందరికీ చెప్పాలనుకున్నా. అసలు ఎవరైనా ఇలా ఎలా చేయగలుగుతారు? అమ్మాయిల్ని చూడాల్సింది ఇలాగేనా? మనం (మహిళలు) మనకు సహాయం చేసుకునేందుకు ముందుకురానంతకాలం మనకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రారు" అని జైరా వ్యాఖ్యానించారు.

స్థానిక జర్నలిస్టు సుప్రియ సోగలె ఈ విషయాన్ని మహారాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. జైరా విషయంలో జరిగిన దానికి అందరూ సిగ్గుపడాలని, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ను మహిళా కమిషన్ కోరింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)