ఓషో వల్లనే రాజీవ్ రాజకీయాల్లోకి వచ్చారా?

  • 11 డిసెంబర్ 2017
రాజీవ్, ఓషో Image copyright AFP

భారత ఆరో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి, ఆధ్యాత్మిక గురువు ఓషోకు సంబంధం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? తాజాగా విడుదలైన ఓ పుస్తకంలో వారిద్దరి మధ్య సంబంధం గురించి రాశారు.

కవి, కళాకారుడు రషీద్ మ్యాక్స్‌వెల్ రాసిన 'ద ఓన్లీ లైఫ్: లక్ష్మి అండ్ ద వరల్డ్ ఇన్ క్రైసిస్' అనే పుస్తకంలో ఇందిరా గాంధీపై ఓషో ప్రభావం ఉందనీ, తన కుమారుడు రాజీవ్‌ను రాజకీయాల్లోకి తేవడం కోసం ఆమె ఓషో కార్యదర్శి లక్ష్మి సహాయం తీసుకున్నారనీ పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

నిజానికి రాజకీయాల్లోకి రావడానికి ముందు రాజీవ్ ప్రొఫెషనల్ పైలట్‌గా పని చేసేవారు. రాజకీయాలంటే ఆయనకు ఎలాంటి ఆసక్తీ లేదు.

అయితే సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత ఇందిరా గాంధీ తన మరో కుమారుడు రాజీవ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని బాగా కోరుకున్నారు.

Image copyright FACEBOOK @OSHOINDIA11

ఓషో కార్యదర్శి రాజీవ్‌ను ఒప్పించారు

ఇందిరా గాంధీ తన తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ లాగానే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. ఆమె ఓషో సూక్తులతో బాగా ప్రభావితులయ్యారు. అయితే ఆ సమయంలో ఓషో ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఇందిర ఎప్పుడూ ఆయన ఆశ్రమానికి వెళ్లి నేరుగా ఆయన్ని కలవలేదు.

'ద ఓన్లీ లైఫ్: లక్ష్మి అండ్ ద వరల్డ్ ఇన్ క్రైసిస్'లో రాసిన ప్రకారం, 1977లో ఇందిరా గాంధీ అధికారం నుంచి దిగిపోయాక ఓషో కార్యదర్శి లక్ష్మికి తన కార్యాలయానికి లేదా ఇంటికి ఎప్పుడంటే అప్పుడు రాగలిగేలా గ్రీన్ పాస్ ఇచ్చారు.

Image copyright Keystone/Getty Images

ఇందిర తిరిగి అధికారం చేపట్టాక 1980లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మృతి చెందారు.

ఆ సమయంలో ఇందిరా గాంధీ నివాసానికి లక్ష్మి వెళ్లగా, రాజీవ్ గాంధీ తన పైలట్ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేలా నచ్చజెప్పాలని ఇందిర ఆమెను అభ్యర్థించారని రషీద్ మ్యాక్స్‌వెల్ తన పుస్తకంలో రాశారు.

Image copyright OSHO.COM

లక్ష్మి: ఓషోకు తొలి కార్యదర్శి

"ఆ తర్వాత లక్ష్మి రాజీవ్ గదిలోకి వెళ్లి చాలాసేపు ఆయనతో మాట్లాడారు. 20వ శతాబ్దంలో దేశ ప్రగతిలో ఆయన ఎలా దోహదపడగలరో ఆమె వివరించారు. అప్పటి వరకు అయిష్టంగా ఉన్న రాజీవ్ ఆ తర్వాతే రాజకీయాల్లో అడుగుపెట్టడానికి నిర్ణయించుకున్నారు" అని రషీద్ మ్యాక్స్‌వెల్ తన పుస్తకంలో రాశారు.

ఇందిరా గాంధీ హత్య తర్వాత 1984లో రాజీవ్ భారత ఆరో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

'ద ఓన్లీ లైఫ్: లక్ష్మి అండ్ ద వరల్డ్ ఇన్ క్రైసిస్' పుస్తకం ఓషో కార్యదర్శి లక్ష్మి జీవిత చరిత్ర. బ్రిటిష్ ఇండియాలో పుట్టిపెరిగిన లక్ష్మి ఓషోకు తొలి కార్యదర్శిగా పని చేశారు.

మార్మిక సిద్ధాంతి అయిన ఓషో మార్గదర్శకత్వంలో లక్ష్మి అనేక మందికి ఆధ్యాత్మిక బోధ చేశారు. లక్ష్మి జీవితంలో ఎదుర్కొన్న అనేక ఎగుడుదిగుళ్లను కూడా ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

(నేడు ఓషో జన్మదినం.)

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)