మణిశంకర్ ఇంట్లో జరిగిన 'రహస్య' సమావేశంలో ఏం చర్చించారు?

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్‌లో ఆదివారం జరిగిన ఓ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు, పాకిస్తాన్ పూర్వ అధికారులు తనకు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యారన్నది ఆ ఆరోపణల సారాంశం.

ఇటీవల కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన మణిశంకర్ అయ్యర్ నివాసంలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో పాకిస్తాన్ హైకమిషనర్, పాక్ మాజీ విదేశాంగ మంత్రి, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హామిద్ అన్సారీలు పాల్గొన్నారని మోదీ అన్నారు.

గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా పాలన్‌పూర్‌లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్‌తో కుమ్మక్కై గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.

కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ గుజరాత్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు పాకిస్తాన్‌కు చెందిన ఓ మాజీ అధికారి వ్యాఖ్యానించారని కూడా మోదీ అన్నారు.

బీబీసీ ప్రతినిధి కుల్‌దీప్ మిశ్రా ఈ అంశంపై సీనియర్ పాత్రికేయుడు ప్రేమ్‌శంకర్ ఝాతో మాట్లాడారు. మణిశంకర్ అయ్యర్ నివాసంలో జరిగిన ఆ సమావేశంలో తాను కూడా పాల్గొన్నట్టు ప్రేమ్‌శంకర్ వెల్లడించారు. అయితే అందులో గుజరాత్, అహ్మద్ పటేల్‌ల ప్రస్తావనే రాలేదని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్మూద్ కసూరీ

ఈ సమావేశం ఎప్పుడు జరిగింది? ఎవరు ఏర్పాటు చేశారు?

ఈ సమావేశం డిసెంబర్ 6న జరిగినట్టు ప్రేమ్‌శంకర్ తెలిపారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఆ భేటీలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్మూద్ కసూరీ కూడా ఉన్నారని వెల్లడించారు.

"అదొక ప్రైవేటు సమావేశం. కసూరీ, మణిశంకర్‌లిద్దరూ చాలా పాత స్నేహితులు. భారత్-పాక్ సంబంధాలను ఎలా మెరుగుపరచాలి? అనే అంశంపై అక్కడ చర్చ జరిగింది" అని ప్రేమ్‌శంకర్ ఝా తెలిపారు.

"కసూరీ కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఆయన వచ్చాకే మేం భోజనం చేశాం. భోజనానికి ముందు దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్నాం. భోజనాలు చేస్తూ కూడా మాట్లాడుకున్నాం" అని ఆయన చెప్పారు.

ఏయే అంశాలపై మాట్లాడుకున్నారు?

కాంగ్రెస్ నేతలకూ, పాక్ అధికారులకూ మధ్య జరిగిన సంభాషణలపై ప్రధాని మోదీ అనేక ప్రశ్నలు లేవనెత్తారు.

దీనిపై ప్రేమ్‌శంకర్ ఝా మాట్లాడుతూ, "భారత్- పాకిస్తాన్‌ల సంబంధాలపై మాట్లాడుకున్నాం. అట్లాగే కశ్మీర్ అంశంపై కూడా సంభాషణలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలకు కశ్మీర్ సమస్యే అతి పెద్ద అవరోధంగా ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఇంకా ఏయే మార్గాలున్నాయనే విషయంపై సంభాషణలు జరిగాయి" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్ గురించి ఏం మాట్లాడుకున్నారు?

ఈ సమావేశంలో గుజరాత్ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చ చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు. అహ్మద్ పటేల్‌ను గుజరాత్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్టు పాకిస్తాన్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్ సర్దార్ అర్షద్ రఫీక్ అన్నారని మోదీ వ్యాఖ్యానించారు.

అయితే దీనిపై ప్రేమ్‌శంకర్ ఝా మాట్లాడుతూ, అసలక్కడ గుజరాత్ విషయంపై సంభాషణే జరగలేదని అన్నారు.

"ఈ సమావేశంలో గుజరాత్ ఎన్నికలు ప్రస్తావనకు రాలేదు. గుజరాత్ అన్న మాటే ఎవరూ మాట్లాడలేదు" అని ఝా స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అహ్మద్ పటేల్ పేరును కూడా ఎవరూ ఎత్తలేదని ఝా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కాంగ్రెస్ పార్టీ నేత అహ్మద్ పటేల్

సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు?

"ఈ సమావేశంలో మాజీ ఉపరాష్ట్రపతి హామిద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు. నేను కశ్మీర్ సమస్యపై రాస్తుంటాను, అట్లాగే మణిశంకర్ అయ్యర్‌కు స్నేహితుడిని కాబట్టి నన్ను కూడా రమ్మని పిలిచారు. మేం కలవగానే దేశద్రోహులమైపోయామా? సమావేశం కావడమే దేశ ద్రోహమవుతుందా?" అని ప్రేమ్‌శంకర్ ప్రశ్నించారు.

సీనియర్ పాత్రికేయుడైన ప్రేమ్‌శంకర్ ఝా, కశ్మీర్ సమస్యపై పుస్తకాలు రాశారు. తాను గత 29 ఏళ్లుగా కశ్మీర్ గురించి రాస్తున్నట్టు ఆయన తెలిపారు.

అంతేకాదు, మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్‌కు ఆయన సమాచార సలహాదారుగా కూడా పని చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

భారత మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ప్రధాని మోదీకి ఈ సమావేశం గురించి ఎలా తెలిసింది?

ఈ సమావేశం గురించి విదేశాంగ మంత్రిత్వశాఖకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. దీనిపై ప్రేమ్‌శంకర్ మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలకు అనుమతి అవసరం లేదన్నారు.

"కసూరీ, మణిశంకర్ అయ్యర్ ఇద్దరూ కాలేజీ రోజుల నుంచీ స్నేహితులు. వీరిద్దరూ ఏ అధికారిక పదవుల్లోనూ లేరు. మేం సాధారణ పౌరులం కాబట్టి ఎవరితో ఎవరమైనా కలవడం మా హక్కు. ఎవరినైనా కలవటమూ నేరం ఎలా అవుతుంది?" అని ప్రేమ్‌శంకర్ అన్నారు.

ఈ సమావేశం గురించి మోదీకి ఎలా తెలిసి ఉండొచ్చని అనుకుంటున్నారు? అని ప్రేమ్‌శంకర్ ఝాను అడిగినప్పుడు ఇలా చెప్పారు.. "ఇందులో రహస్యమేముంది? నేను బయట కారును ఆపినప్పుడు అక్కడ పదుల సంఖ్యలో జనం ఉన్నారు. నాకు కనీసం ఆరేడు ఈ-మెయిల్స్ వచ్చాయి. రెండు, మూడు సార్లు మేం ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం. వీళ్లు మణిశంకర్‌తో జరిగే ప్రతి సంభాషణనూ వింటారు"

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మణిశంకర్ అయ్యర్

పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి కసూరీ అక్కడికి రావడం గురించి మాట్లాడుతూ ప్రేమ్‌శంకర్, "కసూరీ తరచుగా భారత్ వస్తుంటారు. రెండేళ్ల క్రితం జరిగిన కసౌలీ సాహిత్యోత్సవంలో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అప్పుడూ ఆయనిక్కడికి వచ్చారు. భారత ప్రభుత్వం ఆయనకు వీసా ఇస్తుంది. ఆయన మమ్మల్ని కలవగూడదని భావిస్తే ఆయనకు వీసా ఎందుకు ఇస్తున్నట్టు?" అని అన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)