రజినీకాంత్: ఇలా అయ్యారు సూపర్ స్టార్

  • శరత్ బెహరా
  • బీబీసీ ప్రతినిధి
రజనీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

వయసుతో పాటు అభిమానుల సంఖ్యనూ, సినిమా సినిమాకీ స్టార్‌డమ్‌నీ పెంచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రజినీకాంత్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంలోని అరుదైన కోణాల సమాహారం.

‘పాత లుంగీ ముడతల చొక్కా’

రజినీకాంత్‌కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఓసారి బెంగళూరులో ఓ దేవాలయానికి వెళ్లాలనుకున్నప్పుడు, జనాలు ఎక్కువగా ఉంటారనీ, వెళ్లడం మంచిది కాదనీ సన్నిహితులు వారించారు.

కానీ వాళ్ల మాట వినకుండా ఓ పాత లుంగీ కట్టుకొని, ముడతల పడ్డ చొక్కా వేసుకొని ఓ పేద వృద్ధుడిలా ఆ గుడిలో రజనీ అడుగుపెట్టారు. ఆయన్ని అలా చూసిన ఓ గుజరాతీ మహిళ, బిచ్చగాడు అనుకొని జాలిపడి రజనీ చేతిలో పది రూపాయల నోటు పెట్టి ముందుకెళ్లారు.

రజినీ కూడా వద్దనకుండా ఆ డబ్బులను జేబులో పెట్టుకున్నారు. కాసేపటి తరవాత రజనీ హుండీలో వంద రూపాయలు వేయడం చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయారు.

ఆపైన రజినీ ఖరీదైన కారెక్కడం చూసి తన తప్పు తెలుసుకున్న మహిళ, దగ్గరికొచ్చి తానిచ్చిన పది రూపాయల్ని తిరిగిచ్చేయమన్నారు. కానీ రజినీ దానికి ఒప్పుకోలేదు.

'ఇలాంటి సందర్భాల్లోనే నేనేంటో నాకు తెలుస్తుంది. నా స్థాయిని గుర్తుచేయడానికి దేవుడే మీతో అలా చేయించారేమో' అంటూ ఆ మహిళకి సర్దిచెప్పారు రజినీ.

ఆయన నిరాడంబరతకు అద్దంపట్టే ఘటన ఇది. 'ద నేమ్ ఈజ్ రజనీకాంత్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు రచయిత్రి గాయత్రీ శ్రీకాంత్.

అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఐశ్వర్యారాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

‘నేను హీరోనంటే ఆయన నమ్మలేదు’

‘నువ్వు హీరోనా’

‘‘ఈ మధ్య కర్ణాటకలో ఉండే మా అన్నయ్య ఇంటికెళ్లా. నన్ను చూడటానికి పక్కింట్లో ఉండే నందులాల్ అనే రాజస్థానీ పెద్దాయన ఒకరు వచ్చారు.

'ఏంటి రజినీ ఇంకా రిటైర్ అవలేదా' అనడిగారు. 'లేదండీ.. ఓ సినిమాలో నటిస్తున్నా, ఐశ్వర్యారాయ్ హీరోయిన్' అని చెప్పా. 'ఓహ్ వెరీగుడ్, ఐశ్వర్య బాగా నటిస్తుంది. ఇంతకీ అందులో హీరో ఎవరు?' అనడిగారు. నాకెలా చెప్పాలో అర్థం కాలేదు. 'నేనే హీరోని' అని చెప్పేసరికి ఆయనకి నోట మాట రాలేదు. కాసేపు నన్ను అలా చూస్తుండిపోయారు.

'ఐశ్వర్య, అమితాబ్, అభిషేక్... వీళ్లందరికీ ఏమైంది' అని గొణుగుతూ ఆయన వెళ్లిపోయారు. నేను హీరోనంటే ఆ పెద్దాయనే నమ్మలేదు. అలాంటి నాతో కలిసి నటించినందుకు థాంక్యూ ఐశ్వర్య'’ అంటూ రోబో ఆడియో వేడుకలో తన నిజాయితీతో అందర్నీ ఆశ్చర్యపరిచారు రజినీ.

రజనీకాంత్ హోర్డింగ్‌కి పాలాభిషేకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అరవింద్ స్వామి మంచంపై పడుకుంటే, రజినీ నేలమీద పడుకున్నారు

స్వామీజీగా సూపర్‌స్టార్

వీరప్పన్ చెరనుంచి కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ విడుదలయ్యాక, ఆయన్ని పరామర్శించడానికి స్వామీజీ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి వెళ్లారు. రాజ్‌కుమార్‌తో మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన అనేక విషయాలను ఆ స్వామీజీ చెప్పడం మొదలుపెట్టారు.

తనకూ, కొందరు సన్నిహితులకూ మాత్రమే తెలిసిన విషయాల్ని ఆ బాబా చెబుతుండటం విని రాజ్‌కుమార్ చాలా ఆశ్చర్యపోయారు. కాసేపటి తరవాత ఆ బాబా తన తలాపాగానీ, గడ్డాన్నీ తొలగించాకే అందరికీ అర్థమైంది.. అలా స్వామీజీ వేషంలో వచ్చింది రజినీకాంత్ అని. రాజ్‌కుమార్‌ను ఆటపట్టించడానికి రజనీ వేసిన ఆ వేషం, ఆయన హాస్య చతురతకి ఓ ఉదాహరణ.

నేలమీద రజనీ..

'దళపతి' సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులవి. నటుడు అరవింద్ స్వామికి అదే తొలి సినిమా. తన షాట్ వచ్చేవరకు పక్కన వేచి ఉండమని దర్శకుడు చెప్పడంతో అరవింద్ ఓ గదిలోకి వెళ్లారు. అక్కడ ఏసీ ఆన్‌లో ఉండటంతో పాటు మంచం కూడా శుభ్రంగా కనిపించడంతో ఆదమరిచి అక్కడే నిద్రపోయారు.

కాసేపయ్యాక అరవింద్‌కి మెలకువ వచ్చి చూసేసరికి రజినీకాంత్ అదే గదిలో నేల మీద పడుకొని కనిపించారు. రజనీని అలా చూసి కంగారు పడుతూ బయటికి వెళ్లిన అరవింద్‌ స్వామి, విషయమేంటని ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ని అడిగారు.

'మీరు పడుకుంది రజినీ సార్ గది. మిమ్మల్ని లేపడానికి మేం వస్తుంటే, రజినీ సార్ వద్దని వారించారు. ఆయనే నేల మీద పడుకున్నారు' అని ఆ అసిస్టెంట్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం అరవింద్ స్వామి వంతైంది. ఈ విషయాన్ని ఇటీవల అరవింద్ స్వామే స్వయంగా ఓ టీవీ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు.

రజనీకాంత్

ఫొటో సోర్స్, Facebook/2.o

ఫొటో క్యాప్షన్,

ఇప్పటికీ స్నేహితుడి జడ్జ్‌మెంట్‌కి రజినీ విలువిస్తారు

చెక్కుచెదరని స్నేహం

'రోబో' సినిమా విడుదలైన తరవాత చెన్నైలో అభిమానులంతా పండగ చేసుకుంటుంటే రజినీకాంత్ మాత్రం ఒంటరిగా బెంగళూరు వెళ్లారు. అక్కడ ఓ రిటైర్డ్ బస్ డ్రైవర్‌తో కలిసి ఆలయాలను సందర్శించడం మొదలుపెట్టారు.

అలా ఓ గుళ్లో ఆ మాజీ డ్రైవర్‌ని కూర్చొబెట్టి తన తరవాతి సినిమా స్టోరీ లైన్ వినిపించి, దానిపైన అభిప్రాయం చెప్పమని రజినీ అడిగారు. దశాబ్దాల సినీ అనుభవం ఉన్న రజినీ ఓ సాధారణ డ్రైవర్‌ను అభిప్రాయం అడగడం ఆశ్చర్యం కలిగించినా, రజనీకి అది బాగా అలవాటైన పనే.

దాదాపు నలభై ఏడేళ్ల క్రితం రజనీకాంత్‌ని సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించిన అతడి స్నేహితుడు రావ్ బహదూరే ఈ రిటైర్డ్ బస్ డ్రైవర్. తనలో మొదట హీరోని చూసింది తన స్నేహితుడు బహదూరే అంటారు రజినీ. అందుకే ఇప్పటికీ స్నేహితుడి మాటకీ, జడ్జ్‌మెంట్‌కీ ఆయన గౌరవమిస్తారు. 'ఫోర్బ్స్'‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రావ్ బహదూర్ ఈ విషయాల్ని ప్రస్తావించారు.

రజనీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

‘కమల్‌కి నా కథలపై అసంతృప్తి ఉండేది’

ఇలా అయ్యారు సూపర్‌స్టార్

'కమల్ హాసన్ ఉన్న రాష్ట్రంలో నేనెలా సూపర్ స్టార్ అయ్యాననే సందేహం చాలామందికి రావొచ్చు. నేను నా దారి మార్చుకోవడం వల్లే ఈ ఇమేజ్ వచ్చింది. గతంలో నేను ఎంచుకునే కథల పట్ల కమల్ అసంతృప్తితో ఉండేవారు. ఆ విషయాన్ని నాతో చాలా సార్లు చర్చించారు. నేను కాస్త భిన్నమైన కథల్ని ఎంచుకోవాలన్నది ఆయన అభిప్రాయం. కానీ కమల్ అప్పటికే భిన్నమైన సినిమాలు చేస్తున్నారు కాబట్టి, ఆయన దారిలో వెళ్లకుండా నేను కమర్షియల్ చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అలా నా దారి మార్చుకున్నా' అని కమల్ యాభై ఏళ్ల సినిమా వేడుకల సందర్భంగా రజినీ అన్నారు.

తాను సూపర్‌స్టార్ కావడానికి పరోక్షంగా మరో సూపర్‌స్టార్ మాటలే కారణమని రజినీకాంత్ చెప్పిన తీరుకు సభికులంతా సంతోషంతో చప్పట్లు చరిచారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)