ప్రెస్ రివ్యూ: ‘అమరావతి’పై రాజమౌళి సినిమా!

  • 12 డిసెంబర్ 2017
దర్శకుడు రాజమౌళి తదితరులతో సీఎం చంద్రబాబు భేటీ Image copyright NARA CHANDRABABU NAIDU/FACEBOOK

సీఎం చంద్రబాబు అమరావతి సినిమాకు తెరతీశారని 'సాక్షి' ఓ కథనం ప్రచురించింది.

రాజధాని భవనాల డిజైన్లపై బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళితో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రచారం కోసం సినిమా తీయడంపై బాబు తాజాగా ఆయనతో చర్చలు ప్రారంభించారు.

హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన సీఆర్‌డీఏ సమావేశంలో డిజైన్ల అంశం కంటే అమరావతి సినిమాపైనే సీఎం చర్చించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశంలో రాజమౌళితో పాటు ఆయన కుమారుడు కార్తికేయ కూడా పాల్గొనడం గమనా ర్హం.

కార్తికేయకు ప్రకటనల సంస్థ ఉందని, దానిద్వారా సినిమా నిర్మించాలని సీఎం భావిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యమంత్రితో రాజమౌళి, ఆయన కుమారుడు సమావేశమైన తరువాత సినీ పరిశ్రమలో రాజధాని అమరావతి సినిమాపై చర్చ సాగుతోంది. సినిమా నిడివి ఎన్ని గంటలు?

ఏ తరహాలో తీయాలనే అంశంపైనా చర్చించినట్లు సినీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా దర్శకత్వ బాధ్యతలను రాజమౌళికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో సీఎం చంద్రబాబుతోపాటు రాష్ట్ర మంత్రి పి.నారాయణ కూడా కనిపిస్తారని తెలుస్తోంది. రాజధానిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండానే అమరావతి సినిమా ఎలా తీస్తారనే సందేహాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి గత చరిత్రతోపాటు వనరుల లభ్యత తదితర వివరాలతో ప్రచారం కోసం సినిమా తీయనున్నారు. ఈ సినిమాను దేశ, విదేశాల్లో ప్రదర్శిస్తారని, ఇందుకోసం రూ. కోట్లు ఖర్చు పెట్టనున్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారని ఆ కథనం తెలిపింది.

Image copyright facebook

దళితుల కిడ్నాప్ కేసులో భరత్‌రెడ్డి అరెస్టు

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో మొరం అక్రమ రవాణాను అడ్డుకున్న ఇద్దరు దళితులను కులంపేరుతో దూషించి, కిడ్నాప్, దాడిచేసిన కేసులో నిందితుడు భరత్‌రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు సోమవారం అరెస్టు చేసినట్టు 'నమస్తే తెలంగాణ' ఒక కథనం ప్రచురించింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను సోమవారం తన కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్త్తికేయ శర్మ మీడియాకు వెల్లడించారు.

అభంగపట్నం గ్రామానికి చెందిన దళితులు రాజేందర్, లక్ష్మణ్‌ను నవీపేట్ మండలానికి చెందిన భరత్‌రెడ్డి కులం పేరుతో దూషించడంతోపాటు భయపెట్టి వారితో ముక్కు నేలకు రాయించాడు.

భయబ్రాంతులకు గురిచేసి మురికిగుంటలో మునకలు వేయించాడు. సెప్టెంబర్ 17న జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు రెండు నెలల తర్వాత నవంబర్ 11న సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి సంచలనమయ్యాయి.

నవంబర్ 12న మానికొల గంగాధర్ ఫిర్యాదు చేయడంతో భరత్‌రెడ్డిపై వివిధ సెక్షన్లతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అనంతరం తమ భర్తలను భరత్‌రెడ్డి కిడ్నాప్ చేశాడని బాధితుల భార్యలు కూడా ఫిర్యాదు చేశారు.

పరారీలో ఉన్న భరత్‌రెడ్డిని పట్టుకునేందుకు డిచ్‌పల్లి సీఐ తిరుపతి, నిజామాబాద్ రూరల్ నార్త్ జోన్ సీఐ బుచ్చయ్య, ఎస్సై రవీందర్‌నాయక్‌తో కూడిన మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

హైదరాబాద్‌లో భరత్‌రెడ్డికి ఉన్న సంబంధాలు, అతని స్నేహితుల కదలికలపై నిఘాపెట్టిన బృందాలు.. మహారాష్ట్రకు కారులో పారిపోతుండగా సోమవారం పట్టుకున్నాయి. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.

నేర చరిత్ర ఉన్న భరత్‌రెడ్డిపై నవీపేట్, నిజామాబాద్ వన్‌టౌన్, నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్లలో రెండు హత్యకేసులతోపాటు మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. భరత్‌రెడ్డికి ఆశ్రయమిచ్చిన, సహకరించిన వారిపై కూడా కేసులు నమోదుకానున్నాయి.

సమావేశంలో నిజామాబాద్ డీసీపీలు ఆకుల రాంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రూరల్ నార్త్ సీఐ బుచ్చయ్య, డిచ్‌పల్లి సీఐ తిరుపతి, నవీపేట్ ఎస్సై జే నరేశ్, సిబ్బంది పాల్గొన్నట్టుగా 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

Image copyright Getty Images

తెలంగాణ: ఈ నెల 30 వరకు టీఆర్టీ దరఖాస్తు గడువు పొడిగింపు

టీచర్‌ రికూట్ర్‌మెంట్‌ టెస్టు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు టీఎస్‌పీఎస్సీ పొడగించనున్నట్టు 'ఆంధ్రజ్యోతి' ఓ వార్తా కథనం ప్రచురించింది.

31 జిల్లాల ప్రకారం టీచర్‌ పోస్టుల భర్తీ చెల్లదని, 10 జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు భర్తీ విధానం, విద్యార్హతలను సవరిస్తూ జీవో నంబరు 25ను సోమవారం రాత్రి విద్యాశాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి సీఎస్‌ రంజీవ్‌ ఆర్‌ ఆచార్య జారీ చేశారు.

31 జిల్లాలకు బదులు 10 జిల్లాలుగా మార్చడంతోపాటు 31 జిల్లాల్లో టీచర్ల అపాయింటింగ్‌ అథారిటీగా డీఈవోకు అధికారం ఇచ్చారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టే నియామకాల్లో పాత 10 జిల్లాల్లో నియమించిన అధికారికే నియామక అధికారం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీని ప్రకారం పాత జిల్లాల్లోని సాంక్షన్డ్‌ డీఈవో పోస్టులో పనిచేస్తున్న డీఈవోకే నియామక బాధ్యతలు అప్పగించనున్నారు.

కాగా.. హైకోర్టు ఆదేశాల ప్రకారం విద్యాశాఖ సవరణ ఉత్తర్వుల జారీలో జాప్యం ఏర్పడడంతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి.. విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో ఫోన్‌లో మాట్లాడారు.

దీంతో కడియం ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవరణ ఉత్తర్వులు జారీ చేశారు.

దీని ఆధారంగా టీఎస్‌పీఎస్సీ మంగళవారం అధికారికంగా నోటీఫికేషన్‌ జారీ చేస్తుందని చైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. 30వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు పొడిగిస్తామని చెప్పారు.

2018 జనవరి 24 నుంచి రాత పరీక్షలు నిర్వహించి.. మార్చి నెలాఖరు నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామని చక్రపాణి వివరించారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్: టెట్‌కు మార్గదర్శకాలు విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు ఉత్తర్వులు విడుదలయ్యాయని 'ఈనాడు' ఓ వార్త ప్రచురించింది.

అర్హతల ప్రాతిపదికన రెండు పేపర్ల ద్వారా కంప్యూటర్‌ ఆధారిత విధానం(ఆన్‌లైన్‌)లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉపాధ్యాయ విద్య చివరి ఏడాది చదువుతున్న వారికీ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, సిలబస్‌తో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

ఒక్కసారి టెట్‌ ఉత్తీర్ణత అయితే ఏడేళ్ల పాటు అర్హత ఉంటుంది. ఎక్కువ మార్కుల కోసం మళ్లీ రాసుకునే వీలుంది. టెట్‌లో వచ్చే మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో 20% ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టెట్‌ షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాస్‌ మంగళవారం విడుదల చేసే అవకాశం ఉంది.

ఇంటర్‌, తత్సమాన ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, నాలుగేళ్ల బీఈఎల్‌ఈడీ, రెండేళ్ల డిప్లామా విద్యలో(ప్రత్యేక విద్య) అర్హత ఉన్న వారు పేపర్‌-1 రాయవచ్చు. డిగ్రీతో పాటు బీఈడీ తత్సమాన అర్హత కలిగి ఉన్నవారు పేపర్‌-2 రాయవచ్చు.

నాలుగేళ్ల డిగ్రీ వారు అర్హులే. బహుళ ఐచ్ఛిక విధానంలో 150 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. సమయం 2.30 గంటలు ఉంటుందని 'ఈనాడు' కథనం వివరించింది.

Image copyright Getty Images

బీటెక్‌లకు విలువుందా?: అఖిల భారత సాంకేతిక విద్యామండలి నివేదిక

దేశ సాంకేతిక విద్యలో నెలకొన్న పరిస్థితులపై ఏఐసీటీఈ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందని 'నవతెలంగాణ' ఓ వార్తా కథనం ప్రచురించింది.

దీనికి గల కారణాల్ని విశ్లేషిస్తూ 2016-17 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇంజనీరింగ్‌ విద్యలో పడిపోతున్న ప్రమాణాలు విద్యార్థులకు శాపంగా మారాయి.

నేడు విద్యార్థులెవ్వరూ సాంకేతిక విద్యవైపుకు రావటం లేదు. 2016-17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా సగానికిపైగా (51 శాతం) సీట్లు భర్తీ కాలేదు. కొన్ని కాలేజీల్లో 70 శాతం సీట్లు భర్తీకాకుండా ఉండిపోయాయి.

గతేడాది దేశ వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థులు బీఈ, బీటెక్‌ చేశారు. అందులో కేవలం 40 శాతం మందికి మాత్రమే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో ఉద్యోగాలు లభించాయి.

అంతేగాక బీఈ, బీటెక్‌ కాలేజీల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు రానురాను తగ్గిపోతున్నాయి. ఏఐసీటీఈ లెక్క ప్రకారం గత ఐదేండ్లుగా జరిగిన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు 50 శాతం కన్నా తక్కువే.

కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవటం, అన్ని వసతులతో కూడిన ల్యాబ్‌, అనుభవజ్ఞులై న ఫ్యాకల్టీ లేకపోవటం, తీవ్రమైన అవినీతి.. మొదలైనవి ఇంజనీరింగ్‌ విద్య ఇలా వెలవెల బోవడానికి దారితీసింది.

కాలేజీల్లో సాంకేతిక విద్యా వాతావరణం లోపించింది. పైకారణాలు మొత్తం దేశ ఇంజనీరింగ్‌ విద్యను దెబ్బతీశాయి. కేవలం మార్కులపట్టాలతో విద్యార్థులు బయటకువస్తున్నారు. ఉద్యోగ వేటలో వెనకపడుతున్నారని ఆ పత్రిక తెలిపింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల ‘విలీనం’పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ

ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్‌హెచ్‌సీఆర్

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు