గుజరాత్ ముస్లింల దారెటు?

  • 12 డిసెంబర్ 2017
మణినగర్

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ మణినగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు. ఆయన 2002, 2005, 2012 సంవత్సరాల్లో వరుసగా అక్కడి నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

మీరు మణినగర్‌లో చూసినట్టయితే, అభివృద్ధికి సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న ప్రమాణాలకు ఇది పూర్తిగా సరితూగినట్టు కనిపిస్తుంది.

కానీ పక్కనే ఉన్న షాహ్ ఆలమ్ అనే ముస్లిం బస్తీలోకి తొంగి చూస్తే ఇదసలు మనుషులు ఉండే ప్రాంతమేనా లేక మరేదైనా దేశమా అనిపిస్తుంది.

నీటి పైప్‌లైన్ ఈ బస్తీ గుండా పోతుంది, కానీ తమకు మాత్రం నీళ్లు దొరకవని ఇక్కడి మహిళలు చెప్పారు. ఈ బస్తీ పక్కనే ఒక చెరువు ఉంది. 2002 నాటి అల్లర్లలో ఈ చెరువులో కొన్ని శవాలు లభ్యమయ్యాయి.

అభివృద్ధిలో వివక్ష ఉన్న మాట నిజమని స్థానిక పాత్రికేయులు కూడా చెబుతారు. ముస్లిం బస్తీల్లో పారిశుధ్యం పరిస్థితి అధ్వానంగా ఉందని వారి అభిప్రాయం.

ఇక్కడ డిసెంబర్ 14న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే షాహ్ ఆలమ్ బస్తీలో నివసించే జనానికి అటు కాంగ్రెస్‌పై గానీ, ఇటు బీజేపీపై గానీ ఎవరిపైనా నమ్మకం లేదు. కహకషా పఠాన్ భర్త 2002 అల్లర్ల సమయంలో పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. "ఎవరు గెలిచినా మాకు ఒరిగేదేంటి?" అని ఆమె అంటారు.

చిత్రం శీర్షిక కహకషా పఠాన్ (మధ్యలో)

జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యం లేదు

అధికార భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా ముస్లింలకు టికెట్ ఇవ్వలేదు.

1980 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ కేవలం 1998లోనే ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ కూడా ఈసారి కేవలం ఆరుగురు ముస్లిం అభ్యర్థులకే టికెట్ ఇచ్చింది.

గుజరాత్‌ జనాభాలో ముస్లింలు 9.97 శాతం ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే ముస్లిం ఎమ్మెల్యేలు కనీసం 18 మంది ఉండాలి. కానీ అలా ఎప్పుడూ జరగలేదు.

1980లో మాత్రమే అత్యధికంగా 12 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. గుజరాత్ విధానసభలో మొత్తం 182 సీట్లుండగా, కనీసం 25 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. గుజరాత్‌లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింలకు అల్పసంఖ్యాకులనే గుర్తింపు కూడా లేకుండా పోయింది.

రాష్ట్రంలో మోదీ మైనార్టీ శాఖను ఏర్పాటు చేయలేదు. 2012లో జరిగిన విధానసభ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులకు కేవలం 2.37 శాతం ఓట్లు లభించాయి. ముస్లింలు ఇలా రాజకీయంగా వేరుపడిపోవడం దేన్ని సూచిస్తుంది?

ఇలా ముస్లిం అభ్యర్థులకు పార్టీ టికెట్లు ఇవ్వకపోవడం గురించి బీజేపీ నాయకురాలు శాయినా ఎన్‌సీని అడిగితే, ఆమె 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్' అనే పార్టీ నినాదాన్నే జవాబుగా చెప్పారు.

రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అచ్యుత్ యాజ్ఞిక్ ఈ విషయంపై మాట్లాడుతూ, "స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్‌లో తరచుగా అల్లర్లు జరుగుతూ వచ్చాయి. ఈ అల్లర్ల కారణంగా తాము రెండో తరగతి పౌరులమనే అభిప్రాయం ముస్లింలలో స్థిరపడిపోయింది. మరోవైపు, చదువుకున్న ముస్లింలలో వ్యాపారం పట్ల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చే తేడా ఏమీ ఉండదు" అని అన్నారు.

చిత్రం శీర్షిక మణినగర్‌లో ఓ దృశ్యం

87 సముదాయాలుగా విడిపోయిన గుజరాత్ ముస్లింలు

గుజరాత్‌లో బీజేపీ ఎలా బలపడుతూ వచ్చిందో అదే క్రమంలో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం కుచించుకుపోతూ వస్తోందని చాలా మంది భావిస్తారు.

"గుజరాత్‌లో ముస్లింలలో ఉన్న ఉపకులాలు యూపీ, కశ్మీర్‌ల కన్నా చాలా ఎక్కువ. ఇక్కడి ముస్లింలు 87 సముదాయాలుగా విడిపోయి ఉన్నారు" అని అచ్యుత్ అన్నారు.

2010లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ముస్లింలకు టికెట్లు ఇచ్చింది. వారు గెలిచారు కూడా. 2015లో జరిగిన నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి చెందిన 350 మంది ముస్లిం అభ్యర్థులు గెలుపు సాధించారు.

1985లో కాంగ్రెస్‌ నేత మాధవ్‌సింగ్ సోలంకీ రూపొందించిన ఖామ్ సమీకరణంలో ముస్లింలు కూడా భాగంగా ఉన్నారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముస్లింలపై ఆధారపడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మార్పు ఎందుకు వచ్చింది?

సూరత్‌లోని సోషల్ సైన్స్ స్టడీ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ కిరణ్ దేశాయి దీనిపై మాట్లాడుతూ, "ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిని గమనించినట్టయితే, ఎలాగైనా సరే ఎన్నికలు గెలవాలన్న ఆదుర్దా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ గుజరాత్‌లో బీజేపీ బీ టీంలా వ్యవహరిస్తోంది" అని అన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తనను తాను బీజేపీ లాగా మల్చుకుందని దేశాయి అభిప్రాయపడ్డారు. "రాహుల్ గాంధీ కనబడ్డ ప్రతి మందిరం చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల్లో గెలుపు సాధించడానికి ఆయన అనుసరిస్తున్న పద్ధతి సరిగ్గా బీజేపీ లాగే ఉంది. నిజానికి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్న అభిప్రాయం నాకైతే లేదు. అయినా ఇప్పటి వరకూ అది ముస్లింలను పూర్తిగా దూరం నెట్టలేదు. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ ముస్లింలను పూర్తిగా పక్కన పెట్టిందనే చెప్పాలి" అని దేశాయి అన్నారు.

చిత్రం శీర్షిక ముస్లిం బస్తీ షాహ్ ఆలమ్‌లో ఒక దృశ్యం

ముస్లింలలో యువ నేతలు కరవు

పార్లమెంటులో గుజరాత్ నుంచి ఒక్క అహ్మద్ పటేల్ మినహా ముస్లిం సభ్యులెవరూ లేరు. 2012లో కేవలం ఇద్దరు ముస్లింలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

బీజేపీ కుల సమీకరణాల ప్రాతిపదికపై టికెట్ల పంపిణీ చేస్తుంది. అయితే ముస్లింల విషయం లేవనెత్తితే తమ పార్టీ టికెట్ల కేటాయింపులో మతాన్ని ప్రాతిపదికగా తీసుకోదని చెబుతారు.

అయితే, గుజరాత్‌లో ముస్లింలు ఇంత వివక్షకు గురవుతున్నప్పటికీ వారి నుంచి నాయకత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? ఈ ప్రశ్నకు జవాబిస్తూ, "ముస్లింల నుంచి ఓ జిగ్నేష్ మేవానీ లేదా హార్దిక్ పటేల్ గానీ ఎందుకు ఎదిగి రావడం లేదని నాక్కూడా అనిపిస్తుంది. అయితే దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. పాటీదార్లతో ముస్లింలను పోల్చలేం. గుజరాత్‌లో పాటీదార్లు చాలా సంపన్నులు. వారిది బలమైన సముదాయం" అని దేశాయి చెప్పారు.

"అయితే దళితులతో ముస్లింలను పోల్చి చూసినపుడు మాత్రం జిగ్నేష్ మేవానీ వంటి వ్యక్తి ఎదిగి రావడానికి అవకాశం ఉందని అనిపిస్తుంది. అయితే ఇది కూడా అత్యాశే. ఎందుకంటే దళితులకు ఓ భావజాలం ఉంది. గుజరాత్ పరిసర రాష్ట్రాలలో దళిత ఉద్యమాలు బలంగా ఉన్నాయి. దీని ప్రభావం దేశవ్యాప్తంగా దళితులపై ఉంది" అని దేశాయి అన్నారు.

అయనింగా ఇలా అన్నారు: "అందుకే ముస్లింల నుంచి నాయకత్వం ఎదిగి రాకపోవడం అంతగా ఆశ్చర్యం కలిగించదు. గుజరాత్‌లో అల్లర్ల తర్వాత ముస్లింలు చాలా ప్రాంతాల్లో ఒకే బస్తీకి కుచించుకుపోయారు. ఈ పరిస్థితుల్లో ఎలాగోలా తమను తాము కాపాడుకోవడం కోసం ప్రయత్నించడమే వారికి నిత్యకృత్యమైంది. అలాంటప్పుడు వారి నుంచి ఇక నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది?"

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు