దుబాయ్లో ఖైదీలకు ఈ భారతీయుడే ఆపద్బాంధవుడు
రిపోర్టింగ్: జుబైర్ అహ్మద్
ఎస్పీ సింగ్ ఒబెరాయ్.. చాలామంది నేరస్థులకు ఆయనో ఆపద్బాంధవుడు. రకరకాల నేరాలు చేసి శిక్ష అనుభవించే ఖైదీలను విడిపించేందుకు ఆయన ఇప్పటివరకూ దాదాపు రూ.20కోట్లను ఖర్చు చేశారు.
అలా లాభపడిన వాళ్లలో ముగ్గురు హైదరాబాదీలు కూడా ఉన్నారు.
చాలా ఏళ్ల క్రితం పొట్ట చేత బట్టుకొని దుబాయ్ వెళ్లిన ఒబెరాయ్ అక్కడ సంపన్న వ్యాపారిగా ఎదిగారు. 2011 నుంచి ఆయన సంపాదనలో చాలా భాగాన్ని వివిధ కేసుల్లో శిక్ష పడ్డ ఖైదీలను విడిపించేందుకు ఖర్చు చేస్తున్నారు.
దుబాయ్లో మరణ శిక్ష పడ్డవాళ్లూ లేదా జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లూ వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. బాధిత కుటుంబం అంగీకరిస్తే కోర్టు నిర్ణయించిన మొత్తాన్నీ ఆ కుటుంబానికి నష్ట పరిహారంగా చెల్లించి ఆ శిక్ష నుంచి బయటపడే వెసులుబాటు ఉంది.
అలా చెల్లించే డబ్బుని ‘బ్లడ్ మనీ’ అని పిలుస్తారు.
బతుకు తెరువు కోసం దుబాయ్ వచ్చిన చాలా మంది ఇతర దేశస్థులు క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైలు పాలవుతుంటారు. స్వదేశాల్లో ఉన్న ఆ దోషుల కుటుంబ సభ్యులకు వారిని విడిపించడం తలకు మించిన భారంగా మారుతోంది.
దేశం కాని దేశంలో అలా జైళ్లలో మగ్గిపోతూ, మరణ శిక్షకు గురవుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నారు ఎస్పీ సింగ్. అందుకే గత ఆరేళ్లుగా వివిధ నేరాల్లో చిక్కుకొని అక్కడ శిక్షను అనుభవిస్తోన్న 93మందిని ఆయన విడిపించారు. దానికోసం తన సొంత డబ్బు దాదాపు రూ.20కోట్లను ఖర్చుచేశారు.
డ్రగ్స్, రేప్ లాంటి కేసుల్లో దోషులకు ఆయన సాయం చేయరు. ప్రమాదవశాత్తూ క్షణికావేశంలో తప్పు చేసిన వాళ్లకు మాత్రమే చేయూతనిస్తారు.
‘అవతలి వ్యక్తి పాకిస్తానీనా, పంజాబీనా అని నేను ఆలోచించను. మానవత్వానికి మాత్రమే విలువిస్తాను’ అని చెప్పే ఎస్పీ సింగ్తో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)