ప్రెస్ రివ్యూ: టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఉమా మాధవరెడ్డి

  • 13 డిసెంబర్ 2017
Image copyright Telangana CMO/Facebook

టీఆర్‌ఎస్‌లోకి ఉమా మాధవరెడ్డి

టీఆర్‌ఎస్‌లోకి వలసలజోరు కొనసాగుతున్నది. మాజీ మంత్రి, టీడీపీ నేత ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి గురువారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని 'నమస్తే తెలంగాణ' ఓ కథనం రాసింది.

మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో వారు భేటీ అయ్యారు.

ప్రభుత్వ విధానాలు, పరిపాలనతీరు నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకొన్నట్టు తమ మనోగతాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించారు. రాష్ర్టాభివృద్ధికి కలిసి రావాలని నిర్ణయించుకోవటం సంతోషకరమని కేసీఆర్ అన్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చుకుందామని చెప్పారు. ఆ తర్వాత ఉమామాధవరెడ్డి నమస్తే తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ, గురువారం ఉదయం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉమామాధవరెడ్డి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆమె భర్త, మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని నక్సలైట్లు హత్యచేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి భూగర్భ జలవనరులశాఖ మంత్రిగా, తర్వాత మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. మాధవరెడ్డి హత్య అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలను మోశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె భువనగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

Image copyright NARA CHANDRABABU NAIDU/FACEBOOK

పోలవరం ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసినా, అడ్డంకులు తలెత్తినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనంలో తెలిపింది.

పోలవరంపై అభ్యంతరాలున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకోవాలని ఒడిసా ప్రతిపాదించడం.. ఇందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించడంపై సీఎం ఇలా స్పందించారు.

మంగళవారం శాఖాధిపతుల సమావేశంలో ఉండగానే సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలు సీఎం దృష్టికి వచ్చాయి. ''పోలవరం జాతీయ ప్రాజెక్టు. దానిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదే'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నిజానికి... పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించడంతోపాటు అన్నిరకాల అనుమతులు ఇప్పించడం, సాంకేతిక సమస్యలను పరిష్కరించడంవంటివన్నీ కేంద్రమే చూసుకోవాలని రాష్ట్ర విభజన చట్టం చట్టం చెబుతోంది. ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రధాని అధ్యక్షతనే నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే... మొత్తం బాధ్యత ప్రధానిదే అని సీఎం చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.

పోలవరం టెండర్‌ వివాదాలు, ఆరోపణలు, అడ్డంకుల నేపథ్యంలో... మంగళవారం కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు వేగాన్ని పెంచడంపై చర్చించాల్సి ఉందని, సమయం ఇవ్వాలని కోరారు. దీంతో.. బుధవారం రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలో గడ్కరీతో భేటీకి ముహూర్తం కుదిరినట్టు ఆ పత్రిక రాసింది.

చంద్రన్న విలేజ్ మాల్ Image copyright facebook

రిలయన్స్‌ సరుకులతో చంద్రన్న మాల్స్‌

రేషన్‌ డిపోల స్థానంలో చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టిందని 'ప్రజాశక్తి' ఓ కథనంలో తెలిపింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు శ్రీనివాసరావుతోటలో ఒక మాల్‌, విజయవాడలో మరొక మాల్‌ను ప్రయోగాత్మకంగా సచివాలయం నుంచి రిమోట్‌తో ప్రారంభించారు. ఈ మాల్స్‌లో రిలయన్స్‌ సరకులు విక్రయిస్తారు. రాష్ట్రంలో తొలిదశలో 6,500 రేషన్‌ షాపులను విలేజ్‌ మాల్స్‌గా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 28 వేలకు పైగా ఉన్న చౌక ధరల దుకాణాలను ఆధునికీకరించి 'చంద్రన్న విలేజ్‌ మాల్స్‌'గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రేషన్‌ షాపు డీలర్లకు అధిక ఆదాయం, వినియోగదారులకు సరసమైన ధరలకే సరకులు లభించేలా విలేజ్‌ మాల్స్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే ఈ మాల్స్‌ వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్న వర్తకులు దెబ్బతినిపోతారన్న విమర్శలపై ముఖ్యమంత్రి మాట్లాడ లేదు.

పేదలకు ప్రభుత్వం అందించే బియ్యానికి బదులుగా వారు కోరుకుంటే అంతే విలువకు కావాల్సిన ఇతర వస్తువులు ఈ మాల్స్‌లో ఇస్తామని చెప్పారు. నిత్యావసర సరకులు సహా గృహోపకరణాలు, కిరాణా, సౌందర్య సాధనాలూ ఈ మాల్స్‌లో విక్రయిస్తారని చెప్పారు. వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులను ఎమ్‌ఆర్‌పి కన్నా 4 నుంచి 35 శాతం వరకు తక్కువ ధరకే ఈ మాల్స్‌లో లభిస్తాయన్నారు.

రేషన్‌ షాపును విలేజ్‌మాల్‌గా నవీకరించుకునేందుకు అయ్యే పెట్టుబడి వ్యయాన్ని 'పిఎం ముద్ర యోజన' పథకం ద్వారా రేషన్‌ షాపు డీలర్లకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. డ్వాక్రా, మెప్మా, జిసిసి ఉత్పత్తులు సహా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయోత్పత్తులను ఈ మాల్స్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు.

గుంటూరు శ్రీనివాసరావుతోటలో ఏర్పాటు చేసిన మాల్‌ నిర్వాహకురాలు తోట నారాయణమ్మ .. తమ భవనంలో సొంతంగా రూ.నాలుగు లక్షలతో సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని, మరో రూ.4 లక్షలతో రిలయన్స్‌ కంపెనీ ఫర్నీచర్‌, వస్తువులు సమకూర్చిందని తెలిపారు. తమకు మొత్తం విక్రయంపై 5 నుంచి 8 శాతం కమిషన్‌ ఇస్తామని చెప్పారని ఆమె తెలిపారు. రూ.నాలుగు లక్షల పెట్టుబడికి వచ్చే ఆదాయం ద్వారా ఎంత లాభం వస్తుందో చూడాలన్నారు.

Image copyright Getty Images

అమెరికా 'గోల్డెన్‌ వీసా' గడువు పొడిగింపు

సాక్షి: విదేశీయులు అమెరికాలో స్థిరపడేందుకు అత్యంత సులభమైన మార్గంగా భావించే ఈబీ-5 వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును డిసెంబర్‌ 22 వరకు పొడిగించారు. హెచ్‌-1బీ వీసా పొందటం కష్టతరమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం భారతీయులు సహా అనేక దేశాల ప్రజలు... గోల్డెన్‌ వీసాగా పేరుగాంచిన ఈబీ-5 వీసాకే దరఖాస్తు చేసుకుంటున్నారు.

1990లో అమెరికా కాంగ్రెస్‌ ఈబీ-5 వీసా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అమెరికాలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కొన్ని చోట్ల లక్షిత ఉపాధి ప్రాంతాల (టీఈఏ-టార్గెటెడ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఏరియాస్‌)ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో 5 లక్షల డాలర్ల పెట్టుబడి లేదా టీఈఏ కిందకు రాని ప్రాంతాల్లో 10 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టి కంపెనీలను స్థాపించి కనీసం పది మందికి ఉపాధి కల్పించగలిగిన విదేశీయులకు ఈ వీసాలు మంజూరుచేస్తారు.

వీసాలు పొందిన వారికి తొలుత గ్రీన్‌ కార్డు ఇచ్చి ఆ తర్వాత చాలా తొందరగానే పౌరసత్వం కూడా ఇస్తారు. ఈ కేటగిరీ కింద వీసాకు దరఖాస్తు చేస్తున్న భారతీయుల్లో 74% మంది అభ్యర్థులు నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. మరికొందరు ఆతిథ్య రంగంపై ఆసక్తిగా ఉన్నారు. అమెరికా వర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా భారీ సంఖ్యలోనే ఈబీ-5 వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

Image copyright Getty Images

నేతలపై కేసులు విచారణకు ప్రత్యేక కోర్టులు

ఈనాడు: ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వారిపై ఉన్న కేసుల విచారణకు 12 ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందనే విషయాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది.. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేశారు.

2014 ఎన్నికల నామినేషన్‌ పత్రాల ప్రకారం రాజకీయ నాయకులపై మొత్తం 1581 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. అయితే వాటిలో పది కేసుల్లోని నేతలు చనిపోవడంతో ఆ కేసులు కొట్టివేశారు.

ప్రస్తుత తేదీ వరకు ఎంతమంది రాజకీయనేతలపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే సమాచారం తెలుసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా కేంద్రం న్యాయస్థానాన్ని కోరింది. నేరం రుజువైన నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా నిషేధం విధించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం గత నెల సుప్రీంకోర్టును కోరింది. రాజకీయాల్లో నేరస్థులకు చోటు కల్పించకూడదనే ఉద్దేశంతోనే ఈసీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)