కండోమ్ ప్రకటనలు: ఏయే దేశాల్లో ఎలాంటి నియమాలున్నాయి?

  • 13 డిసెంబర్ 2017
కండోమ్, ప్రకటన Image copyright AFP
చిత్రం శీర్షిక ఇకపై కండోమ్ ప్రకటనలను పగలు ప్రసారం చేయడానికి వీల్లేదు

కండోమ్ ప్రకటనలు పిల్లలు చూసేందుకు తగినవి కాదంటూ, వాటిని కేవలం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్యనే ప్రసారం చేయాలని సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ప్రభుత్వ నియంత్రణ పైన, ఏవి అభ్యంతరకర దృశ్యాలు, ఏవి కావు అన్నదాని పైన మరోసారి చర్చ మొదలైంది.

అయితే కండోమ్ వంటి 'పెద్దలకు మాత్రమే' ఉద్దేశించిన ప్రకటనల విషయంలో ప్రపంచంలో వేర్వేరు దేశాల్లోనూ ఇలాంటి నియమాలున్నాయి. ఏ సమయంలో వాటిని ప్రసారం చేయొచ్చు అనే దానిపై కచ్చితమైన నిబంధనలున్నాయి.

'పెద్దలకు మాత్రమే' దృశ్యాలపై వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలు

బ్రిటన్: యూకేలో ఫ్రీ-టు-ఎయిర్ చానెళ్లు పూర్తిగా పిల్లలు చూడరాని దృశ్యాలను రాత్రి 9 నుంచి ఉదయం 5.30 గంటల మధ్య మాత్రమే ప్రసారం చేయొచ్చు. ప్రీమియమ్ చానెళ్ల విషయానికి వస్తే ఇది కొంచెం ముందు - అంటే రాత్రి 8 గంటలకు మొదలై, ఉదయం 5.30 గంటలకు ముగుస్తుంది.

దూషణలు, తీవ్రమైన హింసాత్మక దృశ్యాలకు కూడా ఈ నియంత్రణ వర్తిస్తుంది.

Image copyright Getty Images

అమెరికా: 'యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్' (ఎఫ్‌సీసీ) టీవీలో ప్రసారం చేసే దృశ్యాల ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఎఫ్‌సీసీ నియమాల ప్రకారం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలను ప్రసారం చేయడానికి వీలులేదు.

'అభ్యంతరకర దృశ్యాలు' అంటే ఏవైనా లైంగికపరమైన దృశ్యాలని ఎఫ్‌సీసీ నియమాలు పేర్కొంటున్నాయి. అయితే అభ్యంతరకర దృశ్యాలను పూర్తిగా నిషేధించలేమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Image copyright Getty Images

చైనా: టీవీల్లో ప్రసారమయ్యే అంశాలపై చైనాలో అతి కఠినమైన, సమగ్రమైన మార్గదర్శకాలు ఉన్నాయి. బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ నియమాల చట్టంలోని ఆర్టికల్ 32 టీవీల్లో అభ్యంతరకర దృశ్యాల గురించి వివరిస్తుంది.

అశ్లీల, మూఢనమ్మకాలు, హింసను ప్రేరేపించే దృశ్యాలను చూపించే కార్యక్రమాలను టీవీల్లో నిషేధించాలని ఈ చట్టం పేర్కొంటుంది. కండోమ్స్ లేదా సెక్స్-సంబంధిత ఉత్పత్తుల ప్రకటనపై చైనాలో ప్రత్యేకించి ఏ చట్టమూ లేనప్పటికీ, ఆ ప్రకటనల్లోని అశ్లీల దృశ్యాల విషయంలో మాత్రం నియమాలను అనుసరించాలి.

ఆస్ట్రేలియా: బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ చట్టం 1992 ప్రకారం, పిల్లలకు హాని కలిగించే దృశ్యాలను ఆస్ట్రేలియాలో ఉదయం 5 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ప్రసారం చేయకూడదు. టీవీల్లో ప్రసారమయ్యే ప్రకటనలు మరీ అతిగా, అభ్యంతరకరంగా ఉండనంత వరకు కండోమ్స్ లేదా అలాంటి ఉత్పత్తుల ప్రసారాలను నిషేధించరు. అయితే మరీ అభ్యంతరకరంగా ఉండే ప్రకటనల విషయంలో మాత్రం కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటారు.

భారత్‌లో భిన్నాభిప్రాయాలు

కొంతమంది భారతీయులు ప్రభుత్వ ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేయగా, మరికొందరు వాటిని సమర్థించారు.

పిల్లల సైకాలజిస్ట్ అచల్ భగత్, కండోమ్ ప్రకటనల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ''సెక్స్ అనేది అశ్లీలమైతే, మిగతావన్నీ విచ్చలవిడిగా కనిపిస్తుండగా, కేవలం కండోమ్ ప్రకటనలను మాత్రం నిషేధించడం ఏం సమంజసం?'' అని ప్రశ్నించారు.

పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ నిర్ణయంపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసారు.

మరికొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు:

కామసూత్ర కండోమ్‌లను ఉత్పత్తి చేస్తున్న రేమండ్ గ్రూప్, 'కండోమ్ ప్రకటనలన్నీ అశ్లీలం కాదు' అని ఎకనమిక్ టైమ్స్ పత్రికకు తెలిపింది. తాము మీడియా ప్రమాణాలను పాటిస్తున్నామని వివరణ ఇచ్చింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు