కండోమ్ ప్రకటనలు: నిరోధ్ నుంచి సాఫ్ట్ పోర్న్ వరకు

  • 13 డిసెంబర్ 2017
కండోమ్స్ Image copyright Getty Images

ఇకపై ఉదయం 6 నుంచి రాత్రి 10 మధ్య కాలంలో టీవీలలో కండోమ్ ప్రకటనలు కనిపించవు. సమాచార, ప్రసార శాఖ ఆ సమయంలో కండోమ్ ప్రకటనలు చూపించొద్దంటూ సూచనలు జారీ చేసింది. వాటిపై పలు ఫిర్యాదులు రావడంతో, పిల్లలు వాటిని చూడకుండా ఉండేందుకు ఈ సూచనలు జారీ చేశామని తెలిపింది.

కండోమ్ ప్రకటనలపై తామే సమాచార, ప్రసార శాఖకు ఫిర్యాదు చేసినట్లు అడ్వటైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సీఐ) సెక్రటరీ జనరల్ శ్వేతా పురందరే తెలిపారు.

ఇలాంటి నిషేధం ఒక్క భారత్‌లోనే లేదని.. వాటర్ షెడ్ టైమింగ్ పేరిట యూకే, అమెరికాల్లోనూ నిషేధం అమల్లో ఉందని తెలిపారు.

Image copyright Mib.gov.in

ప్రకటలను ఆపేస్తే అది సెక్స్ ఎడ్యుకేషన్‌పై ప్రభావం చూపదా?

టీవీలలో చాలా ఏళ్లుగా కండోమ్ ప్రకటనలు వస్తున్నాయి. మరి ఇప్పుడే నిషేధం విధించడానికి కారణం ఏమిటి? ప్రస్తుతం కండోమ్ ప్రకటనల్లో చూపిస్తున్న దృశ్యాలే దీనికి కారణమా?

కేవలం ప్రకటనలు చూపించడం తప్పు కాదని శ్వేత అన్నారు. ఈ కండోమ్ ప్రకటనల్లో ఎలాంటి సెక్స్ ఎడ్యుకేషన్ లేదని ఆమె తెలిపారు. అవి పిల్లలు చూడ్డానికి తగిన విధంగా లేవనేదే ఆమె ఆరోపణ.

కండోమ్ ప్రకటనల్లో వచ్చిన మార్పులేంటి?

మొట్టమొదట సురక్షితమైన సెక్స్‌ను ప్రోత్సహిస్తూ నిరోధ్ ప్రకటన వచ్చింది. ఇద్దరు యువతీయువకుల కాళ్లను మాత్రమే చూపిస్తూ, నేపథ్యంలో పాట ద్వారా ఒక సందేశాన్ని అందించారు.

అలాగే శేఖర్ సుమన్ కండోమ్ ప్రకటనను కూడా మర్చిపోలేం. ఈ ప్రకటనలో కండోమ్‌ను అడిగేందుకు ఇబ్బంది పడే యువకుడిగా శేఖర్ సుమన్ నటన ఆకట్టుకుంటుంది. సురక్షితమైన సెక్స్ కోసం ఉద్దేశించిన ఈ ప్రకటన కూడా చాలా పేరు పొందింది.

అలాగే భారత ప్రభుత్వ 'యహీ హై సహీ' నినాదం కూడా చర్చనీయాంశమైంది. దీనిలో హానీమూన్ బెడ్‌ మీద ఉన్న కండోమ్‌ల ద్వారా సురక్షిత సెక్స్ గురించి సందేశాన్ని అందించేందుకు ప్రయత్నించారు.

అదే విధంగా దూరదర్శన్ లో వచ్చిన కోహినూర్ కండోమ్ ప్రకటన కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఎలాంటి డైలాగులూ, నటనా లేని ఆ ప్రకటనలో 'ఈ రాత్రి తెల్లవారనే తెల్లవారదు' అన్న మాటలూ గుర్తుండిపోతాయి.

అలాగే 'జో సమ్‌ఝా, వహీ సికిందర్' అనే కండోమ్ ప్రకటన కూడా ప్రజల అభిమానాన్ని చూరగొంది. కండోమ్‌ను ఉపయోగించడం విజ్ఞుల లక్షణమని ఈ ప్రకటన ద్వారా తెలియజెప్పారు.

Image copyright MANFORCE CONDOMS

కాలంతో పాటు మారిన కండోమ్ ప్రకటనలు

కాలం మారింది. అలాగే కండోమ్ ప్రకటనలూ మారాయి. 1991లో వచ్చిన 'కామసూత్ర' ప్రకటన పెద్ద చర్చకు దారి తీసింది.

కండోమ్ ప్రకటనల్లో లైంగికత విషయాన్ని ప్రస్తావిస్తే, పూజా బేడీ నటించిన కామసూత్ర నేటికీ గుర్తుండిపోతుంది. ఈ ప్రకటనను మొత్తం బాత్ రూంలోనే చిత్రీకరించారు.

మ్యాన్ ఫోర్స్ ప్రకటన కూడా చాలా మందికి నచ్చింది. సన్నీ లియోని నటించిన ఈ ప్రకటనలో 'మన్ క్యో బహకా.. ' అన్న పాట చాలా మందికి గుర్తుండిపోతుంది.

రణవీర్ సింగ్ డ్యూరెక్స్ ప్రకటనలో నటించినప్పుడు చాలా విమర్శించారు. కానీ రణవీర్ దానిని సమర్థించుకున్నారు.

బిపాషా బసు, ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ నటించిన 'ప్లేగార్డ్' కండోమ్ ప్రకటన కూడా చాలా వివాదాస్పదమైంది.

స్పాట్ బాయ్ అనే వెబ్‌సైట్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ప్లేగార్డ్ పోస్టర్‌ను తీసేయించాడనే వార్తను ప్రచురించింది. 'ఇట్స్ టూ హాట్ టు హ్యాండిల్' అని సల్మాన్ అన్నట్లు ప్రచారం జరిగింది.

Image copyright Getty Images

ఎవరేం అంటున్నారు?

ఈ కండోమ్ ప్రకటన వెలువడినపుడే ఎఎస్‌సీఐకి ఫిర్యాదు అందిందని యాడ్ గురు అలెక్ పదంసీ తెలిపారు.

కామసూత్ర కండోమ్ టాగ్ లైన్ 'ప్లెజర్ ఆఫ్ మేకింగ్ లవ్' - అంటే సెక్స్ వల్ల కలిగే ఆనందం అని.

ఈ ట్యాగ్ లైన్ పట్ల ఎఎస్‌సీఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు, అది దానికి ప్రత్యామ్నాయం చూపలేకపోయింది. అందుకే ఈ కండోమ్‌ను నేటికీ అదే టాగ్ లైన్‌తో విక్రయిస్తున్నారు.

ఇటీవలి సమాచార, ప్రసార శాఖ సూచనలపై పదంసీ, ''పిల్లల్ని చాకలేట్ తినకూడదని నిషేధిస్తే, వాళ్లు ఇంకా ఎక్కువగా దాన్ని తింటారు. కొన్నిసార్లు రహస్యంగా, కొన్నిసార్లు దొంగతనం చేసి. అలాగే టీవీల్లో కండోమ్ ప్రకటనలను నిషేధిస్తే, పిల్లలు వాటిని యూట్యూబ్‌లో చూస్తారు. అంతే కానీ చూడడం మాత్రం మానరు'' అన్నారు.

Image copyright Getty Images

సురక్షితమైన సెక్స్ కోసం కండోమ్‌ల వినియోగం తప్పనిసరి అని కమ్యూనికేషన్ నిపుణురాలు రాధారాణి మిత్ర అంటారు. అందువల్ల టీవీల్లో వాటిని ప్రదర్శించే విషయంలో ఎలాంటి నిషేధమూ ఉండకూడనేది ఆమె అభిప్రాయం.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన పూనం ముత్రేజా, ''ప్రభుత్వం చాలా హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి మేం ప్రభుత్వంతో మాట్లాడతాం. ప్రకటనలో ఏదైనా అసభ్యత ఉన్నంత మాత్రాన వాటిని నిషేధించాల్సిన పని లేదు'' అన్నారు.

''జనాభా నియంత్రణ గురించి, హెచ్‌ఐవీ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ఈ ప్రకటన ఉద్దేశం. దేశంలో నేటికీ సుమారు 15 లక్షల అబార్షన్లు జరుగుతున్నాయి. అవాంఛిత గర్భధారణే వాటికి ప్రధాన కారణం. అలాంటి వాటిని నివారించేందుకు కండోమ్‌లు తప్పనిసరి. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే అయినప్పుడు మరి ఈ ప్రకటనలపై నిషేధం ఏ విధంగా సరైంది?'' అని ఆమె ప్రశ్నించారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు