ఝార్ఖండ్‌: ముద్దుల పోటీపై రాజకీయ రగడ!

  • 13 డిసెంబర్ 2017
ముద్దుల పోటీ Image copyright RAVI PRAKASH/BBC
చిత్రం శీర్షిక ముద్దుల పోటీ

ఝార్ఖండ్‌లోని పాకుడ్ జిల్లాలో జరిగిన ఓ మేళా (జాతర) ఇప్పుడు ఓ పెద్ద రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. డుమరియా అనే గ్రామంలో జరిగిన ఈ జాతరలో ముద్దుల పోటీ జరగడమే ఈ వివాదానికి మూలం.

ఈ ముద్దుల పోటీపై అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ప్రధాన ప్రతిపక్షమైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రెంటి మధ్యా వాగ్యుద్ధం మొదలైంది.

ఈ అంశాన్ని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని బీజేపీ సంకేతాలివ్వగా, అసలు బీజేపీ వద్ద ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలేవీ లేకపోవడం వల్లనే ఇలాంటి వాటిని లేవనెత్తి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తోందని జేఎంఎం అంటోంది.

మరోవైపు ఆదివాసీ సముదాయానికి చెందిన మేధావులు దీనిపై బీజేపీ వైఖరిని తప్పుపట్టారు.

Image copyright RAVI PRAKASH/BBC

అసలు వివాదం ఏమిటి?

లిట్టిపాడ బ్లాక్‌లోని తాల్‌పహాడీ గ్రామంలో డిసెంబర్ 9న జరిగిన సిద్దూ-కానూ మేళాలో భాగంగా 'దులార్-చో' అనే పేరుతో ఓ ముద్దుల పోటీ జరిగింది.

ఈ పోటీలో చాలా ఎక్కువ సేపు ముద్దు పెట్టుకున్న జంటకు బహుమతినిచ్చారు.

ఈ సందర్భంగా జేఎంఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్టీఫెన్ మరాండీ, సైమన్ మరాండీ అక్కడే ఉన్నారు.

'దులార్-చో'తో పాటు మేళాలో జరిగిన వివిధ పోటీలలో గెలిచిన విజేతలకు వారిద్దరూ బహుమతులు ప్రదానం చేశారు.

"సాయంత్రం పూట జరిగిన ఆ పోటీని దాదాపు 10 వేల మంది తిలకించారు. అక్కడ ఎవ్వరూ దీనిని వ్యతిరేకించలేదు. పైగా వారంతా చప్పట్లతో ఈ పోటీలో పాల్గొన్న దాదాపు పది జంటలను బాగా ప్రోత్సహించారు" అని మేళాలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయుడు రామ్‌ప్రసాద్ సిన్హా తెలిపారు.

ఈ మేళా ప్రతి యేటా వరి కోతల తర్వాత జరుగుతుంది. ఇందులో రకరకాల పోటీలు నిర్వహిస్తారు.

Image copyright RAVI PRAKASH/BBC
చిత్రం శీర్షిక బీజేపీ ఉపాధ్యక్షుడు హేమ్‌లాల్ ముర్మూ

ముద్దుల పోటీ చాటుమాటుగా జరగలేదు

తాల్‌పహాడీలోని డుమరియా మైదానంలో నిర్వహించిన ఈ మేళాకు సంబంధించిన కరపత్రం, ఆహ్వానపత్రంలో 'దులార్-చో' గురించి చాలా ప్రముఖంగానే పేర్కొన్నారని రామ్‌ప్రసాద్ సిన్హా బీబీసీకి తెలిపారు.

'దులార్-చో' అనే సంథాలీ మాటకు తెలుగు అర్థం 'ప్రేమ ముద్దు'. ఈ ఆహ్వానపత్రాన్ని పోలీసులకు, స్థానిక ఉన్నతాధికారులకు ముందే అందజేశారు.

ఆ తర్వాత భద్రతా ఏర్పాట్ల కోసం కొంత మంది అధికారులను అక్కడ నియమించారు.

Image copyright RAVI PRAKASH/BBC

జేఎంఎం ఎమ్మెల్యే గ్రామంలో జరిగిన పోటీ

జేఎంఎం ఎమ్మెల్యే సైమన్ మరాండీ స్వగ్రామం తాల్‌పహాడీ. గ్రామ పెద్దతో పాటు మొత్తం గ్రామ ప్రజలందరూ కలిసి ఈ మేళాను నిర్వహించారని ఆయన చెప్పారు. తాను కూడా స్వయంగా ఇందులో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు.

ఈ పోటీలో పాల్గొనడానికి జనం స్వచ్ఛందంగా వచ్చినట్టు సైమన్ మరాండీ తెలిపారు. మేళాకు సంబంధించిన కరపత్రంలోనే 'దులార్-చో' గురించి స్పష్టంగా పేర్కొన్నామని, ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్లు అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని సైమన్ ప్రశ్నించారు.

"ఇటీవల ఆదివాసీ సమాజంలో విడాకుల కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పోటీల ద్వారా భార్యాభర్తల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మేం భావించాం. ఇందులో తప్పేమీ లేదు" అని సైమన్ మరాండీ అన్నారు.

వ్యతిరేకిస్తున్న బీజేపీ

ముద్దుల పోటీ నిర్వహణకు జేఎంఎం ఎమ్మెల్యేలు సైమన్ మరాండీ, స్టీఫెన్ మరాండీలే బాధ్యత వహించాలని ఝార్ఖండ్ బీజేపీ ఉపాధ్యక్షుడు హేమ్‌లాల్ ముర్మూ అన్నారు.

ఈ అంశాన్ని తాము విధానసభ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయనన్నారు.

హేమ్‌లాల్ ముర్మూ బీబీసీతో మాట్లాడుతూ, "జేఎంఎం ఎమ్మెల్యేలు ఆదివాసీ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించారు. వీరు సంథాల్ పరగణాను రోమ్ లేదా జెరూసలెంలా మార్చాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలను మేం సాగనివ్వం. క్రైస్తవ మిషనరీల కనుసన్నల్లో పని చేస్తున్న ఈ ఎమ్మెల్యేలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వారి దిష్టిబొమ్మలను తగులబెడుతున్నారు. ఇందులో మేం రాజకీయం చేస్తున్నదేమీ లేదు. సంస్కృతిని కాపాడడం కోసమే మేం ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు.

Image copyright RAVI PRAKASH/BBC

'ఆదివాసీ సంస్కృతిపై దాడి'

ఈ నిరసనలో బీజేపీకి కేంద్రీయ సర్నా సమితి నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బబ్లూ మండా బీబీసీతో మాట్లాడుతూ, "ఇది ఆదివాసీ సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నమే. అందుకే మేం దీనికి నిరసనగా క్రిస్మస్‌కు ముందు రోజు సాయంత్రం రాంచీలో ప్రదర్శన చేయబోతున్నాం. మేం నల్ల జెండాలను ప్రదర్శిస్తాం" అని అన్నారు.

ఆదివాసీ ధర్మగురువు బంధన్ తిగ్గా కూడా ఈ పోటీని విమర్శించారు.

"ఆదివాసీ సమాజంలో ఇలాంటి పోటీలకు అనుమతి లేదు. మా సముదాయంలో సర్హుల్, కర్మా వంటి పండుగలు జరుపుకుంటాం. ఈ సందర్భంగా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నాట్యం చేస్తారు. కానీ బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడానికి సర్నా సముదాయం అనుమతించదు" అని ఆయన బీబీసీతో చెప్పారు.

Image copyright RAVI PRAKASH/BBC

జేఎంఎంలో గందరగోళం

తమ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలపై బీజేపీ విమర్శలు గుప్పించడంతో జేఎంఎంలో గందరగోళం నెలకొంది. ఈ విషయమై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాల్సిందిగా సైమన్ మరాండీని కోరామని జేఎంఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. అయితే, ఈ అంశంపై పార్టీ తమ ఎమ్మెల్యేలను బలపరుస్తోందని ఆయన చెప్పారు. అసెంబ్లీలో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తితే తాము సభలోనే జవాబు చెబుతామని ఆయనన్నారు.

సామాన్య ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశాలేవీ లేనందునే బీజేపీ ఇలాంటి పనికిరాని అంశాలను చర్చకు తెస్తోందని ఆయన ఆరోపించారు.

ఆదివాసీ మేధావుల నిరసన

బీజేపీ ఈ నిరసన ద్వారా ఆదివాసీలపై హిందూ మతతత్వాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తోందని ఆదివాసీ మేధావులు అంటున్నారు. సర్నా సమితి చేస్తున్న వాదనలను కూడా వారు తోసిపుచ్చారు.

ప్రముఖ ఆదివాసీ కవి డాక్టర్ అనుజ్ లుగున్ బీబీసీతో మాట్లాడుతూ, "దీనిని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా ఆదివాసీ సమాజాన్ని హిందూ దృష్టికోణంతో చూడడానికి ప్రయత్నిస్తున్నారు. వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆదివాసీ సమాజం హిందూ మతంలో భాగం కాదు. వాళ్ల ఆచారవ్యవహారాలు కూడా హిందూ సమాజంలో పాటించే ఆచారాలకు భిన్నంగా ఉండొచ్చు. ఆదివాసీ సమాజం తొలి నుంచీ స్వేచ్ఛాయుతమైంది. స్వేచ్ఛాప్రియత్వం వారిది. దీనిపై ఆంక్షలు విధించాలని చూడొద్దు. ఈ పోటీలో అరాచకత్వం ఏమీ లేదు. పాల్గొన్నవారంతా పెళ్లి చేసుకున్న జంటలే. వారంతా తమ ఇష్ట ప్రకారం ఇందులో పాల్గొన్నారు. దీనిని వివాదం చేయొద్దు" అని అన్నారు.

ఆదివాసీ విషయాలపై తరచుగా రాసే రచయిత అశ్విని కుమార్ పంకజ్ కూడా అనుజ్ అభిప్రాయంతో ఏకీభవించారు.

"ఇది ప్రేమను ప్రదర్శించే పద్ధతుల్లో ఒకటి. ప్రేమ చెడ్డదేమీ కాదని ఆదివాసీ సమాజం భావిస్తుంది. సంథాలీ సమాజం సంకుచిత పరిమితుల్లో ఉండిపోవడానికి ఇష్టపడదు. అందుకే వారు ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. కాబట్టి దీనిని కూడా ఓ కార్యక్రమంగానే చూడాలి తప్ప సంస్కృతిపై దాడిగా చూడగూడదు" అని ఆయన బీబీసీతో అన్నారు.

Image copyright RAVI PRAKASH/BBC

ప్రభుత్వ విచారణ

తాజాగా, ఈ వ్యవహారంపై ఎస్‌డీఎం జితేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆరోపించామని పాకుడ్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కమిటీ ఘటనాస్థలానికి వెళ్లి స్థానికులతో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ కమిటీ పిలిచినా ఎవరూ రాలేదు. దాంతో ఉట్టి చేతులతోనే కమిటీ సభ్యులు వెనక్కి వెళ్లారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)