గుజరాత్‌: అందరిలా సంతోషంగా బతికే హక్కు నాకూ ఉంది!

  • 14 డిసెంబర్ 2017
ఆయేషా బేగ్ Image copyright Vinayak Gaikwad
చిత్రం శీర్షిక ఆయేషా బేగ్

గుజరాత్‌ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాల్లో 687 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరందరికీ ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి.

వాస్తవానికి రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య ఇంతకంటే ఎక్కువే. కొందరు ట్రాన్స్‌జెండర్లు మహిళలుగా నమోదు చేయించుకున్నారు. మరికొందరు తాము ట్రాన్స్‌జెండర్లమని చెప్పుకోవడానికి మొగ్గు చూపరు.

ఎల్‌జీబీటీ వ్యక్తుల హక్కులు, ప్రయోజనాల కోసం కృషి చేసే 'లక్ష్య ట్రస్ట్'‌కు చెందిన ఆయేషా బేగ్.. ఓటర్ల జాబితాల్లో ట్రాన్స్‌జెండర్‌ను ప్రత్యేక జెండర్‌గా పేర్కొనాలనే నిర్ణయాన్ని స్వాగతించారు.

ఆయేషాకు మేకప్ వేసుకోవడం, చక్కగా కనిపించడం ఇష్టం. అయితే ట్రాన్స్‌జెండర్ అనే కారణంతో ఆమెకు ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగాన్ని నిరాకరించారు.

కాల్ సెంటర్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పుడు కూడా ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

బీబీసీతో ఆయేషా మాట్లాడుతూ- ''నా అస్తిత్వాన్నే అంగీకరించనట్టు అనిపించేది. దానిని తట్టుకోవడం మనసుకు చాలా కష్టంగా ఉండేది. ఉద్యోగ ప్రయత్నం తొలిసారి విఫలమైనప్పుడు నాపై నాకే అసహ్యం వేసింది. ఆత్మస్థైర్యం కూడగట్టుకుని, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం అలవర్చుకున్నా. సంతోషంగా బతికే హక్కు నాకుంది. నాలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతరుల గురించి కూడా ఆలోచించాను. నా కోసం, నాలాంటి వారి హక్కులు, ప్రయోజనాల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నా'' అని తెలిపారు.

ఆయేషా, లక్ష్య ట్రస్ట్ కృషి ఫలించి, ట్రాన్స్‌జెండర్లను ఓటర్ల జాబితాల్లో ‘ఇతరుల’ కేటగిరీ కింద పేర్కొనాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

వదోదరలోని యాదవ్ పార్క్ ప్రాంతంలో దాదాపు 40 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరిలో 35 మంది వద్ద కొత్తగా జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి. బరాన్‌పుర ప్రాంతంలో 100 మంది ట్రాన్స్‌జెండర్లు ఉండగా, 77 మందికి ఈ కార్డులు ఉన్నాయి.

ఓటరు గుర్తింపు కార్డులు పొందడం ఆయేషా, ఇతర ట్రాన్స్‌జెండర్లు సాధించిన తొలి విజయం. అయితే సామాజిక, ఆర్థిక, ఇతర అంశాల్లో వారికి ఇంకా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)