ప్రెస్ రివ్యూ: అమరావతి డిజైన్లలో రాజమౌళి సూచనలకు తిరస్కారం

  • 14 డిసెంబర్ 2017
అమరావతి అసెంబ్లీ డిజైన్ Image copyright PrajaRajadhani/FACEBOOK

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం సినీ దర్శకుడు రాజమౌళి ప్రతిపాదించిన డిజైన్లకు ఆమోదం లభించలేదని సాక్షి ఓ కథనంలో వెల్లడించింది.

బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో ముఖ్య భవనాల డిజైన్లపై చర్చ జరిగింది.

అసెంబ్లీ భవనాన్ని టవర్‌ ఆకారంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. టవర్‌ డిజైన్‌తోపాటు నార్మన్ ఫోస్టర్‌ సంస్థ ఇచ్చిన వజ్రం తరహా డిజైన్‌ను కూడా సమావేశంలో పరిశీలించారు.

ఆ రెండు డిజైన్లపైనా ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు సోషల్‌ మీడియాలో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తాను ప్రతిపాదించిన డిజైన్లు ఆమోదం పొందలేదని రాజమౌళి చెప్పారు.

"స్థూపం డిజైన్‌కు కొన్ని మార్పులు సూచించాను, నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ అడిగిన కొన్ని చిత్రాలు సేకరించి ఇచ్చాను. తెలుగు సంస్కృతి, చరిత్ర, వారసత్వం ప్రతిబింబించేలా డిజైన్ల ఎంపికకు సహకరించాలని సీఎం కోరారు. అందుకనుగుణంగా నేను కొన్ని సూచనలు చేశా. స్థూపాకృతిలో ఉండే సెంట్రల్‌ హాలులో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుచేసి, దానిపై సూర్యకిరణాలు పడేలా మార్పులు చేయాలని చెప్పాను. కానీ ఆ డిజైన్‌ ఆమోదం పొందలేదు" అని రాజమౌళి అన్నట్టు సాక్షి పేర్కొంది.

Image copyright MaanviNarcisa

కాలుష్యం: విజయవాడ మరో దిల్లీ

దిల్లీ స్థాయిలోనే విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

ఏటా అక్టోబరులో కాలుష్యం దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకు కారణం పొరుగున ఉన్న పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో రైతులు పొలాల్లో మిగిలిపోయిన వరి, గోధుమ గడ్డిని కాల్చడంతో వచ్చే పొగ!

సరిగ్గా ఇదే పరిస్థితి... ఇప్పుడు విజయవాడ చుట్టూ తలెత్తుతోంది. వరి దుబ్బులను రైతులు పొలాల్లోనే కాల్చేస్తున్నారు.

దీంతో పొగ సుడులు తిరుగుతోంది. ముందు ఏముందో తెలియని స్థాయిలో 'పొగ-మంచు' కమ్ముకుంటూ ఉండటంతో ట్రాఫిక్‌ జామ్‌లు, రోడ్డు ప్రమాదాలూ జరుగుతున్నాయి.

వరి కోతలకు ఇప్పుడు అందరూ యంత్రాలనే వాడుతున్నారు. ఆ యంత్రాలు వరి ధాన్యం కంకులను మాత్రమే కోస్తాయి. మిగతా గడ్డిని రైతులు పొలాల్లోనే కాల్చివేస్తున్నారు. దాంతో విపరీతమైన పొగ వస్తోందని ఆంధ్రజ్యోతి వివరించింది.

Image copyright Getty Images

2022కి 60 కోట్ల మందికి ఉద్యోగాలు

దేశంలో 2022 నాటికి అన్ని రంగాల్లో కలిపి 60 కోట్లకు పైగా ఉద్యోగాలు లభిస్తాయంటూ 'ఫిక్కీ-నాస్‌కామ్‌-ఈవై' రూపొందించిన నివేదికపై ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ ఉద్యోగాల సృష్టిలో మార్కెట్‌లోకి వస్తున్న కొత్త సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి.

డిజిటలీకరణకు తోడు, ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యాబోధన, వైద్య ఆరోగ్య రంగాల్లో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రస్తుతం లేని కొత్త రకం ఉద్యోగ అవకాశాలు రానున్న నాలుగైదేళ్లలో పుట్టుకొస్తాయని ఆ నివేదిక వెల్లడించింది. ఆ ఉద్యోగాల్లోనే దాదాపు 6 కోట్ల మందికి పైగా పనిచేస్తారని అంచనా వేసింది.

ఈ నివేదికలోని కొన్ని వివరాలు..

* 2022కి ఉద్యోగాల తీరు పూర్తిగా మారిపోతుంది. ప్రపంచీకరణ, పట్టణీకరణ, జనాభా పెరుగుదల, నూతన సాంకేతికతలు ఇందుకు దోహదపడతాయి.

* కంపెనీలు నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా రానున్న ఐదేళ్లలో దాదాపు 15 నుంచి 20 శాతం ఉత్పత్తిని పెంచుకోగలవు.

* కొత్త నైపుణ్యాలు నేర్చుకున్న 37 శాతం మందికి తగిన ఉపాధి దొరుకుతుంది.

* 2017లోని ఉద్యోగుల్లో 21 శాతం మంది తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

* తయారీ, సేవల రంగాల్లో ప్రస్తుతం 3.80 కోట్ల మంది పనిస్తున్నారు. 2022 నాటికి ఈ సంఖ్య 4.6- 4.8 కోట్లకు చేరుతుంది.

* 2022కు కొత్తగా రానున్న ఉద్యోగాల్లో 20-25 శాతం సంఘటిత రంగంలోనే ఉంటాయి. ఫలితంగా జీడీపీలో సంఘటిత రంగ వాటా ప్రస్తుతం ఉన్న 8 శాతం నుంచి 10 శాతానికి పెరుగుతుంది.

Image copyright Getty Images

విమానాల్లో నెట్‌ వినియోగం

విమాన ప్రయాణం సాగుతున్నప్పుడు, ప్రయాణికులు ఇంటర్నెట్‌ వినియోగించడంపై, భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఈ నెలాఖరులో తన అభిప్రాయాలు వెల్లడించనుంది.

ఈ విషయాన్ని ట్రాయ్‌ ఛైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ తెలిపినట్టు ఈనాడు పత్రిక పేర్కొంది.

ఏదైనా నెట్‌వర్క్‌ సంస్థ లేదా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను విమానాల్లో అందించాలనుకునే వారు, శాటిలైట్‌ సంస్థలతో సంప్రదించాల్సి ఉంటుందన్నారు.

దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఇంటర్నెట్ సేవలను అనుమతించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు