అభిప్రాయం: వివాహేతర సంబంధంలో శిక్ష ఎందుకు? ఎవరికి?
- దివ్య ఆర్య
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Thinkstock
అడల్టరీ చట్టం పురాతనం కాలేదా
వివాహేతర సంబంధం ఒక పురుషుడు, ఒక స్త్రీకి సంబంధించినది. దాని చుట్టూ ఒక కోరిక, ఒక నేరం, ఒక చట్టం, ఒక శిక్ష ఉంటాయి. కానీ ఇప్పుడు కథ మారుతోందా? ఈ కథలో దోషులెవరు, ఇలాంటి విషయాల్లో ఎలాంటి న్యాయం చేయాలి? అన్నదానిపై చాలా చర్చ జరుగుతోంది.
భార్య కాకుండా ఇతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుణ్ని శిక్షించే చట్టాన్ని సుప్రీం కోర్టు సమీక్షించింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల పురుషుణ్ని మాత్రమే శిక్షించే వ్యభిచార నేర చట్టం మారాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది.
ఎందుకంటే వివాహేతర సంబంధంలో స్త్రీ పురుషులిద్దరికీ సమానమైన పాత్ర ఉంటుంది.
ఈ ప్రశ్నకు నేను ఇక్కడే.. 'ఇద్దరూ లైంగిక చర్యలో పాల్గొన్నపుడు, శిక్ష కూడా ఇద్దరూ పంచుకోవాలి' అని సమాధానం రాసేస్తే బాగుండు అనుకుంటున్నా. కానీ అప్పుడు నా బ్లాగ్ ప్రారంభించక ముందే ముగుస్తుంది.
ఫొటో సోర్స్, Getty Images
సుప్రీమ్ కోర్ట్
కానీ ఇది చాలా క్లిష్టమైన, లోతైన విషయం.
మొదట ఈ 150 ఏళ్ల పురాతన పురుష-వ్యతిరేక, మహిళా-అనుకూల వ్యభిచార నిరోధక చట్టం ఏం చెబుతుందో చూద్దాం.
1860 నాటి భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497 ప్రకారం, ఈ కింది సందర్భాలలో పురుషుణ్ని దోషిగా పరిగణిస్తారు.
- ఒక మహిళ వివాహిత అని తెలిసీ శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు
- అందుకు ఆమె భర్త అనుమతి ఇవ్వనపుడు
- వివాహిత ఈ సంబంధానికి ఆమోదం తెలిపినప్పుడు
ఇది రుజువైన పక్షంలో పురుషుడికి 5 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ఆ పురుషుడు వివాహితుడైనప్పటికీ, ఆ మహిళ ఒంటరి కానీ, వితంతువు కానీ అయితే ఆ పురుషుణ్ని దోషిగా పరిగణించరని గుర్తించాలి.
ఫొటో సోర్స్, Thinkstock
దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఆహారంలో ఏదైనా అపరిశుభ్రమైంది కలిసినపుడు దాన్ని ఎలా కలుషితమైందని భావిస్తారో, అలాగే వివాహేతర సంబంధాన్ని కళంకంగా పరిగణిస్తారు.
స్త్రీపురుషుల వివాహాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ వివాహం వల్ల జన్మించే పిల్లలు ఆ వంశపారంపర్యాన్ని కొనసాగిస్తారన్న భావం ఉంది.
కానీ పురుషుడు ఒక వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల కలిగే సంతానంతో ఆ వంశ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్న వాదన ఒకటి ఉంది.
అదే స్త్రీ అవివాహిత అయితే, వంశ కళంకం అనే ప్రశ్న తలెత్తదు. వివాహితుడైన పురుషుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పటికీ చట్టం దృష్టిలో అది నేరం కాదు.
గుర్తించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే - ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధాలకు సంబంధించిన అన్ని నిర్ణయాలనూ పురుషులే తీసుకుంటారు.
పైన పేర్కొన్న వివరణను మరోసారి చదివితే, వివాహేతర సంబంధాలకు సంబంధించిన అన్ని నిర్ణయాలనూ పురుషుడే తీసుకుంటాడని, అందువల్ల శిక్ష అతనికే విధిస్తారని చట్టం భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఫొటో సోర్స్, Getty Images
ఇద్దరికీ సమాన బాధ్యత లేదా?
ఈ మొత్తం అంశంలో మహిళ పాత్ర కేవలం సెక్స్‌కు అంగీకారం తెలపడం వరకే పరిమితం. ఎందుకంటే అంగీకారం లేని సెక్స్‌ను అత్యాచారంగా పరిగణిస్తారు.
అందుకే ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. శారీరక సంబంధానికి అంగీకారం తెలపగలిగిన మహిళ, పురుషుడితో సమానంగా ఎందుకు శిక్షార్హురాలు కాదు?
నిజమే ! వివాహేతర సంబంధానికి అంగీకారం తెలపడంలో, ఆ సంబంధంలో భాగస్వామిగా ఉండడంతో మహిళలూ సమాన పాత్ర పోషిస్తారు. ఈ నిర్ణయం వారి తరపున ఆ పురుషుడు తీసుకున్నది కాదు, అందుకు వారికి భర్త అనుమతీ అవసరం లేదు.
అంతే కాదు, ఈ చర్చ జరగడం ఇది మొదటిసారీ కాదు. గతంలో 1954, 1985, 1988 లలో కూడా సుప్రీంకోర్టులో ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది.
42వ లా కమిషన్ కూడా వ్యభిచార నేరంలో స్త్రీని శిక్షార్హురాలిగా పరిగణించాలని సిఫార్సు చేసింది. కానీ చట్టంలో మాత్రం మార్పు చేయలేదు.
ప్రస్తుతం ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షిస్తున్న నేపథ్యంలో రెండు రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి మహిళను కూడా శిక్షార్హురాలిని చేస్తూ చట్టాన్ని సవరించడం లేదా వివాహేతర సంబంధాలను నాన్-క్రిమినల్ నేరంగా పరిగణించడం.
ఫొటో సోర్స్, OLIVIA HOWITT
ఐరోపా దేశాలలో నేరం కాదు
వ్యభిచారాన్ని క్రిమినల్ చట్టాల పరిధి నుంచి తొలగించాలనుకోవడం విప్లవాత్మక ఆలోచనేమీ కాదు. 150 ఏళ్ల క్రితం బ్రిటన్ మన దేశంలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టే సమయానికే ఐరోపా దేశాలన్నీ ఆ పని చేసేశాయి.
దీనిని నేరంగా పరిగణించే దేశాలు కూడా జరిమానా విధిస్తాయి తప్ప అక్కడ జైలు శిక్ష ఉండదు.
ప్రస్తుతం భారతదేశంలో ఈ చట్టాన్ని పున:సమీక్షిస్తున్న నేపథ్యంలో, ఇప్పటివరకు ఈ చట్టం కింద అరెస్టులు కానీ, క్రిమినల్ అభియోగాలు మోపడం పెద్దగా జరగలేదని గుర్తు పెట్టుకోవాలి.
దానికి సెక్షన్ 497 అవసరం లేదు. హిందూ వివాహ చట్టంలోనే ఆ అవకాశం ఉంది.
ఒక్కసారి ఆలోచించండి. ఒక భర్త లేదా భార్య వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటే, ఆ సమస్యకు పరిష్కారం - వారిని జైళ్లలో పెట్టడమా? లేక వారి బంధాన్ని బలోపేతం చేయడమో లేదా విడాకుల ద్వారా ఆ బంధాన్ని తెంచేసి, ఎవరికి వారు వేర్వేరుగా జీవించడమా?
ఫొటో సోర్స్, Thinkstock
శిక్షేపరిష్కారమా?
'ప్రతి నేరానికి జైలు శిక్ష అవసరం లేదు' అని 'నేషనల్ పాలసీ ఫర్ క్రిమినల్ జస్టిస్' 2007 లో హోమ్ శాఖకు సిఫార్సు చేసింది.
'బాల్య వివాహ నేరాలు, తిరుగుబోతుతనం వంటి హింస లేని నేరాల విషయంలో సరిదిద్దటం లేదా సహాయం అందించటం ముఖ్యోద్దేశంగా ఉండాలి కానీ శిక్ష, ప్రతీకారం కాదు' అని ఆ పాలసీలో పేర్కొన్నారు.
దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇపుడు చెప్పండి. ఇదంతా చెప్పకుండా నా బ్లాగ్‌ను ముందే ముగించాలా? వివాహేతర సంబంధాలు అన్న అంశం చాలా క్లిష్టమైనది. ముందు ముందు కూడా అది అలాగే ఉంటుంది. అందుకే ఎవరు నేరస్థులు, ఏది న్యాయం ? అనే విషయంపై సుప్రీంకోర్టుతో పాటు మీరు కూడా ఎందుకు ఆలోచించకూడదు?
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)