కాక పుట్టించనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు

  • 15 డిసెంబర్ 2017
భారత పార్లమెంటు Image copyright Getty Images

శుక్రవారం మొదలవుతున్న పార్లమెంటు శీతాకాలం సమావేశాలు వాడిగా, వేడిగా జరగొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షం ప్రదర్శించిన దూకుడు పార్లమెంటులోనూ కనిపించే అవకాశం ఉంది.

జీఎస్టీ, నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థ, రైతాంగానికి సంబంధించిన అంశాలతో పాటు వివిధ సమకాలీన అంశాలపై ప్రతిపక్షాలు పాలక పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి. రాఫేల్ విమానాల కొనుగోలు అంశంపై ఉభయ సభల్లో చర్చకు ప్రతిపక్షం పట్టుబట్టొచ్చని భావిస్తున్నారు.

ఈ సెషన్‌లో మొత్తం 14 సమావేశాలు జరుగుతాయి. జనవరి 5 వరకు, అంటే 22 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి.

Image copyright PTI
చిత్రం శీర్షిక కాంగ్రెస్ అధికార ప్రతినిధి భక్త చరణ్ దాస్

ప్రతిపక్షం ఏయే అంశాలను లేవనెత్తుతుంది?

ఈ సమావేశాల్లో మందిరం అంశంపై ప్రతిపక్షం ప్రభుత్వంతో తలపడవచ్చని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే క్రమంలోనే డిసెంబర్ 18న గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.

ప్రధానమంత్రి స్వరాష్ట్రం కావడం వల్ల ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంటు సమావేశాలలోనూ తప్పక కనిపిస్తుంది.

"ఇప్పటి దాకా ప్రభుత్వం అసలు విషయాల నుంచి దూరం జరుగుతూ వస్తోంది. అసలు విషయాలను మరుగుపర్చి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పినట్టుగానే నోట్లరద్దు వల్ల జీడీపీ రెండు శాతం పడిపోయింది" అని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి భక్త్ చరణ్ దాస్ అన్నారు.

మరోవైపు ఈ సమావేశాలకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని బీజేపీ అంటోంది. ఈ సమావేశాల్లో సానుకూల చర్చలు జరగాలని ఆశిస్తున్నట్టు పార్టీ తెలిపింది. పార్లమెంటు అనేది చర్చకు అత్యున్నత వేదిక అనీ, నిబంధనలకు అనుగుణంగా ఏ అంశం పైనైనా చర్చకు తాము సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.

Image copyright Getty Images

ట్రిపుల్ తలాక్‌పై కూడా..

ట్రిపుల్ తలాక్ అంశంపై ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ మేరకు ముందే సంకేతాలిచ్చారు.

అయితే ఈ బిల్లును కొన్ని రాజకీయ పార్టీలు ప్రమాదకరమైందిగా భావిస్తున్నాయి.

అయితే అన్నింటికన్నా రాఫేల్ విమానాల కొనుగోలు వ్యవహారంపై సభలో ఎక్కువ వేడి పుట్టొచ్చని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఇంకా ఆర్థికవ్యవస్థ స్థితిగతులు, జీడీపీ వృద్ధి రేటు తదితర అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి మొత్తంగా ఈ చలికాలం సమావేశాలు వేడివేడిగానే ఉండొచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Image copyright Getty Images

ఏయే బిల్లులు చర్చకు రావొచ్చు?

  • వస్తు సేవల పన్ను (నష్టపరిహారం) ఆర్డినెన్స్, 2017 స్థానంలో సవరణ బిల్లును తేవాలన్న ప్రతిపాదన ఉంది. ఈ ఆర్డినెన్స్‌ను 2017 సెప్టెంబర్ 2న జారీ చేశారు.
  • ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ సవరణ బిల్లు, భారత అటవీ సవరణ బిల్లు కూడా ప్రభుత్వ ఎజెండాలో ఉన్నాయి.
  • బ్యాంకులు, బీమా కంపెనీలు, ఫైనాన్స్ సంస్థల్లో డబ్బు నష్టపోవడానికి సంబంధించిన ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్ష్యూరెన్స్ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు సిద్ధంగా ఉంది.
  • ట్రిపుల్ తలాక్‌కు సంబంధించిన బిల్లు
  • వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) సంబంధించిన 123వ సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ఇటీవలే అన్నారు.
  • పౌరసత్వ సవరణ బిల్లు 2016, మోటారు వాహనాల సవరణ బిల్లు 2016, ట్రాన్స్‌జెండర్ల హక్కుల సంరక్షణ బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టొచ్చు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

నిసర్గ తుఫాను: ముంబయి నగరానికి 129 ఏళ్లలో మొదటి పెను తుపాను

అమెరికా: పోలీసు కాల్పుల్లో చనిపోయేదీ, కేసుల్లో అరెస్టయేదీ, జైళ్లలో మగ్గుతున్నదీ అత్యధికంగా నల్లజాతి వారే... ఎందుకు?

‘కేజీఎఫ్‌ గనుల్లో బంగారం కన్నా విలువైన లోహం.. వెలికితీతపై త్వరలో నిర్ణయం’

తిరుమల వేంకటేశ్వర స్వామి భూముల విక్రయం ఎందుకు.. టీటీడీ అధికారులు ఏమంటున్నారు

ట్రంప్‌ను నోరు మూసుకోమని వార్నింగ్ ఇచ్చిన హ్యూస్ట‌న్ పోలీస్ చీఫ్‌

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలా హోం క్వారంటైనా

జార్జ్ ఫ్లాయిడ్‌ను ఎందుకు చంపేశారు? ట్రంప్ బంకర్‌లో ఎందుకు దాక్కున్నారు

శ్రామిక్ స్పెషల్ రైల్లో నాలుగు రోజులుగా కుళ్లిన శవం, శుభ్రం చేసేవారు చూసేవరకూ ఎవరికీ తెలియలేదు

గ్రహశకలం 60 డిగ్రీల కోణంలో వచ్చి భూమిని ఢీకొట్టింది.. 30 కిలోమీటర్ల లోతున బిలం ఏర్పడింది