‘రామసేతు’పై చర్చ రేపిన సైన్స్ చానెల్

  • 15 డిసెంబర్ 2017
రామసేతు Image copyright NASA
చిత్రం శీర్షిక రామసేతు

ఒక అమెరికా టీవీ కార్యక్రమం ప్రోమోతో భారతదేశంలో 'రామసేతు' (ఆడమ్స్ బ్రడ్జ్) వివాదంపై మరోసారి వేడి రాజుకుంది.

అమెరికాకు చెందిన సైన్స్ చానల్ డిసెంబర్ 11న ట్విటర్‌లో భారత-శ్రీలంకలను కలిపే 'రామసేతు' కార్యక్రమంపై ప్రోమోను విడుదల చేసింది.

రామసేతు రాళ్లు, ఇసుకపై పరిశోధన చేయగా, వారధిని నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లను బయటి నుంచి తీసుకువచ్చినట్లు ఆ ప్రోమోలో పేర్కొన్నారు.

30 మైళ్లకు పైగా పొడవున్న ఆ వంతెన మానవ నిర్మితమని తెలిపారు.

సీతను రావణుని నుంచి రక్షించడానికి శ్రీరాముడు వానరసేన సహాయంతో ఈ వారధిని నిర్మించాడని రామాయణ కావ్యంలో ఉంది.

భారతదేశంలోనే కాకుండా రామాయణం ఆగ్నేయాసియాలో కూడా ప్రాచుర్యంలో ఉంది.

సైన్స్ చానెల్ ప్రోమోతో రామసేతు అనుకూలవాదులు, నేతలు, రాజకీయ పార్టీల మధ్య మరోసారి చర్చ ప్రారంభమైంది.

Image copyright Twitter

రామసేతు రాజకీయాలు

సైన్స్ చానెల్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ బీజేపీ ట్విటర్ హ్యాండిల్‌లో 'రామసేతు లేదని కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంటే, శాస్త్రీయ పరిశోధన బీజేపీ వాదనను సమర్థించింది' అని పేర్కొన్నారు.

కేంద్ర జౌళి, సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరాని 'జై శ్రీరామ్ ' అని ట్వీట్ చేశారు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కూడా దీనిని స్వాగతించారు.

రామసేతుపై చర్చ కొత్తదేమీ కాదు. 2005లో యూపీఏ-1 ప్రభుత్వం సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువ తవ్వేందుకు అనుమతి ఇవ్వడంతో వివాదం మొదలైంది.

ఈ ప్రాజెక్టు బంగాళా ఖాతం, అరేబియా సముద్రాల మధ్య తిన్నగా మార్గాన్ని ఏర్పరుస్తుంది. కానీ దాని వల్ల రామసేతును బద్దలు కొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓడలన్నీ శ్రీలంక చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.

ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా వాదిస్తున్న వాళ్లు సేతుసముద్రం ప్రాజెక్టుతో 36 గంటల సమయం, ఇంధనం ఆదా అవుతాయని వాదిస్తున్నారు.

Image copyright Twitter

హిందూ సంస్థలు ఈ ప్రాజెక్టు వల్ల 'రామసేతు' ధ్వంసం అవుతుందని వాదిస్తున్నారు. భారతదేశం, శ్రీలంకకు చెందిన పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టు వల్ల గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధుల్లో సముద్ర పర్యావరణం దెబ్బ తింటుందని అంటున్నారు.

ఈ ప్రాజెక్టును మొదట 1860లో భారతదేశంలో పని చేస్తున్న బ్రిటిష్ కమాండర్ ఎడీ టైలర్ ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే రామాయణంలో పేర్కొన్న వాటికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ తన పిటిషన్‌లో పేర్కొనడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది.

నివేదికల ప్రకారం, భారత పురావస్తు శాఖ కూడా ఇదే రకమైన అఫిడవిట్లు దాఖలు చేసింది.

అయితే హిందూ వర్గాల నిరసన ప్రదర్శనలతో ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం కంబ రామాయణాన్ని ప్రస్తావిస్తూ, స్వయంగా శ్రీరాముడే ఆ వారధిని ధ్వంసం చేశాడని పేర్కొంది.

నాటి నుంచి ఆ వివాదం సుప్రీంకోర్టులో ఉంది.

Image copyright Getty Images

సైన్స్ చానెల్ 'రామసేతు' కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రసారం చేస్తుందో స్పష్టత లేదు.

ప్రోమోలో పేర్కొన్న దానిని బట్టి పరిశోధనల్లో రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లు 7 వేల ఏళ్ల నాటివైతే, ఇసుక 4 వేల ఏళ్ల నాటిదని ఆ చానెల్ తెలిపింది.

ఆ రామసేతు వారధి మానవ నిర్మితం అయి ఉండవచ్చని సూచనప్రాయంగా పేర్కొంది.

పురాతత్వ శాఖ వాదన ఏంటి?

ఇంతకూ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే - అసలు భారత పురాతత్వ శాఖ ఇంతవరకు ఆ విషయాన్ని పరిశోధించిందా, లేదా?

2008 -2013 మధ్యకాలంలో డైరెక్టర్ మాన్యుమెంట్స్‌గా పని చేసిన ఏకే రాయ్ రిటైర్ కావడానికి ముందు, సేతుసముద్రం వివాదంపై సుప్రీంకోర్టు నోడల్ ఆఫీసర్‌గా ఉన్నారు.

''ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఉండడం వల్ల ఎవరూ దానిలో వేలు పెట్టడానికి వీల్లేదు. ఈ వివాదం ప్రజల మనోభావాలు, సాంప్రదాయాలకు సంబంధించినది'' అని రాయ్ అన్నారు.

Image copyright Getty Images

మరి పురాతత్వ శాఖ రామసేతుకు వ్యతిరేకంగా ఏదైనా చెబుతుందా?

''పురాతత్వ శాఖ ఎన్నడూ ఆ విషయాన్ని పరిశీలించడానికి ప్రయత్నించలేదు. అది మానవ నిర్మితమే అనడానికి ఆధారాలు కూడా లేవు. ఈ విచారణలో కొత్త సంస్థలను కూడా భాగస్వాములను చేయాలి. మన దగ్గర అవును, కాదు అనడానికి ఆధారాల్లేవు'' అన్నారు.

Image copyright ASI

సైకిల్‌పై శ్రీలంకకు..

రామేశ్వరానికి వెళితే అక్కడ అనేక చెరువులు కనిపిస్తాయి. అక్కడి స్థానికులు ఆ నీటిపై తేలుతున్న రాళ్లను చూపిస్తారు.

చరిత్రకారులు, పురాతత్వ పరిశోధకులు ప్రొఫెసర్ మఖన్ లాల్, ''పగడపు, సిలికా రాళ్లు వేడెక్కినపుడు, వాటిలో గాలి బందీ అయి, అవి తేలికగా మారి నీటిపై తేలుతాయి. అలాంటి రాళ్లను ఉపయోగించుకుని వారధిని నిర్మించారు'' అని వివరించారు.

''1480లో వచ్చిన తుఫానుకు ఆ వారధి చాలావరకు ధ్వంసమైంది. దానికి ముందు ప్రజలు ఆ వారధి మీదుగా భారత్ నుంచి శ్రీలంకకు సైకిళ్లు, కాలినడకన వెళ్లి వచ్చేవారు'' అని తెలిపారు.

అది రాముడు కాకుంటే మరెవరు నిర్మించారని ఆయన ప్రశ్నిస్తారు.

మరి రామాయణం, దానిలోని పాత్రలు కల్పితం అన్న మాటేమిటి?

''రామాయణం కల్పితమని మేము, మీరు, బ్రిటిషర్లు అంటున్నాం కానీ అలా అని రామాయణం తానంతట తాను ప్రకటించుకుందా?'' అని ప్రశ్నించారు ఆయన.

''ప్రపంచంలో చాలా చోట్ల మౌఖిక సాంప్రదాయాలు ఉన్నాయి. అన్నిటికీ రాతపూర్వక ఆధారాలు అడిగితే చదవలేని, రాయలేని వాళ్ల సంగతి ఏమిటి?''

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు