గమ్యం: తెలుగు విద్యార్థులు జేఈఈ, ఎంసెట్ కాకుండా ఇంకా ఏయే పరీక్షలు రాయొచ్చు?
- అనిల్ కుమార్
- బీబీసీ ప్రతినిధి
ఇంజనీరింగ్ చేయాలంటే జేఈఈ, ఎంసెట్ కాకుండా ఇంకా ఏమున్నాయి?
గతవారం 'గమ్యం'లో జేఈఈ కోసం ఎలా సిద్ధం కావాలి? ఎంత స్కోరు వస్తే మంచి సంస్థల్లో సీటు వస్తుంది? ప్రిపరేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వంటి అంశాలపై చర్చించాం.
అయితే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనుకునే వారికి జేఈఈ, ఎంసెట్ కాకుండా ఇంకా ఇతర పరీక్షలు ఏమైనా ఉన్నాయా? జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థలతో పాటు, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఏవైనా విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం ఇస్తాయా? ఈ అంశాలపై Careers360.comఛైర్మన్ మహేశ్వర్ పేరి ఇస్తున్న సలహాలు, నేటి 'గమ్యం'లో.
మీకు ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజీలో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. వాటికి మహేశ్వర్ పేరి సమాధానాలు ఇస్తారు.
ఫొటో సోర్స్, Getty Images
ఏపీ, తెలంగాణ విద్యార్థులు జేఈఈ, ఎంసెట్ కాకుండా ఇంకా ఏయే పరీక్షలు రాయవచ్చు?
జాతీయ స్థాయి విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విద్యాసంస్థలు అని రెండు రకాలుగా విభజించి ఈ అంశాన్ని చూడాలి. వేటికవే ప్రత్యేకమైనవి. అన్నీ కూడా నాణ్యమైన విద్యకు పేరు పొందిన సంస్థలు.
జాతీయ స్థాయి విద్యా సంస్థలు
- బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వహించే బిట్‌శాట్ రాస్తే ఆ సంస్థకు చెందిన నాలుగు క్యాంపస్‌లలో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. పిలానీ, గోవా, హైదరాబాద్, దుబాయ్‌లలో ఉన్న ఈ సంస్థలు ఉన్నత విద్యా ప్రమాణాలకు పెట్టింది పేరు. వీటిలో దుబాయ్‌లో చదవాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాగా మిగిలిన మూడు సంస్థల్లో గోవా పెద్ద క్యాంపస్. ప్రతి సంవత్సరం రెండున్నర నుంచి మూడు లక్షల మంది విద్యార్థులు దీనికి హాజరవుతారు.
- మణిపాల్ అకాడమీలో దాదాపు 2 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇది కూడా చాలా మంచి విద్యా సంస్థ.
- విట్టీ అనే పరీక్ష ద్వారా వీఐటీ డీమ్డ్ యూనివర్శిటీలో ప్రవేశం పొందవచ్చు. వెల్లూరు, చెన్నై, అమరావతి, భోపాల్‌లలో నాలుగు క్యాంపస్‌లు ఉన్నాయి. గత సంవత్సరం 2.23 లక్షల మంది ఈ పరీక్ష రాశారు.
- ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష రాస్తారు. ఈ యూనివర్శిటీకి కూడా కట్టన్కులతూర్ (తమిళనాడు), సోనేపట్ (హరియాణా), అమరావతిలలో క్యాంపస్‌లు ఉన్నాయి. అమరావతి క్యాంపస్‌లో ప్రవేశం దొరికితే తీసుకోవడానికి వెనకాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త క్యాంపస్ కాబట్టి తమ ప్రమాణాలను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు.
ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు
- ఆంధ్ర ప్రదేశ్‌లో మరో నాలుగు డీమ్డ్ యూనివర్శిటీలున్నాయి. ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులు వీటిపై కూడా దృష్టి పెట్టడం మంచిది.
- విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ నిర్వహించే జీఏటీ పరీక్ష గురించి వీటిలో ప్రథమంగా చెప్పుకోవాలి. దీన్ని జాతీయ స్థాయి పరీక్ష అని కూడా భావించవచ్చు. ఈ పరీక్షకు ఏపీ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా చాలామంది హాజరవుతారు.
- మరొకటి విజయవాడలోని విజ్ఞాన్ యూనివర్శిటీ నిర్వహించే వీశాట్.
- మూడోది హైదరాబాద్‌లోని ఐసీఎఫ్ఏఐ నిర్వహించే ఐటీశాట్. 2018 ఏప్రిల్‌లో ఈ పరీక్ష జరుగుతుంది.
- అమృత యూనివర్శిటీ నిర్వహించే పరీక్ష కూడా ముఖ్యమైనదే. దీన్ని కూడా జాతీయ స్థాయి పరీక్షగా భావించవచ్చు.
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
ఫొటో సోర్స్, Getty Images
ఏపీ ఎంసెట్‌ను తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఎంసెట్‌ను ఏపీ విద్యార్థులు రాయవచ్చా?
తెలంగాణ విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించే ఎంసెట్‌ను, ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌ను రాయవచ్చు. ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయి, రిజర్వేషన్లు, కోటాలు, ఇతర నిబంధనలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. కానీ వాటి గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్హత ఉంది కాబట్టి ముందు పరీక్షపై దృష్టి పెట్టి రెండూ రాయాలి. దీనివల్ల విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 2.5 లక్షల సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి సంవత్సరం సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్‌కు హాజరవుతారు.
తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశం ఎలా?
కర్ణాటక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చేయాలంటే కామెడ్ కే అనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల విద్యార్థులను కర్ణాటక కాలేజీల్లో చేర్చుకోవడానికి ఉద్దేశించిన పరీక్ష ఇది. వీటితో పాటు బెంగళూరులోని పీఈఎస్ యూనివర్శిటీ, రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జేఎన్ యూనివర్శిటీ వంటి ఎన్నో సంస్థలున్నాయి.
అలాగే తమిళనాడులోని శాస్త్ర యూనివర్శిటీ, సత్యభామ యూనివర్శిటీ, వెల్ టెక్, హిందుస్తాన్ యూనివర్శిటీ, సవిత యూనివర్శిటీ వంటివాటిలో కూడా ఆయా సంస్థలు నిర్వహించే పరీక్షలు రాసి ప్రవేశానికి అర్హత పొందవచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
ఎలా ఎంపిక చేసుకోవాలి?
అందుబాటులో ఎన్నో విద్యా సంస్థలున్నాయి. కానీ ఏ యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలనేది మరో పెద్ద సమస్య.
మీకు తగిన యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడానికి అవసరమైన సమాచారం, యూనివర్శిటీ ర్యాంకింగ్‌ల కోసం యూనివర్శిటీ ర్యాంకింగ్‌ల వివరాలు లింక్‌ను చూడండి.
దీన్ని బట్టి మీకు తగిన విద్యాసంస్థను ఎంచుకోండి. ఆల్ ది బెస్ట్.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)