ప్రెస్ రివ్యూ: 'అమరావతిలో జీవించండి.. ఆయుష్షు 20 ఏళ్లు పెంచుకోండి'

  • 16 డిసెంబర్ 2017
Image copyright tdp.ncbn.official/facebook

'అమరావతిలో ఉంటే ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది'

''సారవంతమైన నేల.. 30 కిలోమీటర్ల కృష్ణా తీరం.. చుట్టూ కాల్వలు.. ఏడాది పొడవునా పచ్చదనం.. నదిలో జలరవాణా.. అంతర్గత రవాణా వ్యవస్థ.. వీటన్నింటి కారణంగా అమరావతిలో నివసిస్తే 20 ఏళ్ల జీవితకాలం పెరుగుతుంది'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని ఈనాడు ఓ కథనంలో పేర్కొంది.

శుక్రవారం సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అమరావతిని ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు.

ప్రపంచంలో అయిదు ఉత్తమ నిర్మాణాల్లో అమరావతి ఒకటి కావాలని అభిలషించారు.

రాష్ట్రంలో విద్యారంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించి ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతులిచ్చామని.. దాని ఫలితంగానే ప్రపంచంలో ఏ విమానాశ్రయానికి వెళ్లినా అమరావతి వాసులే కన్పిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సిలికాన్‌ వ్యాలీలో అధికంగా సంపాదించే వారిలో మనవారే ముందుంటున్నారని కితాబిచ్చారు.

Image copyright TelanganaCMO/facebook

పూతరేకుల అర్థం కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డారో..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన బాల్యంలో ఎదుర్కొన్న భాషాపరమైన ఇబ్బందులను ప్రపంచ తెలుగు మహాసభల్లో గుర్తు చేసుకున్నారు.

''చిన్నప్పుడు నటుడు శోభన్‌బాబు చిత్రం చూశాను. అందులోని 'పూత రేకుల లేత వయసు' పల్లవిలో ఉన్న 'పూతరేకులు' అంటే నాకు అర్థం కాలేదు. సినిమా థియేటర్ బయట ఓ పుస్తకం కొని చూశాను. పూత రేకుల తియ్యదనం అని ఉంది. మరుసటి రోజు బడికెళ్లి, మా గురువు గారిని ఆ పదానికి అర్థమేమిటని అడిగా. ఆయన పూల రేకులై ఉంటాయిరా అన్నారు. కానీ మళ్లీ ఆ పదం చెప్పు అని కాగితంపై రాసుకున్నారు. ఆ పదానికి అర్థం కనుక్కొని చెబుతానని విజయవాడలోని ముదిగొండ వీరభద్రయ్య గారికి లేఖ రాశారు. దీంతో ఆయన ఆ పదానికి తియ్యదనం అని జవాబుగా ప్రత్యుత్తరం పంపారు" అని కేసీఆర్ వివరించారని నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.

Image copyright Getty Images

బలవంతపు భర్త చెర నుంచి తప్పుకొని రాత్రంతా అడవిలో తలదాచుకొన్న బాలిక

బలవంతపు పెళ్లిపై ఓ బాలిక చేసిన పోరాటం గురించి 'సాక్షి' ఒక కథనం ప్రచురించింది.

తనకు చదువుకోవాలని ఉందని చెప్పినా వినకుండా పెళ్లి చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.

పెళ్లి తర్వాత మూడు రోజుల అనంతరం వారి చెర నుంచి తప్పించుకుంది. ఈ క్రమంలో రాత్రంతా ఓ అడవిలో గడిపింది.

ఎట్టకేలకు తెల్లవారుజామున పోలీసులు, చైల్డ్‌లైన్‌ 1098ను సంప్రదించింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.

మర్పల్లి మండలానికి చెందిన ఓ బాలిక (17)కు తండ్రి లేడు. తల్లిపై బంధువులు ఒత్తిడి చేసి కర్ణాటకలోని చించోలికి చెందిన 40 ఏళ్ల వ్యక్తితో ఈ నెల 11న వివాహం చేశారు.

అయితే అతడికి ఇదివరకే పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారు. వివాహమయ్యాక ఈ నెల 13న సంగెంలో బంధువుల ఇంటికి తీసుకెళ్లారు.

Image copyright ysjagan/facebook

చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ

ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ఓ బహిరంగ లేఖ రాశారంటూ సాక్షి పత్రిక కథనాన్ని ప్రచురించింది.

రుణమాఫీ, బెల్టు షాపుల రద్దు హామీలపై చేసిన సంతకాలకు అర్థం ఇదేనా? అంటూ ఆ బహిరంగ లేఖలో జగన్ ప్రశ్నించారు.

''బెల్టుషాపుల రద్దుకు సీఎం కాగానే సంతకం పెడతా అని మీరు ఎన్నికలకు ముందు చెప్పారు. మొదటి సంతకాలకు అర్థం ఏమిటి ముఖ్యమంత్రి గారూ...? పూర్తిగా, బేషరతుగా వ్యవసాయ రుణ మాఫీ అని ప్రకటించి... రూ .87,612 కోట్ల వ్యవసాయ రుణాలకు ఇప్పటికి కేవలం రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. రైతుల వడ్డీలు, చక్రవడ్డీలు లెక్క వేస్తే అవే మీ రుణమాఫీ కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ ఉన్నాయి. బెల్టు షాపులన్నీ రెండో సంతకంతో రద్దు అన్నారు. బెల్టు షాపులు రద్దు కాలేదు సరికదా.. గ్రామాల్లో నివాసాల మధ్య, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, స్కూళ్ళ పక్కన మద్యం షాపులకు నాలుగు రెట్లు అనుమతులిచ్చిన ప్రభుత్వం మీదే!'' అని జగన్ ఆ లేఖలో పేర్కొన్నట్టు సాక్షి ప్రచురించింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్, బాలీవుడ్ నిర్మాత పహ్లాజ్ నిహాలని

'కండోమ్ కంటే.. గుట్కానే డేంజర్'

దేశంలో పగటి పూట కండోమ్ ప్రకటనల ప్రసారాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్, బాలీవుడ్ నిర్మాత పహ్లాజ్ నిహాలని స్పందించారు.

''కండోమ్‌ల వల్ల దేశం సురక్షితంగా ఉంటుంది. అది జనాభాను నియంత్రిస్తుంది. చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందనే కారణంతో పగటి పూట కండోమ్‌ ప్రకటనల ప్రసారాలను నిషేధించారు. మరి పాన్‌ మసాలా, గుట్కా ప్రకటనల సంగతేంటి? వాటి వల్ల కేన్సర్‌ వస్తుంది. స్మృతి ఇరానీ..! ముందు ఆ ప్రకటనలపై దృష్టిపెడితే మంచిది" అని ఆయన వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. ఎంపీల ‘విలీనం’పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న టీడీపీ

ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్‌హెచ్‌సీఆర్

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు