BBC SPECIAL: 'నిర్భయ' దోషులను సైన్స్ ఉరి దాకా ఎలా తీసుకెళ్లింది?

  • 16 డిసెంబర్ 2017
అత్యాచారం, నిర్భయ Image copyright Getty Images

నిర్భయ సామూహిక అత్యాచార సంఘటన జరిగి ఐదేళ్లయ్యింది. 2017 మే 5న భారత సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునిస్తూ, నలుగురు దోషులకు మరణశిక్ష ఖరారు చేసింది.

అయితే ఈ కేసులో దోషులైన వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌లకు ఉరిశిక్ష విధించడంలో ఆడోంటాలజీ అనే ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర కీలకమన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ఇన్‌స్పెక్టర్‌ అనిల్ శర్మ ఐదేళ్ల తర్వాత ఈ కేసు వివరాలు బీబీసీతో పంచుకున్నారు.

Image copyright Getty Images

ఆ రోజు ఏం జరిగింది?

"2012 డిసెంబర్ 15-16 మధ్య రాత్రి నేను వసంత్ విహార్‌లో డ్యూటీలో ఉన్నాను. రాత్రి 1.14 గంటలకు స్టేషన్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది రేప్ కేస్ అన్నారు. బాధితురాలిని పీసీఆర్ వ్యాన్‌లో సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు చేర్చాం.. మీరు వెంటనే ఇక్కడికి రండి అని చెప్పారు" అని అనిల్ శర్మ తెలిపారు.

"నేను నా టీంతో కలిసి సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు చేరుకున్నాను. మొట్టమొదటిసారి చూసినప్పుడు నిర్భయ ఒంటి మీద విపరీతమైన పంటి గాట్లు కనిపించాయి. క్రూర జంతువుల దాడికి గురైన మనిషిలా కనిపించింది. నా శరీరం కంపించిపోయింది. ఆమెను ఎక్కువ సేపు చూడాలంటే నాకు ధైర్యం సరిపోలేదు" అంటూ అనిల్ శర్మ ఆ భయంకర అనుభవాన్ని వివరించారు.

చిత్రం శీర్షిక నిర్భయ కేసును విచారించిన అనిల్ శర్మ

"నిర్భయను చూసి వచ్చిన తర్వాత మొదట నేను ఆమె స్నేహితుడి కాల్ డిటెయిల్స్ తీయించాను. ఆ తర్వాత ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేయాలని ఆదేశించాను. దాని ద్వారా ఆ రాత్రి బస్సు ఏయే ప్రాంతాల గుండా ప్రయాణించిందో తెలుసుకోవడం సులువైంది" అని ఆయన చెప్పారు.

"నా మనస్సులో అప్పటి నిర్భయ రూపమే పదే పదే మెదులుతోంది. తర్వాత నేను కొందరు డాక్టర్లతో మాట్లాడాను. ఇంటర్నెట్‌లో చదవడం ప్రారంభించాను. చాలా శోధించిన తర్వాత తెలిసిందేమిటంటే ఈ కేసులో ఆడోంటాలజీ నాకు ఉపయోగపడొచ్చని అర్థమైంది" అని అనిల్ అన్నారు.

పళ్లకు సంబంధించిన సైన్స్ శాఖను ఆడోంటాలజీ అంటారు. సాధారణంగా ఎవరైనా తమ ముఖాన్ని అందంగా కనిపించేలా చేసుకునేందుకు ఈ సైన్స్‌ను ఉపయోగిస్తారు. అట్లాగే, దవడ ఎముకల్ని బాగా తెరుచుకునేలా చేయడానికీ, ఏవైనా వంకరగా ఉంటే సరి చేయడానికి ఈ సైన్స్‌ను ఉపయోగిస్తారు.

Image copyright Getty Images

ఆడోంటాలజీని తొలిసారి ఉపయోగించింది అప్పుడే

ఈ సైన్స్‌లో ఒక శాఖ ఫోరెన్సిక్ డెంటల్ సైన్స్‌. దీని ద్వారా కేసు విచారణలో దంతాలు, దవడ ఎముకల సహాయంతో నేరానికి పాల్పడింది ఎవరనేది నిర్ధారించే వీలుంది. ఇది ఎలా సాధ్యమంటే - ఏ ఇద్దరు వ్యక్తుల దంతాలూ ఒకే తీరుగా ఉండవు.

"ఈ సైన్స్ సహాయంతో నిందితులను పట్టుకోవడం పోలీసు శాఖలో నా మొత్తం కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదు" అని అనిల్ చెప్పారు.

ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడేటప్పుడు అనిల్ గొంతు జీరబోయింది. కళ్ల నుంచి ఉబికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నీటి బిందువుల్ని కష్టంగా ఆపుకుంటూ, వణుకుతున్న గొంతుతో ఆయన మాట్లాడారు.

Image copyright AFP

ఆడోంటిక్స్ సైన్స్ ఎలా సహాయపడింది?

"దీని గురించి నేను ఆరా తీయగా కర్ణాటకలోని ధార్వాడకు చెందిన ఓ శాస్త్రవేత్త నాకు సహాయపడగలరని తెలిసింది. వెంటనే నేను ఆయనను సంప్రదించాను. ఈ కేసు విచారణలో సహాయం అందించేలా ఆయనను ఒప్పించగలిగాను" అని అనిల్ బీబీసీకి చెప్పారు.

నిర్భయ కేసు విషయంలో ధార్వాడలోని డాక్టర్ అసిత్ బీ ఆచార్యతోనూ బీబీసీ మాట్లాడింది. డాక్టర్ అసిత్ ధార్వాడలోని ఎస్‌డీఎం కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ ఆడోంటాలజీ విభాగాధిపతిగా ఉన్నారు.

Image copyright Dr. Ashith B. Acharya/BBC
చిత్రం శీర్షిక డా. అసిత్ బి. ఆచార్య

"2012 డిసెంబర్ 17న దిల్లీ పోలీసులు కోరిన మీదట సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ డాక్టర్లు నన్ను సంప్రదించారు. అప్పుడే నేను నిర్భయ ఒంటి మీద పంటిగాట్ల ఫొటోలు తీసిపెట్టాలని సలహా ఇచ్చాను" అని డాక్టర్ అసిత్ తెలిపారు.

ఆ ఫొటోలే మొత్తం విచారణలో కీలకంగా మారాయి. "బాధితురాలి శరీరం మీదున్న పంటి గాయాల ముందు స్కేలు ఉంచి వాటి క్లోజప్ ఫొటోలు తీసినప్పుడే ఆడోంటాలజీ ఫోరెన్సిక్ సైన్స్ ఉపయోగపడుతుంది. ముద్దాయిల పళ్ల గుర్తులతో వాటిని పోల్చి చూడాల్సి ఉంటుంది" అని డాక్టర్ అసిత్ బీబీసీకి చెప్పారు.

Image copyright Getty Images

నిర్భయకు చికిత్స జరుగుతున్న క్రమంలో అనిల్ ఆమెతో భావోద్వేగ అనుబంధాన్ని పెంచుకున్నారు.

ఆమెను గుర్తు చేసుకుంటూ అనిల్ ఒక కథను చెప్పారు. ''ఓ అమ్మాయి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండేది. ఆమె గదిలోంచి ఓ చెట్టు కనిపించేది. దాని ఆకులు రోజూ రాలిపోతుండేవి. చెట్టుపై ఆకులు రాలిపోతున్న కొద్దీ ఆ అమ్మాయికి తన మరణం సమీపిస్తున్నట్లు అనిపించేది. ఓ రోజు తండ్రితో 'ఈ చెట్టుపై ఆకులన్నీ రాలిపోయిన రోజు నేను కూడా బతకను' అంది. అది విన్న ఆమె తండ్రి ఆ చివరి ఆకు పడకుండా చెట్టుకే అతికించాడు. ఆ మరుసటి రోజు నుంచి ఆ అమ్మాయి కొత్త జీవితం ప్రారంభించింది. ఆమెలో జీవితేచ్ఛ మళ్లీ చిగురించింది. ''

నిర్భయ జీవితంలో కూడా అలాంటి ఆశను రేకెత్తించాలని, ఆమె మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేయాలని అనిల్ భావించారు.

దిల్లీలో నిర్భయకు చికిత్స జరుగుతున్నపుడు అనిల్ ప్రతి రోజూ ఆసుపత్రికి వెళ్లి ఆమెను చూసి వచ్చేవారు. ఆమె గదిలో ఒక టీవీని ఏర్పాటు చేయించాలని కూడా అనుకున్నారు. కానీ అది ఆయన మనసులోనే ఉండిపోయింది.

అప్పటికే ప్రభుత్వం నిర్భయను చికిత్స కోసం సింగపూర్‌కు తరలించే ఏర్పాట్లు చేసింది. అక్కడే నిర్భయ మరణించింది.

కానీ, ఎప్పటికైనా నిర్భయ కేసులో దోషులకు శిక్ష పడేలా చేయాలని అనిల్ గట్టిగా నిర్ణయించుకున్నారు.

Image copyright Getty Images

నిర్భయ శరీరంపై పంటి గాట్లు ఉన్న ఫొటోలను, ఆ కేసులో పట్టుకున్న నిందితుల పంటి గుర్తులను జనవరి 2, 2013న దిల్లీ పోలీసులు ధార్వాడ పోలీసులకు పంపారు.

ఆండోటాలజీ ఫోరెన్సిక్ సైన్స్ చాలా క్లిష్టమైనదని డాక్టర్ అసిత్ తెలిపారు. దీనిలో రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పడానికి కుదరదు.

''ఇలాంటి కేసుల్లో ఎన్ని ఎక్కువ పంటిగాట్లు ఉంటే కేసు అంత సంక్లిష్టంగా మారుతుంది. కేసు పరిశోధన, రిపోర్ట్ తయారు చేయడం మరింత కష్టం'' అన్నారు.

కానీ నిర్భయ కేసు వేరు. ఈ కేసు విషయంలో డాక్టర్ అసిత్ రోజూ 10-12 గంటల పాటు కష్టపడ్డారు.

Image copyright Getty Images

5 రోజుల తర్వాత నిర్భయ కేసు ఆండోటాలజీ రిపోర్ట్ వచ్చింది.

ఆ రిపోర్ట్ ప్రకారం, నలుగురు నిందితుల్లో వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌ల పంటి గుర్తులు నిర్భయ శరీరంపై ఉన్న పంటి గాట్లతో సరిపోలాయి.

''ఈ మొత్తం పరిశోధనలో ఇదే ముఖ్యమైన సాక్ష్యంగా మారింది. నిర్భయ కేసులో వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌లకు మరణశిక్ష పడేలా చేసింది ఇదే'' అని అనిల్ తెలిపారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం